పురాణేతిహాసములు శ్రీమహాభారతము ఆనుశాసనికపర్వము - పంచమాశ్వాసము
పుత్త్రశోకాతుర యైన గంగాదేవి కృష్ణాదులం గనుంగొని దుఃఖించుట (సం. 13-154-18)
సీ. ఉదకంబులందుండి యుత్థితయై శోక | విహ్వలత్వంబున వికల గమన
యగుచు నెమ్మోముపై నశ్రులు గ్రమ్మగాఁ | జనుదెంచి కౌరవసమితి యెదుర
నిలిచి భాగీరథి ‘యలఘుండు తన కొడు | కిలఁ బరికింపఁగా నెట్టిభంగి
వాఁడయ్యెఁ? జరితంబుపోఁడిమి మీరెల్ల | నెఱుఁగుదు; రైనను నేను గొంత
 
తే. సెప్ప వినుఁడు! దృఢ వ్రతశీలుఁ, డమల | బుద్ధి రాజవృత్తాఢ్యుఁడు, భూరికృపుఁడు,
కార్యసంవేది, పితృభక్తి ధుర్యుఁ, డార్య | సమ్మతుండు, విద్యా పరిశ్రమ ఘనుండు.
474
తే. కాశిరాజ కన్యకలకుఁగాఁ బెనంగి | వానిచే గాసియైరి భూవరులు పలువు
రంబకై పూని వానిమహాబలంబు | జామదగ్న్యుండుఁ దెరలుపఁ జాల కరిగె.’
475
వ. అని విలాపంబు చేసి వెండియు. 476
తే. ‘అంతవాఁడు శిఖండిచే నట్టు లగుట | గనియుఁ బెక్కులు పఱియలు గాక యునికి
కతనఁ జేసి వజ్రమయంబు గాఁగ నోపు | నని తలంచెద నాడెంద మన్నలార!’
477
వ. అని వగచిన గంగాదేవికి దేవకీనందనుం డిట్లనియె. 478
AndhraBharati AMdhra bhArati - AndhramahAbhAratamu - #00# parvamu - kavitraya bhAratamu - kavitrayamu - nannaya - tikkana - eRRana - nannyya tikkanna eRRana - andhramahabharatamu aandhramahaabhaaratamu ( telugu literature andhra literature )