| వ. |
నీకు నే ననుజ్ఞ యిచ్చితి వసువులం బొందు’ మనినం బరమానందంబునం బొంది పాండునందనులను ధృతరాష్ట్రునిం దక్కటి వారలనుం గనుంగొని ‘మీచేత ననుజ్ఞాతుండన కదా’ యని పలికి, యందఱం గౌఁగిలించుకొని ‘యానృశంస్యంబును సత్యంబును నిత్యంబులుగాఁ బాటించి బ్రదుకుం’ డని చెప్పి, తాను దొల్లి రాజుల గెల్చి తెచ్చిన ధనంబులు విప్రజనంబుల కిచ్చి, ధర్మతనయుం జూచి ‘యెల్ల బ్రాహ్మణులునుం బూజనీయులు; ఋత్విజులు నాచార్యులు వృద్ధులు విశేషించి పూజింప వలయువా’ రని నిర్దేశించి యూరకుండి, ధారణానుక్రమంబున సమాహితాత్ముం డయి వాయువుల సన్నిరుద్ధంబు చేసిన నవి యూర గ్ధ్వతిం గైకొనియె; నమ్మహాత్ముం డవయవంబులం బ్రాణంబులు వాపికొనుచు వచ్చునయ్యై చోట్లు శల్యరహితంబు లగుచుండె; నట్లగుటం గాంచి కృష్ణాదులగు నఖిలజనంబులు నాశ్చర్యభరితాంతః కరణు లగుచుఁ గీర్తించి; రా సంయమచతురునిచే సర్వాయతన సన్నిరుద్ధంబై యాత్మ మూర్ధంబు భేదించి మహోల్కాకారంబున నాకసంబున కెగసి కొంతద వ్వరిగి యంత నంతర్హితం బయ్యె; నప్పుడు పుష్పవృష్టి గురిసె, దేవ దుందుభులు మొరసె, నంబరంబున సిద్ధులు సాధ్యులుం బొగడుచుం బ్రమోదంబు నొంది; రిట్లు దేవవ్రతుండు దివంబునకుం జనుటయు.
|
468 |