పురాణేతిహాసములు శ్రీమహాభారతము శాంతిపర్వము - చతుర్థాశ్వాసము
భీష్ముఁడు ధర్మజునకు నాచారవిధి యెఱింగించుట (సం. 12-186-2)
సీ. ‘సజ్జనులం దురాచారవంతుల దురా | చారంబు గష్టత్వకారి యట్లు
గావున నాచారగతి వింట గడు లెస్స; | రాజమార్గంబున రచ్చ మంద
మూత్రపురీష విమోక్షంబు సేయమి, | శౌచియై వార్చి నిష్ఠను జలంబు
సొచ్చుట, సంధ్యల సూర్యు సేవించుట, | యర్కోదయాస్తమయముల నిద్ర
 
తే. వోవకుండుట, పంచార్ద్రభావ మొంది | కుడుచు టన్నంబు దెగడమి, తడిపదములు
గలుగ నిదురకుఁ జొరమి సత్కర్మవేది | నారదుఁడు వివరించె నాచారములుగ.
117
తే. ఉదయమగు సూర్యుఁ గనుఁగొను టొప్ప; దన్య | వనిత నగ్నమై యుండంగ వలదు చూడఁ;
దన పురీషంబు సూచుట ధరణినాథ! | కీడు; నిజపాపగుప్తి యకృత్య మరయ.
118
క. సురతంబు గుప్తమగుటయు, | గురుశుశ్రూషయును, బ్రహ్మకుల భజనము నా
యురవాప్తిఁ జేయు లక్ష్మీ | కరంబులగు నూర్ధ్వలోక గతుల నొనర్చున్‌.’
119
వ. అనిన విని యుధిష్ఠిరుం ‘డధ్యాత్మ విద్య వినవలతుం జెప్పవే’యనిన నతనికి దేవవ్రతుం డిట్లనియె. 120
సీ. ‘జలధి తరంగల చాడ్పునఁ బొడముచు | నడఁగుచు నుండు భూతాత్మునందు
భూమి ప్రభృతిభూతములు వాని గుణములు | గంధాదు లింద్రియ గ్రాహ్యకోటి
యనఘ! శ్రోత్రం బాదియగు నింందియశ్రేణి | దర్వియుఁ బోలె సాధనత నొందు
మనసింద్రియములకుఁ బెనుఁ బ్రాపు బుద్ధి త | న్ముఖమున నిశ్చయంబునకుఁ దేరఁ
 
తే. బురుషుఁ డవ్విషయంబులఁ బొందు నిట్లు | గాకయుండ నింద్రియములఁ గ్రమ్మఱించి
మనసుతోఁ గూర్చి బుద్ధిలోనన యడంప | బుద్ధి నిర్విషయస్థితిఁ బురుషు నొందు.
121
క. విను మాత్ముఁడు క్షేత్రజ్ఞుం | డన భూతాత్ముఁ డనఁ బురుషుఁ డనఁ బరమేశుం
డన బుద్ధిసాక్షి యనఁగా | జననరహితుఁ డనఁగఁ బరఁగు శాంతిప్రవణా!
122
క. తనయంద తోఁచు విషయము | లనుభవగోచరము లగుట యవి మాయాసం
జనిత స్వప్నంబై యా | త్మునికిం దను గాన లేమి మోసము దెచ్చున్‌.
123
క. విను గుణములు మాయకు నొడ | లని యెఱిఁగి, తమోరజస్సు లడఁచి, సుసత్త్వం
బున నిలిచి సద్వివేకం | బున నదియుం ద్రోచి విమల బోధాత్ముఁ డగున్‌.
124
తే. అరసి చూడ సత్త్వంబు సుఖాత్మకంబు | సాంద్రదుఃఖమయంబు రజస్సు, బోధ
మాంద్యమూర్తి తమస్సు, సమత్వ మూఁది | యీ యవస్థలఁ బొరయమి మాయపోక.
125
వ. అని యధ్యాత్మప్రకారంబు నిర్దేశించి భీష్ముండు వెండియు ‘యోగంబు సెప్పెద నాకర్ణింపు’మని యమ్మనుజపతి కిట్లనియె. 126
AndhraBharati AMdhra bhArati - AndhramahAbhAratamu - #00# parvamu - kavitraya bhAratamu - kavitrayamu - nannaya - tikkana - eRRana - nannyya tikkanna eRRana - andhramahabharatamu aandhramahaabhaaratamu ( telugu literature andhra literature )