పురాణేతిహాసములు శ్రీమహాభారతము ఆనుశాసనికపర్వము - పంచమాశ్వాసము
కృష్ణుఁడు ధర్మజునకు శివనామ నిర్వచనంబు చెప్పుట (సం. 13-266-1 (కుంభ))
క. వినుము నరేంద్ర! మహత్త్వం | బున నుండను నీశ్వరత్వమున నఖిల మహా
ముని జనములును మహేశ్వరుఁ | డని కొనియాడ హరుఁ డొప్పు నప్రతిముండై.
397
సీ. ఉగ్రత్వమునఁ బ్రతాపోన్నతి రుద్రనా | మము దాల్చె; దేవసంఘమున కెల్ల
మహతినాఁ బొలుపారు మహనీయ దేవత | గావున విను మహాదేవుఁ డయ్యె;
నఖిలసత్కర్మ ఫలాకారశుభములు | సేయు వేడుక కల్మి శివుఁ డనంగఁ
జనియె; సుస్థిరతేజమున వెలుఁ గొందుట | నంచిత స్థాణు సమాఖ్యఁ బరఁగె;
 
తే. జంగమస్థావరాత్మక సకలభూత | రూపబహుత నొందుట బహురూపనామ
ధేయుఁడై యొప్పె; ధూమ్రపుఁజాయ జటల | వలన ధూర్జటి యనుపేర వఱలె హరుఁడు.
398
ఆ. వినుము విశ్వు లనఁగఁ జను దేవతలు దన | యంద పొడమి; రట్టు లగుట విశ్వ
రూపనామకమున దీపితుం డయ్యె నా | త్రిపురమర్దనుండు నృపవరేణ్య!
399
సీ. బహునేత్రములు మేనఁ బ్రజ్వరిల్లుట సర్వ | తశ్చక్షు రాహ్వయోదాత్త కీర్తిఁ
బరఁగు; భూతము లెల్లఁ బశువులు దాఁ బతి | గావునఁ బశుపతి నా వెలుంగు;
వృషభస్థుఁడై యున్కి వృషవాహనుఁడు; మృత్యు | వనఁ జనుఁ బ్రాణ పాలాఖ్య సమత
నొంది; వహించు వేదోక్తాభిధానముల్‌ | మఱియుఁ బెక్కులు; వాని మహిమ వేద
 
ఆ. వేత్త లైనవారు వివరించి యన్యోన్య | బోధకత్వమునఁ బ్రభూత సౌఖ్యు
లగుచు సంతతము శివారామతా నిరూ | ఢాత్ములై చరింతు రధిపముఖ్య!
400
క. ఈ నామనిర్వచనములు | మానవుఁడు పఠించినను సమాహితమతియై
వీనుల నించిన సౌఖ్యము | నానందము నిందు నందు నతనికిఁ గల్గున్‌.’
401
వ. అని చెప్పి మఱియును. 402
క. ‘వ్యాసమహాముని లోక హి | తాసక్తిని శివుని విషయమై పఠ్యముగాఁ
జేసె నుపస్థాన మొకటి | యా సమధిక పుణ్యవాక్చయము విను మధిపా!
403
సీ. సర్వజగన్నిత్యసాక్షి లోకైక శు | భావహమూర్తి నిరామయుండు
ప్రథమ భూతములకుఁ బ్రథమతమంబు ను | దాత్తంబు నయిన భూతంబు శివుఁడు;
దన ముఖంబున నగ్ని జనియించెఁ, దను సభ | క్తిక సమారాధన కృతుల నియతిఁ
బాటించువారికి భవమోక్షణంబు గా | వించు, వేడుక మది నించువాఁడు
 
తే. వితత చతురాత్మకత్వ విశ్రుతి వహించి | కరుణఁ దత్తత్పదస్థిరా కలన కల్యు
లగు సపర్యారతులకు నయ్యై విధంబు | నీడ్య పదవుల నొసఁగు మహేశ్వరుండు.
404
తే. ఈ యుపస్థాన మచలిత హృదయవృత్తి | నరుఁడు శివలింగ సన్నిధానమున వాఙ్ని
రూఢముగఁ జేసి యాయురారోగ్యసకల | కామ్యవైభవైశ్వర్యముల్‌ గలిగి నెగడు.’
405
AndhraBharati AMdhra bhArati - AndhramahAbhAratamu - #00# parvamu - kavitraya bhAratamu - kavitrayamu - nannaya - tikkana - eRRana - nannyya tikkanna eRRana - andhramahabharatamu aandhramahaabhaaratamu ( telugu literature andhra literature )