| పురాణేతిహాసములు | శ్రీమహాభారతము | శాంతిపర్వము - చతుర్థాశ్వాసము |
| వ. | అని పలికి యివ్విధంబునం గోడెలు సచ్చినం బుట్టిన నిర్వేదంబున సకలకామంబులం బరిత్యజించి దేవసముండై యుండె’నని చెప్పిన విని పాండవాగ్రజుం ‘డేమి వర్తనంబున నరుండు వీత శోకుం డగుచుఁ జరించు? నెద్దానం జేసి పరమగతి వడయు?’ ననుటయు ననిమిషనదీనందనుం డజగరచరితంబను నితిహాసంబు వినుము దాన నీ యడిగిన యర్థంబు దేటపడు. దానిం జెప్పెద; నజగర నామధేయుం డగు నొక్క బ్రాహ్మణునిఁ బ్రహ్లాదుండు శమప్రకారం బుపదేశింపుమని యభ్యర్థించిన నతం డతని కిట్లనియె. | 54 |
| క. |
‘అనిమిత్తము భూతంబుల | జననం బవి రూపు సెడుట సంపన్నములై యునికి విషాదము మోదం | బును జేయఁగ లే వనిత్యములుగ నెఱిఁగినన్. |
55 |
| తే. |
వరదఁ గాష్ఠముల్ గూడిన వడువు బంధు | సంగమం బవి వాసిన చాడ్పు తద్వి యోగ మింత సూచిన వాని నుమ్మలికము | వొరయనేరదు దానవవరతనూజ! |
56 |
| వ. | ఈ తెఱంగు లే నెఱుంగుదు; నాదెసఁ బ్రశాంతిం గనికాదె నీవు శమోపదేశం బర్థించితివి. వినుము. | 57 |
| క. |
మే లర్థింపను గీడును | జాలింబడి తొలఁగఁ ద్రోవ సరిఁ దూష్ణీం భా వాలంబిమనస్కుఁడనై | యాలంబుగఁ జేసి నడతు నయ్యిరుదెఱఁగున్. |
58 |
| క. |
సరసాన్నము పిణ్యాకము | సరిగాఁగ భుజింతు మృదుల శయ్యా తలమున్ ధరణియు శయనరుచికి నా | కరయంగా నొక్కరూప! యసురప్రవరా! |
59 |
| ఆ. |
నారచీరయేనిఁ జారు చీనాంబరం | బైనఁ గట్టికొనినయపుడు హృదయ మొప్ప దొప్పు ననక యుండు రూపాదుల | నలమికొనవు చక్షురాదికములు.’ |
60 |
| వ. | అని వెండియు. | 61 |
| ఆ. |
చలనమేది పుట్టుఁ జావునుం బిరువెట్టి | యామిషార్థిజనుల నపహసించు చెలిమితోడ లేమికలిమి వాటింపని | రమణ నునికి యజగరవ్రతంబు. |
62 |
| ఆ. |
అనియతంబు లైన యాహార విహరణ | శయనముల విధాతృ సంప్రయుక్త భంగిఁ బరఁగు నంతరంగ నిర్భార వ | ర్తనము కలిమి యజగరవ్రతంబు. |
63 |
| ఆ. |
నిత్య తృప్తి శౌచనిరతి తాల్మి సమత్వ | మారఁ గలిగి చిత్ సుఖానుభవము ప్రచుర మగుట యజగరవ్రత మిది విను | యజ్ఞదుర్లభంబు ప్రాజ్ఞభూమి.’ |
64 |
| వ. | ఇది శమప్రకారం బనియె’ నని చెప్పి భీష్ముండు. | 65 |
| క. |
‘అజగర చరితము దనకును | నిజముగ నలవఱుప నేర్చు నిర్మలమతికిన్ వృజిన భయ మన్యు శోకము | లజేయములు గావు, మోక్ష మాయత్తమగున్.’ |
66 |
| వ. | అనిన విని యజాతశత్రుండు ‘బంధుమత్త్వ కర్మవిత్త ప్రజ్ఞలయం దెయ్యది నరునకు సుప్రతిష్ఠం జేయు?’ నని యడిగిన నాపగాతనయుం డతని కిట్లనియె. | 67 |
