పురాణేతిహాసములు శ్రీమహాభారతము శాంతిపర్వము - తృతీయాశ్వాసము
ధర్మరాజునకు భీష్ముండు ధర్మసూక్ష్మత తెఱం గెఱింగించుట (సం. 12-109-3)
వ. అనుటయు ధర్మజుండు ‘ధర్మంబులు బహుశాఖలు గలిగియుండు; నన్నియు ననుష్ఠింపవచ్చునే? యెయ్యది యాచరించి పురుషుం డైహికాముష్మిక సుఖంబులం బొందు?’ననిన మందాకినీనందనుం డతని కిట్లనియె. 42
సీ. ‘విను తల్లియును దండ్రియును గురుండును సేవ | నీయులు సద్భక్తి నిత్యనిరతి
వారలఁ గొలుచుచు వా రెద్ది సెప్పిన | నది యాచరించుట యధిక ధర్మ;
మాగమత్రయమును నగ్నిత్రయంబు లోక | త్రయంబును దేవతాత్రయంబు
ననువస్తువులు వార లందును జనని గౌ | రవమున నెక్కుడు రాజవర్య!
 
తే. యీ జగంబున దివమునం బూజ వడయు | మాతృభక్తుండు పితృభక్తి మానసుండు
నట్ల యవ్యయానందసంప్రాపణంబు | గురు పదాబ్జ సమారాధకుండుఁ గాంచు.
43
వ. అనవుడు నజాతశత్రుండు గంగాపుత్రునితో ‘సత్యానృతంబులు జగంబులం బరఁగియుండుఁ బురుషుండు వానియెడ నెబ్భంగివాఁడై ధర్మపరుం డగు?’ నని యడిగిన నమ్మహీపతి కమ్మహాత్ముం డిట్లనియె. 44
సీ. ‘సత్యంబు వలుకుట సర్వధర్మములకు | మిక్కిలి; యనృతంబు మేటి పాత
కము; తద్విశేషంబు గలదు చెప్పెద; నొరు | నర్థంబుఁ బ్రాణంబు నపహరింపఁ
జూచు; పాతకులతో సూనృతం బాడుట | పాపంబు బొంకులు వలికి యట్టి
వారి హింసించుట వరధర్మ మిది యొక్కఁ | డేల భూతములకు హితము సేయు
 
తే. బొంకు లెల్లను ధర్మముల్‌ భూత బాధ | కంబు లగు నిక్కములు పాతకములు వినుము!
భూతముల దుష్ట శిష్టత్వములు వివేక | సూక్ష్మ తా వేద్యములు వానిఁ జూడవలయు.
45
AndhraBharati AMdhra bhArati - AndhramahAbhAratamu - #00# parvamu - kavitraya bhAratamu - kavitrayamu - nannaya - tikkana - eRRana - nannyya tikkanna eRRana - andhramahabharatamu aandhramahaabhaaratamu ( telugu literature andhra literature )