పురాణేతిహాసములు శ్రీమహాభారతము ఆనుశాసనికపర్వము - పంచమాశ్వాసము
కృష్ణుడు ధర్మరాజునకు బ్రాహ్మణ ప్రభావంబు చెప్పుట (సం. 13-144-1)
వ. కృష్ణునకుఁ బ్రణమిల్లి ‘దేవా! భూదేవ మాహాత్మ్యంబు వినవలతు నానతీయవే’ యని వినయసంభృతుం డగుచుఁ బ్రార్థించిన నప్పార్థివుని మీఁదఁ గరుణామృతమయంబగు నాలోకనం బొలయ నద్దేవుం డాదరభరితుండై యిట్లనియె. 368
క. ‘ననుఁ బ్రద్యుమ్నుం డివ్విధ | మున నడిగిన వాని కేను ముద మందుచు నా
తని హితము గోరి కుంతీ | తనయాగ్రజ! యున్నరూప తగ నిట్లంటిన్‌.
369
సీ. వర్గత్రయము నపవర్గంబు సాధింప | నమర పితృ ప్రీతు లాచరింప
నైహికసుఖము లుపార్జింపవలసిన | వారికి విప్రుల చేరుగడలు;
దివిజులకైన నాయువు శ్రీయుఁ గీర్తియుఁ | దనరుట తత్ప్రసాదమునఁ జూవె!
యలిగి భస్మము సేయ వలచి పెం పొసఁగంగ | నవనీసురులు శక్తు; లట్టు లగుట
 
తే. వారిఁ గోపింపఁ జేయక వారలకుఁ బ్రి | యంబు సేయుచు వారు ప్రహర్ష మొందఁ
దనకుఁ గలభంగి నిచ్చు నతండు రెండు | భువనములయందుఁ బెంపును బొగడుఁ బడయు.
370
AndhraBharati AMdhra bhArati - AndhramahAbhAratamu - #00# parvamu - kavitraya bhAratamu - kavitrayamu - nannaya - tikkana - eRRana - nannyya tikkanna eRRana - andhramahabharatamu aandhramahaabhaaratamu ( telugu literature andhra literature )