పురాణేతిహాసములు శ్రీమహాభారతము శాంతిపర్వము - చతుర్థాశ్వాసము
భీష్ముఁడు ధర్మజునకు సర్వోత్తమంబగు ధర్మంబు సెప్పుట (సం. 12-168-2)
వ. దేవా! వైశంపాయనుండు జనమేజయున కిట్లనియె: నట్లు బహు ప్రకారంబుల శాంతనవుండు వివరింప రాజధర్మంబులు విని ధర్మనందనుండు దమ్ములుం దానును బ్రియం బందె; నమ్మందాకినీ నందనుం డతనితో ‘నా యెఱింగిన తెఱంగునం బ్రజ్ఞాకరంబులగు వాక్యప్రకరంబు లుపన్యసించితి; నింకనేమి విన నిచ్ఛ సేసెద?’ వనిన నా దేవవ్రతునకు నన్నరదేవోత్తముండు వినయం బెసఁగ వినతుండై. 2
క. ‘రాజోచిత ధర్మంబుల | యోజ విశదభంగిఁ జెప్పి తుజ్జ్వల విసర
త్తేజోధన! నాకు సకల | భూజన పరమ హిత ధర్మముం దెలుపు దయన్‌.
3
క. ఉత్తమ మెయ్యది?’ నావుడు | నత్తటినీ నందనుఁడు సమాదర సమ్య
క్చిత్తుఁ డగుచు నక్కురు భూ | పోత్తమునకు నిట్టు లనియె నుర్వీనాథా!
4
తే. ‘విను మనేక విధంబుల విస్తరిల్లు | ధర్మములయం దొకండును దలఁప నిష్ఫ
లంబు లే; దాత్మ మోక్షావలంబి యైన | ధర్మ ముత్తమ మండ్రు తత్త్వజ్ఞు లధిప!
5
క. ప్రియములు నప్రియములును హృ | దయమునఁ బొరయమియ మోక్షదంబగు ధర్మం
బయమహితా! తద్బోధ వి | షయ మగు నితిహాసముం బ్రసన్నాకృతిగన్‌.
6
వ. చెప్పెద నాకర్ణింపుము. సేనజితుం డనురాజు పుత్రశోకార్తుం డయి యున్నయెడఁ దదాప్తుండగు విప్రుం డతని కిట్లనియె. 7
క. ‘ఇది యేమి? శోకమున వం | దెదు? పుట్టిన వారి కెల్లఁ దెరు వారయఁగా
నిదియె; భవత్సుతుఁ డొకనికె? | వదలు వనట; మూఢునట్ల వనరం దగునే?’
8
వ. అనిన విని యజ్జనపతి ‘నీ వేమిటంజేసి వగపు వారిం?’ తనవుడు నతం డతని కిట్లనియె. 9
క. ‘కదియుం గాష్ఠముఁ గాష్ఠము | నదిలో మఱికొంత సేపునకుఁ బాయును నె
మ్మది నట్లుగఁ దలఁపఁగ వల | వదె పితృ పుత్రాది బంధు వర్గము నధిపా!
10
క. తనకుం దా నెర వనినను | విను బంధులు సతమె? య న్వివేకంబున నే
జనులపయిఁ జేయ నర్మిలి | నను వగ వొంద దది కారణముగ నరేంద్రా!
11
క. నరనాథ! సుఖము దుఃఖముఁ | బరువడిమెయిఁ బొరయుఁ గాక! పన్నుగ నరునిం
బొరయునె యం దొక్కటి? యవి | పొరసిన వల దూఁద మోదమును ఖేదంబున్‌.
12
క. ఇది నాయది యను నూఁత | న్మది నెయ్యది పట్టుకొల్పినను వాసితమై
తుదిఁ జేటునొంది వానికి | నది శోకము నావహించు నత్యంతంబున్‌.
13
క. వినుము, పురాతన జన్మం | బునఁ జేసిన యట్టి కర్మముల ఫలములు ప్రా
జ్ఞునినైనఁ బొందు వానికి | మనుజేశ్వర! మందు ధైర్యమహిమయ చుమ్మీ.
14
క. పరమ సుఖము దృష్ణ యుడుగు | టరయఁగ ని ట్లగుట పింగళాలాపములం
బరిబోధితమగు ధరణీ | శ్వర! చెప్పెదఁ దెలియ వినుము వాని తెఱంగున్‌.
15
వ. పింగళయను వేశ్య దన కూర్చువాని రాక వార్చి పెద్దయుం బ్రొద్దు వోవునంతకు నుండి వాఁడు రాకుండుటయును. 16
ఆ. ‘ఏను వేఁదు ఱగుడు వాని నివ్వేదుఱ | పట్టఁ జదురుగలదె! భ్రాంతి దొఱఁగి
యొంటి కంబ మొప్పు నింటి వాకిళులు దొ | మ్మిదియు నెఱయమూసి నిదురవోదు.
17
క. పొంతకు వచ్చిన వానిన | కాంతునిగాఁ గొనుచు నొరునిఁ గాంక్షింపక యే
నెంతయు నూఱడి మనమునఁ | జింత యొకఁడు లేకయున్నఁ జెందు సుఖంబుల్‌.
18
క. ఆశయ యింద్రియ జయము వి | నాశముఁ బొందించుఁ గావునం దొఱఁగెద నే
నాశను; సౌఖ్యము నిచ్చు ని | రాశయ’ యని పలికి యట్టిదై నిద్రించెన్‌.’
19
వ. అని విప్రుం డుపదేశించిన వాక్యంబులం గలంకదేఱి సేనజిత్తు సుఖి యయ్యె.; నీవును నందలి తాత్పర్యం బను సంధించి శాంతినొందు మని చెప్పినఁ గుంతీ తనయాగ్రజుండు శాంతనవుతో ‘భూతక్షయావహంబగు కాలం బతిక్రాంతం బగుచున్నయది; యట్లుండ జనంబుల కెయ్యది కర్తవ్యంబు లుపదేశింపు’ మనిన నమ్మనుజపతిం బ్రీతిం గనుంగొని ‘యమ్మహితాత్ముండు పితాపుత్ర సంవాదంబను నితిహాసంబు గల దాకర్ణింపుము; దాన నీ యడిగినయది దేటపడు’ నని పలికి యిట్లనియె. 20
AndhraBharati AMdhra bhArati - AndhramahAbhAratamu - #00# parvamu - kavitraya bhAratamu - kavitrayamu - nannaya - tikkana - eRRana - nannyya tikkanna eRRana - andhramahabharatamu aandhramahaabhaaratamu ( telugu literature andhra literature )