| పురాణేతిహాసములు | శ్రీమహాభారతము | శాంతిపర్వము - ప్రథమాశ్వాసము |
| సీ. |
‘అధిప! నారదు చెలియలి కొడు కప్పర్వ | తుం డిద్దఱును మహీమండలమునఁ ద్రిమ్మరు వేడుక దివినుండి యొక్కటఁ | జనుదెంచి తమలోన సమయ మధిక నిష్ఠమైఁ జేసిరి నిజ చిత్తవృత్తు ‘లొం | డొరులకు దాఁపక యుండువార; మటుకాక దాఁప శాపార్హత వాటిల్లఁ | గలయది’ యని యిట్లు గలయఁ బలికి |
|
| తే. |
యుచిత వర్తనమున నుండి యొక్కనాఁడు | సృంజయునిఁ గాంచి యతఁడు విశిష్ట భక్తి నర్చనము సేసినను ‘భవదాలయమున | ననఘ! వసియింతుమే కొన్ని దినము’ లనిరి. |
246 |
| వ. | అని పలికిన నా పృథ్వీపతి ప్రియంబంది సుకుమారి యనుపేరం బరఁగిన నిజనందన రావించి ‘యిక్కన్నియ మీకుం బరిచర్య సేయ సమాధానంబున నుండుం’డని యన్నెలంతతో ‘నీవు దేవోపచారంబుల వీరి నారాధింపు’ మని నియోగించి వలయు వస్తువులు సమగ్రంబులుగా సమకట్టినం, బ్రీతులై యమ్మునులు సుఖంబున్న సమయంబున. | 247 |
| సీ. |
అల్లఁదనంబున యనువు మైకొనఁజూచు | నడపు కాంతికి వింత తొడవు గాఁగ, వెడవెడ నూఁగారు వింతయై యేర్పడఁ | దారనివళులలో నారు నిగుడ, నిట్టలు ద్రోచుచు నెలవులకల మేర | లెల్లను బిగియెక్కి యేర్పడంగఁ, దెలుపును గప్పును వెలయంగ మెఱుఁగెక్కు | తారకంబులఁ గల్కితనము దొడరఁ |
|
| ఆ. |
జరణములును నడుముఁ జన్నులుఁ గన్నులు | జవ్వనంబు చెన్ను నివ్వటిల్లు చునికిఁ దెలుప సృంజయుని పుత్రి మెలఁగు వి | ధంబు నారదునకుఁ దగు లొనర్చె. |
248 |
| క. |
నారదుఁడు మదనబాణా | సారము దనుఁ బొదువ ధైర్యసారమెడలి దు ర్వార మనోవ్యధవంతం | గూరి క్రమంబునఁ గృశాంగకుండయ్యె నృపా! |
249 |
| వ. | అట్లు కాముబారిం బడి నలంగియుఁ దనతో నుగ్గడింప సిగ్గువడి. | 250 |
| చ. |
వెనుఁబడు చిత్తవృత్తియును, వెల్వెలఁ బాఱెడు నాననంబు నై యనిశముఁ గుందు, మామఁ గని యల్లుఁ ‘డితం డిటు లేల వంతఁ బొం దెనొ!’ యనుచింత నొంది, తన దివ్యమతిం బరికించి కాంచి ‘కూ డునె సమయంబు దప్పఁగఁ? గడుం గుటిలాత్ముఁడవైతి నా యెడన్.’ |
251 |
| ఆ. |
రాచకూఁతు మీఁద రాగంబు పుట్టుట | నాకుఁ జెప్పవైతి; నీకు శాప మిత్తు; నమ్మృగాక్షి నీవు వరింపక | నిలువలేవు మరుఁడు బలియుఁడగుట. |
252 |
| వ. | పాణిగ్రహణానంతరంబ వానర వదనుండ వగు’ మనవుడు నారదుండు ‘నీకు నాకలోకంబునకుం జనుట లేకుండెడు’ మని ప్రతిశాపం బిచ్చినం, బర్వతుం డచ్చోటు వాసిపోయి భూజనంబులు పూజింపఁ బ్రవర్తిల్లుచుండె. | 253 |
| శా. |
శాప ప్రాప్తికి నోర్చి తా నడిగి యా చంద్రాస్య నన్నారదుం డా పృథ్వీపతి యీఁ బ్రియంబున వివాహం బయ్యె నమ్మాత్రలో భూపా! యమ్ముని వానరాననతమైఁ బొల్పేద నక్కాంత త ద్రూప ప్రాప్తి విరక్తగాక తగఁ బ్రీతుం జేయుచుండెం బతిన్. |
254 |
| వ. | ఇట్లు పతివ్రతయై సుకుమారి నారదు నారాధించుచుండెఁ;బదంపడి యొక్క నాఁ డేమేనియుం బనికి వనంబునకు నారదుండు వోయినయెడం బర్వతుండు డబ్బాటు గాంచి నమస్కరించి ‘నాకిచ్చిన శాపంబు మరల్పవే!’ యనుటయు నారదుండు ‘నీవు గావె మున్ను శపించిన వాఁడవు; ముందర నీ యిచ్చిన శాపంబు మరల్పందగు’ నని పలికిన, నతం ‘డట్లకాక’ యనియె; నివ్విధంబున నొడంబడి యిరువురు నొండొరువుల శాపంబులు మరల్చి; రయ్యల్లుండును మామతోడన వచ్చి మందిర ప్రవేశంబు సేయు సమయంబున నా రాజనందన నిజపురుషుం జూచి పరపురుషుండ కాఁ దలంచి, మఱిచూడక మాఱుమొగంబు వెట్టికొని పోవుటయు. | 255 |
