పురాణేతిహాసములు శ్రీమహాభారతము ఆనుశాసనికపర్వము - పంచమాశ్వాసము
ధర్మజుఁడు కృష్ణాదులఁ దోడ్కొని భీష్ముని యొద్దకుం బోవుట (సం. 13-153-6)
సీ. అ క్కౌరవేశ్వరుం డప్పుడు కదలి గాం | ధారిని ధృతరాష్ట్ర ధరణి విభుని
గొంతిని మున్నిడుకొని కృష్ణుఁ దమ్మునిఁ | దన తమ్ములను విదురుని యుయుత్సు
సంజయులను గృపాచార్యధౌమ్యుల మంత్ర | కోవిదులగు యాజకులను దోడఁ
గొని వస్త్ర చందనాగురు పుష్ప ఫలఘృత | కుండముల్‌ వట్టించుకొని యనేక
 
తే. రత్నములుఁ గాంచనంబుఁ దో రాఁగ నగ్ని | యంచితంబుగఁ దా సంఘటించి యోగ్య
జన సమానీతముగఁ జేసి సకల పరిజ | నంబుఁ గొల్వ మహావిభవంబు మెఱయ.
450
వ. చని భీష్ముని వీరశయనస్థానంబున కనతి దూరంబునం దేరు డిగ్గినం గృష్ణాదులును రథావతరణంబులు చేసిరి; తానును వారును బారాశర్య నారద దేవల ప్రభృతి పరమసంయమి సముపాస్యమానుం డగు న మ్మాననీయుం జేర నరిగి ముని జనంబులకు వినతుం డయి తదభినందితుం డగుచు నా ధర్మనందనుం డయ్యమరనదీనందనునకు నభివందనం బాచరించి సమీచీనధ్యానతత్పరుండైన య ద్దేవవ్రతు నుద్దేశించి. 451
తే. ‘అనఘ! వచ్చితి ధర్మనందనుఁడఁ; బ్రణతి | యాచరించెద; నాపలు కవధరింప
నవసరంబేని విను సమయంబు వార్చి | యగ్ని మొదలుగఁ దేఁ దగు నట్టివాని.
452
సీ. తెచ్చితి, ఋత్విజుల్‌ వచ్చిరి, హరియు నీ | తనయుఁడు ధృతరాష్ట్రుఁడును, సమస్త
బంధులుఁ గల మహీపతులు విప్రులుఁ బౌర | జనులు నేతెంచిరి సదయహృదయ!
వీరిఁ జూడుము కను విచ్చ్చి’ నావుడు నమ్మ | హాత్ముఁ డందఱఁ జూచి యా నృపాలు
కేలు దెమల్చుచు ‘మేలు చేసితి దైవ | యోగంబు గాదె నీ వొదవు టరయ
 
ఆ. మనుజనాథ! మాఘమాసంబు శుక్ల ప | క్షంబు నామనమున సంప్రమోద
మావహిల్లఁ జేసె’ నని యభినందించి | యతని కధిక హర్ష మావహించె.
453
వ. తదనంతరంబ ధృతరాష్ట్రునితో నిట్లనియె. 454
తే. ‘వేదశాస్త్ర పరిజ్ఞాన వృద్ధసేవ | నములు గలిగి యశేషధర్మములు నెఱిఁగి
వ్యాసమునిపతి దేవరహస్య మర్థిఁ | జెప్ప విని నిష్కళంకత నొప్పి తనఘ!
455
క. కావున భవితవ్యములకు | నీ వడలఁగ వలదు; పాండునృపపుత్త్రులు స
ద్భావమునఁ జూడ నేర్చిన | భూవర! తగ నీవు గన్న పుత్త్రులుగారే.!
456
క. వీరిం బరిపాలింపుము; | వీరలశుశ్రూషఁ జిత్త వృత్తి ముదమునం
గూరఁగ ధర్మసుతునిపైఁ | గారుణ్యము గలిగి పనులు గఱపుము నెమ్మిన్‌.
457
తే. ఏ నెఱుంగుదు నితఁడు నీయెడఁ బ్రియంబు | భక్తియును గల్గి యక్రూరభావుఁ డగుట
నీవు వత్సలత్వమున నీ నృపతిఁ బంచి | పనులు గొనుము కౌరవకుల భారధుర్య!
458
క. విను నీతనయులు దుర్యో | ధనాదు లవినీతిపరు లధర్మజ్ఞులు క్రో
ధను లతిలుబ్ధులు వారల | మనమున నిడి వగవ వలదు మనుజాధీశా!’
459
వ. అని పలికి కృష్ణు నాలోకించి. 460
AndhraBharati AMdhra bhArati - AndhramahAbhAratamu - #00# parvamu - kavitraya bhAratamu - kavitrayamu - nannaya - tikkana - eRRana - nannyya tikkanna eRRana - andhramahabharatamu aandhramahaabhaaratamu ( telugu literature andhra literature )