| పురాణేతిహాసములు | శ్రీమహాభారతము | ఆనుశాసనికపర్వము - పంచమాశ్వాసము |
| తే. |
‘నీవు శోకంబు దక్కుము; నీ సుతుండు | పరమగతి నొందె; శాప సంప్రాప్తిఁ జేసి వసువు మర్త్యుఁడై వర్తించె; నసదృశప్ర | భావుఁ డాతఁడు; వగపేల దేవి! నీకు? |
479 |
| చ. |
అతని శిఖండి యేల? యమరాధిపుఁడున్ సమయింపఁ జాలునే యతఁడు నిజేచ్ఛఁ జేసి నరు నంచిత దివ్య శరంబు లంగసం గతములు చేసి పాన్పుగ సుఖస్థితి మృత్యువు మాన్చియుండి కీ ర్త్యతిశయ మొంది తా వలచినప్పుడు వోయె విషాద మేటికిన్?’ |
480 |
| వ. | అని యూఱడిలం బలికెఁ; గృష్ణద్వైపాయన మునివరుండును బరమాదరణీయతత్పర వచనంబుల నజ్జాహ్నవీదేవికి నానందం బాపాదించెఁ; దదనంతరంబ యాత్మీయ సలిల సాంగత్యంబు నొందు నమ్మందాకినిచేతం గృష్ణాదులు నందఱు జనపతులును ననుజ్ఞాతులు నాశీర్వాద ప్రీతులునై మునులునుం దోడ నడవ నది వెడలి, రని యిట్లు భీష్ముని వృత్తాంతంబు వైశంపాయనుండు జనమేజయునకుఁ జెప్పిన నప్పుడమిఱేఁ ‘డిత్తెఱంగున న త్తాతకు వలయు విధానం బాచరించి చరితార్థుండైన యప్పార్థివ ముఖ్యుండు మఱి యెట్టి చందంబునం బ్రవర్తించె? మునీంద్రా! యెఱింగింపవే’ యని యడుగుటయు. | 481 |