| పురాణేతిహాసములు | శ్రీమహాభారతము | ఆనుశాసనికపర్వము - పంచమాశ్వాసము |
| సీ. |
‘ఒకతఱి దేవతలకు దైత్యులకు మహా | రణమయ్యె; నప్పోర రాహునస్త్ర సమితిచే నర్కుండుఁ జంద్రుండు సొలసిన | వెలుఁ గడంగుడుఁ దమ మొలసి వెగడు పడిన య ద్దివిజుల వడి నంటఁ దాఁకి య | య్యసురలు నొప్పింప నత్రికడకుఁ బాఱి ‘మమ్ముం గావు పరమదయాత్మక!’ | యనుడు నతండు చంద్రార్కతనువు |
|
| ఆ. |
లక్షతములు సేసి యసురసైన్యము రూపు | మాపె నిజకటాక్షమాత్రమునన; యతని నృపులకంటె నధికుఁ డందమొ హీనుఁ | డందమో నిజంబ యధిప! చెపుమ.’ |
347 |
| సీ. |
అనిన నూరకయున్న యర్జునుతోడ స | దాగతి యిట్లను ‘ధరణినాథ! సురపతి యాశ్వినుల్ సోమపానంబున | కర్హులు గారన్న నాశ్రయంబు పాటించి వారికై భార్గవచ్యవనుండు | దనమంత్రముల బల్మి ననిమిషులకు నెగ్గుసేయంగ న య్యింద్రుండు పోటున | వ్రేటున నాతని గీటడంచు |
|
| తే. |
బుద్ధి నొకశైలమును వజ్రమును రయమున | గొని మహోగ్రతఁ గవియ, న మ్మునివరుండు జలము చల్లిన శైలవజ్రములు దాను | ముడుగఁ బడి య బ్బలారాతి మూర్ఛవోయి. |
348 |
| వ. | ఒక్కింత సేపునకుం దెలిసె; నంతకు నమ్మునివరుండు మదుండను వాని శతయోజన దీర్ఘసహస్రదంతుని సృజించి పంపిన. | 349 |
| ఆ. |
వాఁడు సురగణంబు వాసవుఁ గబళింప | వారు ‘శరణుశరణు వరమునీంద్ర!’ యనిన, వారిఁ గాచె న మ్ముని; వారిచ్చి | రపుడు సోమపాన మాశ్వినులకు. |
350 |
| క. |
నీ వా చ్యవనుండును ధా | త్రీవరు సరిగామి యెట్లుఁ దెలుప కుడుగుదే?’ నా వినియు నొక్కమాటయు | నా విభుఁ డాడండ దాని కలయక మఱియున్. |
351 |
| వ. | వాయుదేవుం డన్నరదేవు వలని కరుణంజేసి యితని చేటోర్వని వాఁడై. | 352 |
| సీ. |
‘అకట! దత్తాత్రేయునకు భక్తి శుశ్రూష | చేసి కాదే యి వ్విశిష్టబల ప రాక్రమంబుల నొంది రాజుల కెల్లను | నెక్కుడై తా కృత మేల మఱవ? విను మీ వొకండవే యనిమిషాది సమస్త | భూతంబులును వృద్ధిఁ బొందు టవని దివిజులకృపన యీ తెఱఁ గెల్లజనములు | నెఱిఁగిన పని శాంతిఁ గొఱలి విప్ర |
|
| తే. |
కులము దైవస్వరూపం బగుట మనంబు | నందు దృఢముగ నిల్పి తదాశ్రయమున వెలయువాఁడ; వైనను మేలు వినుము నాదు | బుద్ధి’ యనవుడు నతఁడు ప్రబోధ మొలసి |
353 |
| క. |
‘నీ పనుపు చేసి బ్రదికెద; | నేపు నహంకృతియు విడిచి యెల్లవలన మే లాపాదించుచు విప్రుల | శ్రీపాదము లాశ్రయించి చెందెద శాంతిన్.’ |
354 |
| ఆ. |
అనిన సంతసిల్లి యనిలుఁ డానృపు ‘బుద్ధి | గలిగి బ్రదుకు’ మనుచు గారవించి వీడుకొల్పి చనియె; విప్రులపెం పిట్టి | దని యెఱుంగు కురుకులాగ్రగణ్య! |
355 |