పురాణేతిహాసములు శ్రీమహాభారతము శాంతిపర్వము - ద్వితీయాశ్వాసము
వసుమనుం డను రాజునకు వామదేవుండు సెప్పిన ధర్మప్రకారము (సం. 12-93-1)
ఆ. అర్థసిద్ధికంటె నరయ నెక్కుడు ధర్మ | సిద్ధి; దాన సకల సిద్ధులును బ్ర
శస్త భంగిఁ జేరు; శాశ్వత కీర్తియు | సంభవించుఁ; గలుగు సద్గతియును.
408
క. ధనమునకై ధర్మము దెస | ననాదరము సేసెనేని నా నృపతికి న
ద్ధనమును జెడు; దుర్యశముం | బనుగొనుఁ దుది దుర్గతియును బాటిలు ననఘా!
409
క. లాభంబు ధర్మముఖ్యము | గా భరపడి మార్గశుద్ధి గనుఁగొని కైకో
లా భూవరునకు నిహపర | శోభనములు సేఁత చెప్పు శ్రుతి వాక్యంబుల్‌.
410
క. ధర్మ ప్రవృత్తియయ్యును | ధర్మము నా కింతకంటెఁ దత్తద్విధులం
బేర్మిం బొరయ వలయు నను | ధార్మికతాతృష్ణ నత్యుదాత్తుఁడు వొందున్‌.’
411
వ. అని తన వచనంబులం దెలివొందిన వసుమనుండను రాజుతో వామదేవుండు రాజ్యతంత్రంబున కెల్ల నాధార భూతంబు లగు సామ భేద దానదండంబులం బ్రయోగించు తెఱం గెఱించెద నాకర్ణింపు మని యిట్లనియె. 412
క. మూలబలము సంతుష్టం | బై లాలిత మగుచునున్న యప్పు డసదుఁ జో
టాలోకించి నడవ భూ | పాలకునకు దండ మతిశుభం బొనరించున్‌.
413
చ. సమరము సాహసం బధిక సంపద లమ్మెయిఁ దెచ్చికోలు ప
థ్యమె రిపు లేల కల్గు దురహంకృతి పెంపును నుత్కటంపుఁ గో
పము మగిడింపఁజాలు నరపాలున కట్లగుటన్‌ హితంబు సా
మము దనయంతవాఁ డయిన మానవనాథు నెడన్‌ మహీశ్వరా!
414
క. తన భటులు గలఁగినప్పుడు | ధన మిచ్చి విరోధి నల్పతరు నైనను శాం
తునిఁ జేయవలయు దానము | నన యధికునిఁ దేర్చు టురవు నరపతి కెపుడున్‌.
415
తే. ఆ యుపాయముల్‌ మూఁటికి ననువుగాని | యట్టి పగతునియెడ భేద మాచరింప
వలయు రంధ్రముల్‌ దగవేచు వలను గలిగి | తత్పరతఁ జేయఁజాలు సాధకులఁ బనిచి.
416
వ. శుక్రమతంబునం బంచమోపాయంబైన యుపేక్ష వర్తిల్లు దానిం బ్రయోగించు భంగియుం జెప్పెద. 417
మ. కలహంబుల్‌ దమలోనఁ జేసిన నుపేక్షానైపుణం బొప్ప శ
త్రులఁ జూడందగు భూతదానవుల పోరుం జూచిన ట్లెమ్మెయి
న్ములు ముంటం దగఁ బుచ్చు భంగి గలుగు న్భూనాథ! కీడైన మం
త్రులయేపున్‌ విభుఁ డిట్ల మాపునది నేర్పుం బెంపుఁ బొల్పారఁగన్‌.
418
వ. అని యత్తెఱంగున వామదేవుండు సెప్పిన హితవచనంబులు వాటించి కోసలపతి భాసమానుండయ్యె; నీవును నట్ల వర్తిల్లి వలెయు’మనినఁ బాండవాగ్రజుండు ‘సమరంబున శత్రుల జయించునప్పటి పాడి యెట్లుండు?’ ననుటయు భీష్ముం డతని కిట్లనియె. 419
AndhraBharati AMdhra bhArati - AndhramahAbhAratamu - #00# parvamu - kavitraya bhAratamu - kavitrayamu - nannaya - tikkana - eRRana - nannyya tikkanna eRRana - andhramahabharatamu aandhramahaabhaaratamu ( telugu literature andhra literature )