పురాణేతిహాసములు శ్రీమహాభారతము శాంతిపర్వము - చతుర్థాశ్వాసము
భీష్ముఁడు ధర్మరాజునకుఁ బృథివ్యాది భూతోత్పత్తిక్రమం బెఱింగించుట (సం. 12-175-5)
సీ. ‘కైలాసశైలశిఖరమునఁ దేజో వి | రాజితు భృగు భరద్వాజుఁ డధిక
వినయంబుమైఁ జేరి, ‘మునినాథ! భూత సృ | ష్టి ప్రకారము నాకుఁ జెప్పు’ మనిన
నమ్మహితాత్ముఁ డిట్లను ‘విను నారాయ | ణుం డవ్యయుం డనంతుండు భూత
సృజనంబు దలఁచి మున్‌ సృజియించెఁ దనదు స | హస్రాంశకమున నవ్యక్తుఁ డనఁగ
 
తే. మనసునన యజరామరు ననుపమాను | నతనివలన మహత్తత్త్వ మావహిల్లె;
నతఁడు దివ్యతేజోమయం బైన పద్మ | మొకటి గలిగింప బ్రహ్మ యం దుద్భవించె.
81
తే. అతని తలఁపునఁ బ్రభవించె నాకసంబు; | దానియందు జలంబు లుద్భవము నొందె;
సలిలమున నగ్ని మారుత జనన మొనరె; | ననల పవన యోగమున మేదిని జనించె.
82
వ. ఆ బ్రహ్మ యఖిల భూతాత్మకుం డెట్లనిన నతనికి శైలంబు లస్థులు; మేదిని మేదోమాంసంబులు; సముద్రంబులు రుధిరం; బాకాశం బుదరంబు; పవనుండు నిశ్వాసం; బగ్ని తేజంబు; సరిత్తులు సిరలు; రవిచంద్రులు నయనంబు; లూర్ధ్వలోకంబు శిరంబు; పాతాళంబు పాదంబులు; దిశలు బాహువు; లి ట్లనంతాత్మకుం డగువాఁడు విష్ణుం డిత్తెఱంగున విశ్వంబు విష్ణునివలనం గలిగెననిన విని భరద్వాజుం డాకాశాది భూతంబు లేనింటి ప్రమాణంబులు నడిగిన భృగుం డవి యనంతంబులు దేవతలకుం గొలఁది వెట్టరాకుండు నొక్కచోటు నిరూపించి యీ భూతం బింతటనుండి యట లేదనరాదు పంచభూతంబులు నిరవధికంబు లది యెత్తెఱం గనిన విష్ణునకు గౌణంబై యనంతుం డను నామంబుగలదు గాదె! విష్ణుండు జగన్మూర్తి విష్ణు తనుభూతంబయిన మహాభూత పంచకం బప్రమేయంబుగాక తక్కునే?’ యని యెఱింగించిన. 83
సీ. విని భరద్వాజుండు ‘మునినాథ! పుష్కరం | బునఁ బుట్టె నన్నప్డ పుష్కరంబు
బ్రహ్మకు నాదినాఁ బట్టయ్యె నెట్టొకో?’ | నావుడు ‘విష్ణుమానసభవుండు
బ్రహ్మ యాద్యుఁడు పుష్కరము దదాసన రూప | ముగఁ గల్పితంబయ్యె మున్ను పిదప
నను నిశ్చయంబు లే కునికిఁ బద్మజుఁ డన | వలసియు నుండు నయ్యలఘుతేజుఁ
 
తే. బద్మ మది భూతధాత్రి యప్పద్మమునకు | గగన మూర్థితమగు మేరునగము రుచిర
చారుకర్ణిక యందుండి సకల జంతు | సృజన ధుర్యత్వమహిమ నయ్యజుఁడు వెలుఁగు.
84
వ. అని భృగుండు సెప్పిన విని భరద్వాజుండు ‘భూతంబు లై దగుట యేమిట?’ నని యడిగిన నతం డతని కి ట్లనియె. 85
క. వాయువు చేష్టా రూపము, | మ్రోయునెడ నభంబు, ద్రవము మునివర! జల మూ
ష్మాయిత మనలము; గాఠి | న్యాయితము ధరిత్రి; యిట్టు లైదు దెఱంగుల్‌.
86
వ. ఈ యయిదింటన కాదె జంగమంబులు స్థావరంబులు నైనయవి!’ యనుటయు భరద్వాజుండు ‘స్థావరంబుల యందు భూతగుణంబు లేమిటం గంటి?’ మని యడిగిన భృగుం డిట్లనియె. 87
సీ. ‘అశని నిర్ఘోషంబు నాకర్ణనము లేక | వికృతి నెట్టులు వొందు వృక్ష? మాక
సముశక్తి సూవె శ్రోత్రము నిదాఘంబు సోఁ | కునవాడుఁ జోఁ కెఱుంగుట సమీర
శక్తి మార్గముఁ గని చాఁగెడుఁ గనుట తే | జశ్శక్తి పాదపసంజ్ఞఁ బరఁగుఁ
బాదజిహ్వలఁ గొని బానంబు సేయుట | జలశక్తి జిహ్వ నైజంబు లైన
 
తే. కుసుమ ధూపాది గంధముల్‌ గొనుట నెలమిఁ | దాల్చు నని చెప్పుఁ దరువు వేదంబు ఘ్రాణ
ముర్విశక్తి యి ట్లయిదును నుల్లసిలుట | ననఘ! భూజంబు పంచభూతాత్మకంబు.
88
వ. శైలాదుల యందు నిట్ల యూహింపఁ బెఱ భంగులం గలిగియుండుఁ; బంచభూతాత్మకంబు గాని భూతంబు లేదనుట వేదనిశ్చయం’ బనిన విని భరద్వాజుండు. 89
క. ‘భూముఖ్యం బగు భూత | గ్రామంబు గుణంబు లైన గంధాదులఁ దే
జోమహిత యనుభవించుట | యేమెయి? నెద్దాని కావహిల్లుచునుండున్‌.’
90
తే. అనిన భృగుఁ డిట్టులను ‘విషయములు నింద్రి | యములు మనసును గ్రమసాధనములు గాఁగ
నంతరాత్మ ప్రదర్శి యై యనుభవించి | తత్కృతము లగు మోదఖేదములఁ బొందు.
91
వ. అప్పురుషుండు. 92
క. క్షేత్రజ్ఞుం డనఁగ నిఖిల | గాత్ర వ్యాప్తత్వమహిమ గలిగి సమీరా
సూత్రణమున జీవుండును | గోత్రమునై సర్వవర్తకుం డగుచుండున్‌.
93
క. అగు నీతత్త్వము సత్త్వా | దిగుణత్రయ వికృతి కత్యతీతంబై పూ
ర్వ గురుత్వంబునకుం జన | విగతత్వంబునకు నెలవు విమలవిచారా!
94
ఆ. బుధుఁడు సూక్ష్మ విమల బుద్ధి నప్పురుషుని | నరసి కాంచి యతని యంద మనసు
దిగ్గ విడిచి, యెగ్గు లగ్గును బొందక | శుద్ధశాంతిఁ బరమసుఖము పొందు.
95
వ. అని వెండియు. 96
AndhraBharati AMdhra bhArati - AndhramahAbhAratamu - #00# parvamu - kavitraya bhAratamu - kavitrayamu - nannaya - tikkana - eRRana - nannyya tikkanna eRRana - andhramahabharatamu aandhramahaabhaaratamu ( telugu literature andhra literature )