| ఆ. |
నగుచుఁ బర్వతుండు ‘నాతి! నీపతి యగు | విశ్వసింపు’మని సవిస్తరముగ శాపములును మోక్షసంవిధానములును | జెప్పి తీర్చె దాని చిత్తవృత్తి. |
256 |
| వ. | ఇట్లు నారదుండును బర్వతుండును బరస్పర ప్రియకారులైరి; కౌరవోత్తమా! నీ యడిగిన సువర్ణష్ఠీవి వృత్తాంతంబు నిమ్మునివరుండు దేటపడం చెప్పెడు’ నని సృంజయ పుత్ర చరిత్ర కథనంబు నారదు కృత్యంబుగాఁ బలుకుచు నతనిం జూపిన, నాతం ‘డిప్పుడు శౌరి చెప్పినయంతయు నిట్టిద’ యక్కుమారు తెఱంగుఁ జెప్పెద నాకర్ణింపు’మని యప్పాండవాగ్రజున కభిముఖుండై యిట్లనియె. | 257 |
| సీ. |
‘అవ్విధంబున నేను నల్లుండు సంప్రీతి | సృంజయుపాల వసింపఁ గొన్ని సంవత్సరంబులు సనినఁ, దదాశ్రిత | బ్రాహ్మణోత్తముల సంప్రార్థనంబు గలుగంగ మాకును గమనేచ్ఛ పుట్టంగ | నా రాజునకు నుపకార మొకటి సేయఁ దలంచి యే మాయన సన్నిధి | కరిగి కోరుము వరమంటి మనిన |
|
| ఆ. |
నతఁడు ‘మీరు ప్రీతులయినకంటెను నొండు | గలవె వరము?’ లనిన గారవించి యనిమిషులను మిగులు తనయునిఁ బడయంగ | వలచియుండు దట్టి వానిఁ గనుము. |
258 |
| వ. | అంటి: మట్టియెడ నింద్ర తేజో రక్షణాయత్త చిత్తుండగు నప్పర్వతుం డప్పుడమిఱేనితో ‘విను మక్కుమారుండు దీర్ఘాయురుపేతుండు గాకుండు’ ననియె దానికి నమ్మానవపతి యుమ్మలించి యమ్మహాత్ము నాననంబునం జూడ్కి నిలిపి ‘యి ట్లేల యుష్మ దనుగ్రహం బనూనంబు గావలవదే?’ యని ప్రార్థించిన నమ్మాట కమ్ముని మఱుమాట వలుకకున్న నే నన్నరనాథుపైఁ గలుగు కరుణావిశేషంబున. | 259 |
| తే. |
వలదు శంకింప నింద్రుని వలనఁ బుట్టు | నెడరు వొందక యుండంగఁ గొడుకు నోపి నంత గావుము; గావంగనైన చావు | నపుడు నన్నుఁ దలంపు;మే నది మరల్తు. |
260 |
| వ. | అక్కుమారుండు నిజనిష్ఠీవ నాదులు సువర్ణమయంబు లగుటంజేసి సువర్ణష్ఠీవి యనం బరఁగుఁ ; బ్రమోదంబునం బొందుము.’ | 261 |
| క. |
అని యూఱడిల్లఁ బలికిన | విని యాతఁడు సంతసంబు వెల్లిం దేలెం జని యే మీప్సితవర్తన | మున నుండితి; మవ్విభుండు పుత్రునిఁ గాంచెన్. |
262 |
| వ. | వాఁడును మలమూత్ర లాలాశ్రు స్వేదంబులు గనక మయంబులయి తొరుఁగం బెరుఁగుచుండె; నా సమయంబున నెడరువేచి వెంగలు లగు మ్రుచ్చు లబ్బాలుం బట్టి నోరం జీర దుఱిమి, యడవికిం గొనిపోయి యొడలు జల్లించి పసిండి గానక పీనుంగు వైచి పోయిరి. సృంజయుండును దనకొడుకు నింద్రుం డపహరించె నను తలంపున శోకార్తినొంది పలవించుచు నన్నుం దలంచినం బోయి నీకుం బుండరీకాక్షుం డిప్పుడు సెప్పిన యాది రాజ విషయంబు లగు శోకోపశమన వచనంబులు సెప్పి,యంకిలి దేర్చి యవిచారపరులగు తస్కరు లా శిశువుం జంపుట యెఱింగించి. | 263 |
| క. |
మ్రుచ్చుల మూఢత్వమునం | జచ్చి నరకవాసమునకుఁ జనిన తనయు నేఁ దెచ్చి మగుడంగ వే నీ | కిచ్చెద; వగ పుడుగు మింకనేనియు నధిపా!’ |
264 |
| వ. | అని చెప్పి యేనును. | 265 |
| క. |
భావమున నమ్మెయికిఁ దగు | దీవన యిచ్చుటయు, నరుగుదెంచె సువర్ణ ష్ఠీవి గడు నద్భుతమ్ముగ; | నా విభుఁడుఁ బ్రమోద సంభృతాత్ముం డయ్యెన్. |
266 |
| తే. |
అతని వీడ్కొని సంప్రీతి నరుగుచుండి | ‘యింద్రుచేఁత గా దిది విను! మిక్కుమారుఁ జంప నింద్రుఁడు వేచు రక్షణము మఱవ | వలదు నీ’వని చెప్పితి వసుమతీశ! |
267 |