| క. |
‘ప్రజ్ఞయ ప్రతిష్ఠ, లాభము | ప్రజ్ఞయ, నాకం బనంగఁ బ్రజ్ఞయ చువ్వే, ప్రజ్ఞయ కైవల్యంబును, | ప్రజ్ఞాసాధ్యములు గాని పనులుం గలవే? |
68 |
| వ. | బలి ప్రహ్లాద మంకి ప్రభృతులు ప్రజ్ఞన కాదె సమాధాన సంపన్నులయిరి; కాశ్యప నామధేయుం డగు ధరణీ సురోత్తముం డొక్క యుద్ధత పురుషుని రథంబు దాఁకి పడి తదవమానదూయమాన మానసుండై యసుపరిత్యాగ పరవ్యవసాయుం డగుటయు నింద్రుండు సృగాలరూపంబున నమ్మహాద్విజుని పాలికి వచ్చి ప్రజ్ఞాసంబోధకం బగు సంవాదంబునం జిత్తప్రసాదంబు కావించె నని విందు; మెల్లభంగులఁ బ్రజ్ఞ యుత్తమాధికారం’ బనిన విని ధర్మతనయుండు. | 69 |
| క. |
‘నరవర! దానముఁ దపమును | గురుశుశ్రూషయును యజ్ఞకోటియు నెట్లై పరిణతిఁ బొందం గలయవి | పురుషున? కత్తెఱఁగు దెల్లముగ వినవలతున్.’ |
70 |
| వ. | అనుటయు దేవవ్రతుం డన్నరదేవోత్తమున కిట్లనియె. ‘మేలు లనుబంధించు మేలులట్ల కీళ్ళును ననుస్యూతంబులయి తొడరు నాకర్ణింపుము. | 71 |
| క. |
కఱవుపయిఁ గఱవు వొరయుచు | వెఱపు పయిన్ వెఱపుఁ దోప విడువని యిడుమం దొఱఁగమిపైఁ బురుషుఁ డిడుమఁ | దొఱఁగమిఁ జేడ్పడుచు నడచు దుష్కర్మములన్.’ |
72 |
| వ. | అని మఱియును. | 73 |
| ఆ. |
‘ఉత్సవంబుమీఁద నుత్సవ మందుచు | సుఖముమీఁద సుఖము సొప్పడంగఁ బుణ్యపదము మీఁదఁ బుణ్య పదంబున | కరుగు నరుఁడు సుకృతియైన నధిప! |
74 |
| క. |
పులుఁగులలోఁ బూత్యండక | ములు సారములైన ధాన్యములలోనం బొ ల్లులు బోలెను జూవె మను | ష్యులలో ధర్మరహితాత్ము లుర్వీనాథా! |
75 |
| క. |
చనినఁ జను నున్న నుండు | న్మనుజుఁ డొకటి సేయఁ జేయు నరనాయక! తో డన తగిలి నీడవోలెను | విను చేసిన కీడు మేలు విడువవు వానిన్. |
76 |
| క. |
సమయం బైనను గుసుమ ఫ | లము లెట్టులు దోఁచుఁ దరువులం దఱితోఁ గ ర్మములం బొడమున్ సుఖదుః | ఖము లట్టుల నిష్ప్రయత్న కలితోద్భూతిన్. |
77 |
| క. |
తెలిసికొనఁ బడయ రొరు లా | ర్యుల పోయెడి తెరవు లరసియును జదలం బ క్షులు నీళ్ళలోన మీనం | బులు వోయెడు త్రోవ లెఱుఁగఁ బోలునె? యధిపా! |
78 |
| క. |
ఐనను గాఢ నిరూపణ | మానసుఁడై యార్యజనుల మహిత వచనముల్ వీనుల నినుచుచు ధర్మము | లైనవి సేయంగఁ దప్ప కగుఁ దత్ఫలముల్.’ |
79 |
| వ. | అనిన విని కౌంతేయాగ్రజుండు శాంతనవునితో ‘భూతసృష్టి యెవ్వానివలన నెబ్భంగినైనయది? యెఱింగింపు’ మనవుడు నతం ‘డిదియును మఱియునుం గొన్ని యర్థంబులు భరద్వాజుం డడిగిన భృగుండు సెప్పె నప్పరిపాటి యుపన్యసించెద నాకర్ణింపు’ మని యతని కిట్లనియె. | 80 |