పురాణేతిహాసములు శ్రీమహాభారతము ఆనుశాసనికపర్వము - పంచమాశ్వాసము
శుభాశుభంబులు పూర్వ జన్మ కృత పుణ్యపాపంబులచేఁ గల్గునని చెప్పుట (సం. 13-149-10)
క. ‘మొలవం బెట్టని యట్టిది | మొలచునె? తొలుమేని దానముల నానార్థం
బులు సిద్ధించుఁ బ్రయత్నం | బులు లేకయు; నింత నిజము భూపవరేణ్యా!
430
తే. అలఘు తపములు దొలుమేనఁ గలిగెనేని | వెదకి కొనివచ్చు న న్నరు విపులభోగ
ములు పురాకృత వృద్ధసేవల ఫలించు | బుద్ధికలిమియు విద్యలఁ బొలుచుటయును.
431
క. తొలుమేన నహింసారుచి | గలిగిన దీర్ఘాయు వొందుఁ గారణభూతం
బులు భూవర! యివి యీ గుణ | ములు లేమియ కీడులకును మూలం బరయన్‌.
432
వ. కావున. 433
తే. వినుము దానంబుఁ దపమును వృద్ధసేవ | నము నహింసయు నియత కృత్యములు సర్వ
జనుల కి మ్మహాగుణములు మనమునందు | దృఢముగా నిల్పి నడపుము ధీరవర్య!’
434
వ. అని యుపదేశించి యాపగానందనుండు వెండియుఁ బాండవాగ్రజున కిట్లనియె. 435
సీ. ‘ఎప్పుడు ధర్మంబునెడ నాదరము గల | వానికిఁ గాలంబు దాన యిచ్చు
ధర్మతత్త్వ ప్రబోధముఁ బరిస్ఫుటముగాఁ; | గావున సుస్థిరభావశుద్ధి
సహిత తప శ్శ్రుత స్నాన దాన జపంబు | లను దేవతా పూజలను నమోఘ
కాలుఁడై వర్తింపఁగా ధర్మయోగంబు | సమకూరు; ధర్మంబు సాధనత్వ
 
తే. మొంది చేయించికొని చెప్పఁ బొందు నిర్మ | లాత్మకుండు సంసార పారాత్మకంబు
సత్య మజరామరము బోధ నిత్య మచ్యు | తము పరానంద మగు నప్పదంబు ననఘ!’
436
వ. అని నిర్దేశించి మఱియును. 437
తే. ‘కను వెలుంగు వేద వ్యాస మునివరుండు | నధిప! కృష్ణుండు నీకుఁ బరాయణంబు
చింత దిగఁ ద్రావి పాలింపు శాంతవృత్తిఁ | బ్రజల; సర్వంబునందును విజయి వగుము.’
438
క. అని యిట్లుపదేశించిన | యనిమిషతటినీ తనూజు నతుల వచనమున్‌
విని మో మలరఁగఁ బులకలు | దనువున జాదుకొన నొప్పె ధర్మజుఁ డధిపా!
439
సీ. అపుడు వీక్షించి సత్యవతీ సుతుండు శం | తనునందనునితోడ ‘ధర్మజుండు
దెలివొందె భవదుప దేశామృతంబున; | ననుజులుఁ గృష్ణుండు నాప్తసకల
రాజన్యులును ధృతరా ష్ట్రుండుఁ దానును | దగ ని న్నుపాసించి దయకుఁ బాత్ర
మయ్యె; వీడ్కొలుపు మియ్యవనీశుఁ; దఱితోడఁ | గ్రమ్మఱ నితఁడు నీ కడకు వచ్చు
 
ఆ. వాఁడుగాక!’ యనిన వాత్సల్యమున నార్ద్ర | మైన చూడ్కి న మ్మహాత్ముఁ డతనిఁ
జూచి ‘పురికిఁ జనుము; శుభపరంపరలకు | భాజనంబ వగుము రాజముఖ్య!’
440
AndhraBharati AMdhra bhArati - AndhramahAbhAratamu - #00# parvamu - kavitraya bhAratamu - kavitrayamu - nannaya - tikkana - eRRana - nannyya tikkanna eRRana - andhramahabharatamu aandhramahaabhaaratamu ( telugu literature andhra literature )