| పురాణేతిహాసములు | శ్రీమహాభారతము | శాంతిపర్వము - చతుర్థాశ్వాసము |
| సీ. |
‘ఆగమ సత్యధర్మాచార తపముల | కునికి పట్టులుగాఁగ వనజభవుఁడు గలిగించె మును బ్రాహ్మణుల మఱి కల్పించె | నృప వైశ్య శూద్రుల నిర్మలాత్మ బ్రాహ్మణాదికముగఁ బరఁగు నన్నాలుగు | జాతుల యుజ్జ్వలచ్ఛాయ లోలి సొంపారుఁ దెలుపును గెంపును బసుపు చా | యయుఁ గప్పు నయ్యు నండ్రాండ్ర వర్యు |
|
| ఆ. |
లాత్మకర్మ మెడలి యనులోమ వృత్తి నె | జ్జాతి సొచ్చు నన్యజాతి పనికి దాని కట్టిభంగి దలకొనుఁ బెక్కులు | పనులఁ జేసి జారతనము వచ్చు. |
97 |
| క. |
సిత రక్త పీత నీలము | లతులమతీ! మొదలు దొడఁగి యంతంతకు హీ నతఁ దాల్చుఁ గాన యెఱిఁగిం | చితి నీ పరిపాటిఁ గర్మశీలతకొఱకున్.’ |
98 |
| వ. | అని మఱియును. | 99 |
| క. |
సత్యమ బ్రహ్మము దపమును | సత్యమ ప్రజలను సృజించు సత్యము లోక స్థిత్యాధానముఁ జేయును | సత్యం బనృతంబుచేత సంపిహిత మగున్. |
100 |
| వ. | అట్లుంగాక ధర్మాధర్మంబు లనఁ బ్రకాశతమంబు లన బోధాజ్ఞానంబు లన స్వర్గ నరకంబు లన సుఖదుఃఖంబు లనఁ బరఁగు బుధజన వ్యావహారిక శబ్దంబులకు నర్థంబులై సత్యానృతంబులు ప్రవర్తిల్లుం గావున. | 101 |
| క. |
అనఘా! దుఃఖాత్మకమగు | ననృతం బడఁగించుటకుఁ బ్రయత్నమున సుధీ జను లాచరింతు రనిశం | బును మోహవిఘాతి నియమములు నిష్ఠమెయిన్. |
102 |
| క. |
ఒలయు జరావ్యాధి ప్రభృ | తులు శారీరములు గాఢ తోదక శోకా దులు మానసములు; దుఃఖం | బులు రెండు విధముల నిట్లు పురుషు నలంచున్. |
103 |
| క. |
శారీర మానసములగు | నీ రెండు విధములు దన్ను నేఁపక యుండం గోరికొని నియమములఁ బ్రతి | కారం బొనరింపఁగా సుఖం బొందు నరున్. |
104 |
| క. |
విను దుఃఖంబులఁ దెగఁ దోఁ | చిన పురుషుఁడు సౌఖ్య సక్తచిత్తుఁడు గా కా రిన వైరాగ్యముఁ జెందిన | ననుపమ మగు పరమపదము నమ్మెయి సేర్చున్?’ |
105 |
| వ. | అనిన విని భరద్వాజుం ‘డాశ్రమధర్మ ప్రకారంబులు సువ్యక్తంబులుగా నెఱింగింపు’ మనుటయు భృగుం డిట్లనియె. | 106 |
| సీ. |
గురునకు భక్తుడై పరమాదరమున వే | దాభ్యాస మెప్పుడు నాచరించు చును, శౌచశీలత వినయంబు త్రిషవణ | స్నానంబు భాస్కరానలసపర్య పాటించుచుండుట బ్రహ్మచారికి వృత్తి; | ధనధాన్యములు గర్హితములు గాని తెరువునఁ బడసి యతిథిపూజ మున్నుగా | నన్నపానాది భోగానుభవముఁ |
|
| తే. |
బొందువాఁడు గృహస్థుండు; గందమూల | శాక ఫలము లాహారంబు శయ్యభూమి వననివాసికి నిస్సంగవర్తనమున | భిక్ష బ్రదుకుగ యతి శాంతిఁ బేర్చియుండు. |
107 |
| క. |
ఫలకాంక్షి గాక నియతిం | జలిపిన నీయఖిల కర్మజాతంబును ని ర్మల మోక్షపదముఁ జేర్చుట | గలుగు నవశ్యంబుఁ బుణ్యకరణప్రవణా!’ |
108 |
| వ. | అనిన విని భరద్వాజుండు ‘పరలోకంబున నొండు గలదం; డ్రీ లోకంబునకును నాలోకంబునకును విశేషం బెట్టిది? యెఱింగింపవే?’ యని యడిగిన భృగుం డతని కిట్లనియె. | 109 |
| క. |
ఇది కర్మభూమి భోగా | స్పద; మా లోకంబు ధర్మపరులకు సులభం; బది సత్యశౌచ సౌజ | న్య దయాదులు లేనివారి కప్రాప్య మగున్. |
110 |
| క. |
ఈ లోకము దుఃఖబహుళ, | మా లోకము భూరిసుఖ నిరంతర; మం దే జాలియును లేక యొండొరు | తో లెస్సగఁ బొంది యుండుదురు జను లనఘా! |
111 |
| తే. |
హస్తి మశకాంతరము గల దరసి చూడ | వాస గృహ శయనాసన వసన గంధ మాల్య తౌర్యత్రికారామ మానినీజ | నాది సుఖసాధనములకు నందు నిందు. |
112 |
| వ. | అని వెండియు. | 113 |
| క. |
‘ఇవి పుణ్యలోక విషయ | వ్యవసిత వచనంబు లధమమగు లోకము ధ ర్మవిదూరజనులు వొందుదు | రవిరత బహుదుఃఖ నిలయ మది విప్రవరా! |
114 |
| క. |
విను మమకార వివర్జిత | మనస్కులకుఁ బుణ్యపాపమార్గంబులు లే మిని లోకంబులఁ ద్రిమ్మర | రనఘా! పొందుదురు శాశ్వతానందంబున్.’ |
115 |
| వ. | అని చెప్పి భృగుండు బ్రహ్మవిహితంబులగు ధర్మంబులు సంక్షేపరూపంబున నెఱింగించితి’ ననిన భరద్వాజుండు ప్రముదితాత్ముం డగుచు నమ్మహాత్ముం బ్రశంసించి వినతుండై వీడ్కొనియె; నతనిచేత విన్నంతవట్టును నీకుం జెప్పితి; నీ వింక నెయ్యది వినవల తనుటయు ననిమిషనదీనందనుతో ధర్మనందనుం ‘డాచార విధి విను వాంఛ నా మనంబునం బేర్చియుండు’ ననవుడు నతం డతని కిట్లనియె. | 116 |