పురాణేతిహాసములు శ్రీమహాభారతము ఆనుశాసనికపర్వము - పంచమాశ్వాసము
భీష్ముఁడు ధర్మజునకు సాధ్వసాధుజనుల నిరూపించి చెప్పుట (సం. 13-148-8)
సీ. ‘తమయంత నెఱుఁగరు ధర్మంబు సదుపదే | శమునను గాన రసాధుజనులు;
ధర్మబోధం బివ్విధంబులు రెంటను | గలిగెడువారు సాధులు; తదీయ
చరితంబు విను; విడువరు మలమూత్రంబు | లర్హంబు గానిచో నధిప! యతిథి
భోజనశిష్టాన్న భోజులు, దెరు విచ్చి | తగినవారలకుఁ బ్రదక్షిణముగ
 
తే. నరుగుదురు, నడపుదురు సత్యార్జవములు, | శరణు సొచ్చినఁ గాతురు, సురతగుప్తి
పరులు, నిజదారతృప్తులు, గురువినీతు, | లమలహృదయులు, సంతోష మారఁ గలరు.’
426
వ. అని వెండియు. 427
తే. ‘సాధు లింద్రియ విభ్రాంతి సంహరింతు, | రఘముఁ దెలిసి ప్రాయశ్చిత్త మాచరింతు,
రప్రకాశంబుగా ధర్మ మాచరింతు, | రఖిలభూతదయాళుత్వమారఁ గలరు.’
428
వ. అనిన విని యజాతశత్రుండు శంతనుపుత్త్రుతో నప్రయత్నులకు నర్థంబు సిద్ధించుట గలుగు; ధర్మపరులును నీతివిదులును నైన బలవంతులు బహుమార్గంబులగు సదుపాయంబుల నర్థంబు లాకాంక్షింప సిద్ధింపకుండెడుఁ; గొందఱకు సిద్ధించియు నవి భోగంబుల కుపయోగ్యంబులు గాకుండు; శిక్షలు పెద్ద లేకయుం గొన్ని చిత్తంబులందు విద్య లలవడు; శిక్షితులయ్యును నిర్విద్యు లగుటయుం గలుగుఁ; దెవుళ్ళ నోసియుం బోట్లం బడియును గొందఱు చావరు; పూరి పుడుక దాఁకి బలాధికులు చచ్చుట చూచెద మిట్లు గాఁ గతం బేమి? యెఱింగింపవే’ యనుటయు న మ్మహీపతి కమ్మహాత్ముం డి ట్లనియె. 429
AndhraBharati AMdhra bhArati - AndhramahAbhAratamu - #00# parvamu - kavitraya bhAratamu - kavitrayamu - nannaya - tikkana - eRRana - nannyya tikkanna eRRana - andhramahabharatamu aandhramahaabhaaratamu ( telugu literature andhra literature )