| పురాణేతిహాసములు | శ్రీమహాభారతము | ఆనుశాసనికపర్వము - పంచమాశ్వాసము |
| వ. | నా కనిన యాశ్చర్యంబు సెప్పెద నాకర్ణింపుము. స్వతంత్ర ప్రవర్తనుండగు దుర్వాసుండు మనమందిరంబునకు వచ్చి మందహాసంబు సేయుచుఁ, గోపించుచు, సుముఖుం డగుచు, విముఖత్వంబు నొందుచుఁ, గుడువనొల్ల ననుచుఁ, బెక్కండ్రకుం గావించిన కూడు గూర దా నొక్కరుండు భుజించుచు, సెజ్జ నిద్రించుచు’ భూమి శయనించుచు, నెందేనిం బోవుచు, మరలి వచ్చుచుఁ బ్రవర్తించుచుండి యొక్కనాఁడు ‘కృష్ణా! నాకుం బాయసంబు మీఁద వేడుక పుట్టెడుఁ బెట్టింపవే’ యనఁ దత్‌క్షణంబ కావించినం గొంత కుడిచి, కొంత తన యొడలం బూయు మనినం బూసితి; నచ్చేరువ నున్న రుక్మిణిం జూచి కొంత య క్కాంతమేనం దాన పూసి రథ్యరూపంబుగా రథంబున న ప్పొలఁతిం బూన్చి రథారోహణంబు చేసి, వీథికి వెడలి, యమ్ముద్దియను ములుకోలం బొడుచుచు రథంబు నడిపింప, నాకుం గోపంబు నీర్ష్యయు నించుకయు జనింపకుండె; నేనుం జూచుచుం దోడన నడచితి; నప్పుడు యాదవు లాశ్చర్య కోపభయాయత్త చిత్తులై యనేక ప్రకారంబులం దమలోఁ బలుకుచుం జేయునది లేక కెలంకుల వచ్చుచుండ. | 371 |
| ఆ. |
రథముఁ దివిచి డస్సి రమణి మేదిని మీఁద | మ్రొగ్గ తిలఁగఁ బడిన డిగ్గ నుఱికి దానిమీఁద ధూళి దాఁ జల్లి వెసఁ బాఱె | నమ్మునీశ్వరుండు యామ్యదిశకు. |
372 |
| క. |
పాఱిన నాతని వెనుకన | పాఱితి; సంప్రార్థనా ప్రభాషణములతోఁ దేఱి మరలి యమ్ముని ‘మిముఁ | గాఱియ వెట్టితిఁ గదే యకట!’ యనుచు దయన్. |
373 |
| వ. | నన్నుం గనుంగొని ‘నీవు కోపంబు జయించితివి. నీకు వరం బిచ్చెదఁ గైకొనుము. | 374 |
| ఆ. |
‘ఎల్లవారుఁ దమకు నెంత గూర్తురు నీకు | నంత గూర్చి నిన్ను ననుసరించు వారు గాత; లోక వంద్యుండవై యెందు | మాఱులేక యతుల మహిమ మనుము.’ |
375 |
| వ. | అని నిర్దేశించి మఱియు నిట్లనియె. | 376 |
| క. |
‘నాయంగంబుల నెల్లం | బాయస మతిభక్తిఁ బూసి పాదతలమునం బూయవు గావునఁ గలుగు న | పాయం బఱకాల నీకు నవిలంఘ్యంబై. |
377 |
| క. |
విను పరమపదప్రాప్తికి | ననుగుణమైయుండుఁ గాన యదియును నశుభం బనరాదు; నీవు బ్రాహ్మణ | జనముల యెడ నడపు మిట్టి చందమ యెపుడున్.’ |
378 |
| వ. | అని పలికి రథవహన పరిశ్రాంతయగు మీతల్లిం జూచి ‘నీవు సౌందర్య సౌభాగ్యంబుల నప్రతిమానవై మాననీయత్వంబునం గృష్ణుని షోడశ సహస్రాంతఃపుర కాంతలకంటె నెక్కుడగు’ మని దీవనయిచ్చి యమ్ముని యంతర్హితుం డయ్యె. | 379 |
| ఆ. |
రుక్మిణియును నేను రుచిరసంపద నప్పు | డతిశయిల్లు నస్మ దంగకములఁ జూచి కొనుచు మిగులఁ జోద్య మందుచుఁ బ్రియ | మెడఁద నెలకొనంగ నింటి కరిగి. |
380 |
| ఆ. |
అందు వస్తుచయము ముందటికంటెను | బహులమును మనోజ్ఞ భంగికంబు నగుటఁ జూచి యద్భుతాయత్తచిత్తుల | మైతి; మిట్టివార లవనిసురులు. |
381 |
| క. |
కావున వారికి భక్తుఁడ | వై వెలయు కుమార!’ యనిన నతఁ డట్టిఁడయై తా వెలసె; నీవు నట్టిఁడ | వై వెలయఁగ వలయుఁ గౌరవాన్వయముఖ్యా!’ |
382 |
| వ. | అని చెప్పినం బ్రముదితమానసుం డగుచు నమ్మానవనాథుండు మాధవుతో ‘దుర్వాసుండు శర్వాంశ సంభవుం డని విందు; శర్వుని మహిమ విన వలతుం జెప్పవే’ యనిన నప్పురుషోత్తముండు భరితాదరుండై. | 383 |