పురాణేతిహాసములు శ్రీమహాభారతము ఆనుశాసనికపర్వము - పంచమాశ్వాసము
భీష్ముఁడు ధర్మజు నూఱడించి కరిపురంబునకుఁ బంపుట (సం. 13-152-5)
వ. అని యనుజ్ఞ చేసి వెండియు. 441
సీ. ‘నీ బుద్ధి ధర్మైకనిష్ఠ గావుతను; స | మగ్ర దక్షిణ బహుయజ్ఞములు య
యాతి చందమున శ్రద్ధాన్వితంబుగఁ జేయు; | రాజ ధర్మంబునఁ బ్రకృతి రంజ
నము నాచరింపు; చుట్టములును జెలులును | బండిన వృక్షంబుఁ బక్షి కులము
లెట్లట్ల నిన్నాశ్రయించి సుఖించువా; | రర్కుని యుత్తరాయణము వచ్చు
 
తే. టరసికొనియుండి నాకడ కరుగుదెమ్ము | పొమ్ము; తల్లియుఁ దమ్ములు భూవరుండు
నీవు సుఖులరై యుండుఁడు నృపవరేణ్య!’ | యనుడు నానంద మొంది ధర్మాత్మజుండు.
442
వ. ‘అట్ల చేయువాఁడ’ నని సవినయంబుగాఁ బలికి దేవవ్రతునకు దండప్రణామం బాచరించి యిట్లు వీడుకొని. 443
క. మును లనుపఁగఁ గృష్ణాదులుఁ | జనుదేరఁగ నాత్మపురికిఁ జనియె ముదితులై
జను లెదురు కొనఁగఁ బుణ్యాం | గనలును విప్రులును వచ్చి కని దీవనతోన్‌.
444
క. సేసలు చల్లఁగ మహిమో | ద్భాసితుఁడై యిట్లు వోయి ధర్మజుఁడు నిజా
వాసంబు సొచ్చి గాంధా | రీసంభావన మొనర్చి ప్రియము దలిర్పన్‌.
445
ఆ. తల్లి కెఱఁగి ముదము ద్రౌపది కొనరించి | సకలపౌరజనుల జానపదుల
నెలమి యొలయ వీడుకొలిపి భూసురులకు | దానవిధుల సమ్మదం బొనర్చి.
446
వ. విపతులైన సతులకు సమగ్రధనంబు లొసంగి, ధృతరాష్ట్రునిం బ్రభూత పూజా కరణంబునం బరితుష్టునిం జేసి. 447
తే. తమ్ములును గృష్ణుఁడును బ్రమోదమునఁ దేల | నమ్మహీశ్వరుఁ డపుడు రాజ్యాభిషేక
మంగళము నొందినట్లు నెమ్మదిఁ దలంచి | గట్టియైన యూఱట పెంపుఁ గాంచి పొలిచె.
448
వ. అట్లు శోభిల్లి వారల నుచిత ప్రకార సమాచరణంబులకుం జన నియోగించి యభ్యంతర మందిరంబున కరిగె; న ట్లజాతశత్రుండు సమ్యగంగీకృత సామ్రాజ్యుం డయి జన సంపూజ్యం బగు చరితంబున సంప్రవర్తిలు చుండఁ బంచాశ ద్వాసరానంతరంబ వాసరపతి యుత్తరాయణగతుం డగుటయు. 449
AndhraBharati AMdhra bhArati - AndhramahAbhAratamu - #00# parvamu - kavitraya bhAratamu - kavitrayamu - nannaya - tikkana - eRRana - nannyya tikkanna eRRana - andhramahabharatamu aandhramahaabhaaratamu ( telugu literature andhra literature )