పురాణేతిహాసములు శ్రీమహాభారతము ఆనుశాసనికపర్వము - పంచమాశ్వాసము
భీష్ముఁడు శరీరంబు విడుచుటకు శ్రీకృష్ణు ననుజ్ఞఁ గొనుట (సం. 13-153-36)
తే. ‘దేవదేవ! జీవాత్మక! దేవవంద్య! | శంఖ చక్ర గదా పద్మ చారుహస్త!
వాసుదేవ! త్రివిక్రమ! వరద! పరమ | పురుష! ప్రణతి యొనర్చెదఁ గరుణఁ జూడు.’
461
వ. అనుచు నమస్కరించి. 462
ఆ. ‘బలము నీవ నాకు, భక్తుండ నీయెడ, | నాలుబిడ్డ లేని యట్టివాఁడఁ,
గావు నన్ను నధిక కారుణ్యమున నిమ్మ | నుజ్ఞఁ గమలదళమనోజ్ఞనయన!’
463
వ. అని వెండియు. 464
సీ. ‘మాధవ! పాండుకుమార వర్గమునకు | గతి నీవ; రక్షింపు కరుణ మెఱయ;
దుర్బుద్ధియైన యా దుర్యోధనుని తోడఁ | గృష్ణుఁ డెక్కడ నుండు గెలుపు గలుగు
నక్కడి కంటి నేఁ బెక్కుమాఱులు; నట్లు | చెప్పఁగా నా పంపు సేయ కతఁడు
దమవారి నెల్లను సమయించి తానును | సమసె; ని న్నెఱుఁగుదు; నమిత మహిమ
 
తే. నరుఁడు నారాయణుఁడు నను పరమమునులు | జగము రక్షించుటకుఁ గేలి జన్మ మొంది
సంచరించెద రని పరాశరసుతుండు | నారదుండును జెప్పిరి నాకుఁ దొల్లి.’
465
వ. అనిన విని వాసుదేవుండు దేవవ్రతు వదనం బత్యాదరంబున నాలోకించి. 466
ఆ. ‘కీ డొకప్డు లేదు, కృతపుణ్యుఁ డవు, తండ్రి | వలని భక్తి పెంపు గలవు; దానఁ
గాదె బంటుఁ బోలె గాంగేయ! మృత్యువు | నీవశమున నిలిచె నిర్భరముగ.
467
AndhraBharati AMdhra bhArati - AndhramahAbhAratamu - #00# parvamu - kavitraya bhAratamu - kavitrayamu - nannaya - tikkana - eRRana - nannyya tikkanna eRRana - andhramahabharatamu aandhramahaabhaaratamu ( telugu literature andhra literature )