పురాణేతిహాసములు శ్రీమహాభారతము ఆనుశాసనికపర్వము - పంచమాశ్వాసము
పరలోకగతుండైన భీష్మునకు నగ్నిసంస్కారంబు చేయుట (సం. 13-154-8)
సీ. ధర్మపుత్త్రుండును దమ్ములు విదుర యు | యుత్సులు నగరు కాష్ఠోత్కరంబుఁ
జందన దారు సంచయమును గొని సమ | స్థలి సమంచిత చితి యలఘు భంగి
విరచించి; రయ్యుధిష్ఠిరుఁడును ధృతరాష్ట్రుఁ | డును న మ్మరున్నదీ తనయు పుణ్య
గాత్రంబు సుస్నాన కలితంబు విహితాను | లేపంబుఁ బుష్పదామోపశోభి
 
తే. తంబు నుత్తమ క్షౌమావృతంబు నుజ్జ్వ | లాభరణ భూషితంబుఁగా నధికభక్తిఁ
జేసి; రప్పుడు సామంబు సెలఁగ హోమ | మాచరించిరి యాజకు లగ్ని యలర.
469
క. కనకములు మణులు భూసుర | జనసం ఘంబున కజాతశత్రుఁడు శ్రద్ధా
వినయప్రీతి యుతంబుగ | ననేకములు వేడ్క నొసఁగె నవహిత మతియై.
470
వ. తదనంతరంబ. 471
క. తలదిక్కు గవలుఁ బాదం | బుల దెస ధృతరాష్ట్ర పాండు భూపాగ్రతనూ
జులుఁ బట్టి యధిక విభవో | జ్జ్వల మగు పాడె పయి నిడిరి శవరత్నంబున్‌.
472
వ. అమ్మెయి నన్నలువురును వహించిరి; భీమసేనార్జునులు ధవళచామరంబు లిడిరి; యుయుత్సుం డుత్తమచ్ఛత్రంబు వట్టె; వృద్ధలగు కౌరవ స్త్రీ లాలవట్టంబులు వట్టిరి; ధౌమ్యుండు క్రియా కలాపంబు నడపె; నట్లు సొదసేర్చి దేవవ్రతుని దేహంబు శ్రౌతాగ్ని కాహుతి చేసి బహుకుండంబు లెత్తి ఘృతంబు ప్రయోగించి ప్రజ్వలింపఁ జేసి; రివ్విధంబునం బితృమేధంబు విభవమహితంబును, విధివిహితంబు నుంగా ననుష్ఠించి య క్కౌరవు లపసవ్యంబుగాఁ దిరిగి కృష్ణద్వైపాయన నారద దేవల ప్రభృతు లనుగమింప భాగీరథికిం జని సర్వభరతభార్యా సమేతంబుగా న గ్గాంగేయునకుఁ దిలోదక ప్రదానంబు లాచరించి; రట్టి సమయంబున. 473
AndhraBharati AMdhra bhArati - AndhramahAbhAratamu - #00# parvamu - kavitraya bhAratamu - kavitrayamu - nannaya - tikkana - eRRana - nannyya tikkanna eRRana - andhramahabharatamu aandhramahaabhaaratamu ( telugu literature andhra literature )