పురాణేతిహాసములు శ్రీమహాభారతము శాంతిపర్వము - పంచమాశ్వాసము
భీష్ముఁడు ధర్మరాజునకు సాంఖ్యస్వరూప నిరూపణంబు సేయుట (సం. 12-290-3)
సీ. ‘వినుము దృఢజ్ఞానమున విషయంబుల | భంగి లెస్సగ నారయంగ వలయు;
నవియుఁ దిర్యఙఙఙ్మనుష్యామర పితృసిద్ధ | గరుడ గంధర్వ కిన్నరుల యందు
వేఱచందంబులై విలసిల్లు; శ్రుతివాక్య | దృష్టంబులగు దానఁ దెలియ నరయు
పరిచయంబున భేదపరబోధమేమిటి | కనరాదు; తోఁచిన యప్పు డవియు
 
తే. దురితకరముల యని వానిఁ దొడరకుండ | వలదె లెస్సగ నెఱిఁగిన వచ్చుఁ దొలఁగ
నేమఱమి దక్క నొండొకం డేల చోర | జనులఁ జిట్లంగ నడఁచుట కనఘచరిత!
600
చ. తలఁపఁగ నాయు వింతియకదా యని సౌఖ్యము దుఃఖముం బొరిం
గలుగవె కాలవృత్తి నని, కర్మము లిట్లని వేదచోదనం
బుల బహుభంగు లిట్టివని బుద్ధికి సత్త్వరజస్తమోగుణం
బులకుఁ బ్రవర్తనంబు లివి పొమ్మని కాంచుట చాల మే లగున్‌.
601
సీ. ఇంద్రియార్థంబుల నేనింట నై దింద్రి | యములును గోష్ఠంబునందు వహ్ని,
పవనుండు బయలను, బావకునందుఁ దో | యములును భూమి దోయముల బలము
గౌశికునందును గ్రాంతి యుపేంద్రుని | యందును నర్థంబునందు లోభ
మును దమస్సున బుద్ధియును రజస్సునఁ దమ | స్సును సత్త్వమున రజస్సును గరంబు
 
ఆ. దగులు సత్త్వ మాత్మఁదగులు; నాత్ముండు నా | రాయణుఁడు మహేశుఁ డనఁగ బరఁగు
పరముఁ దగులు నతఁడు పరము మోక్షంబునఁ | దగులు, మోక్ష మెందుఁ దగుల దధిప!
602
క. ప్రకృతి పదాఱు వికారము | లకు నాశ్రయ మాత్మ కది నెలవు; విను మాత్ముం
డకుటిల తేజోరూపతఁ | బ్రకృతియు వికృతియును గాక ప్రస్ఫురితుఁ డగున్‌.
603
తే. ఆత్మునకు రెండు రూపంబు లనఘ! కలవు | విషయసంగతి నొక్కటి విస్తరిల్లుఁ,
దదుపభోగంబు లేక మధ్యస్థభావ | మొంది యొక్కఁడు వెలుఁగుచు నుండుఁ జూవె!
604
క. పవనం బేకము, ప్రాణా | ది విభేదము లైదు, విను! తదీయంబులు వా
ని విధంబు లరయ నిశ్చల | మవు నది; యాసుకృత మంతరాత్మునిఁ జూపున్‌.
605
క. విను! గర్భవాస దుఃఖం | బును జన్మవ్యథయు బాల్యము విమూఢత్వం
బును రాగక్లేశ జరా | జనితకృపణతలును జూపు, సంగముఁ బాపున్‌.
606
ఉ. చెందుచునుండుఁ బుణ్యములు సేసి సురత్వము, మధ్యకర్ముఁడై
యొందు నరత్వమున్‌, దురితయోగమునం బశుకీటభావమున్‌
బొందు, సుఖంబు దుఃఖమును బొందఁగ జీవుఁడు దీనిభేదశ
క్తిం దెలియంగ నేర్చినమతిం గల యాతఁడు గోరు మోక్షమున్‌.
607
క. క్షయవృద్ధులఁ జంద్రుఁడు న | బ్ధియు లోనుగఁ బొందుచుండఁ దెలియఁడు బంధు
క్షయమునకు వగచు నజ్ఞుం | డయమహితా! దీని నెఱుఁగు టమలతఁ దెచ్చున్‌.
608
క. తన దేహము దోషములం | గని వేవురలో నొకండు గలుగు విముక్తిం
గను పని కుద్యోగించుట | కనఘా! పెక్కండ్రు లే రహంకృతికతనన్‌.’
609
వ. అనిన విని యుధిష్ఠిరుండు ‘దేహదోషంబు లెవ్వి? యెఱింగింపవే’ యనుటయు, ననిమిషనదీనందనుం డతని కిట్లనియె. 610
క. విను! కామముఁ గ్రోధము భయ | మును నిద్రయు నిశ్శ్వసనము భూవర! దేహం
బునఁ గల దోషము; లీ యై | దును బాపెడి తెఱఁగు సెప్పుదుం దెలియంగన్‌.
611
సీ. క్షమ క్రోధమునకు, సంకల్ప వర్జనము గా | మమునకు, నప్రమాదము భయంబు
నకు, సత్త్వసంసేవనము నిద్రకును, లఘు | భోజిత నిశ్వాసమునకు వైరు
లని చెప్పి, వెండియు నను ననేకములగు | దోషముల్‌ దొలఁగంగఁ ద్రోచువెరవు
లును బెక్కు లవి గనికొను వివేకము గల | పురుషుండు దన్మార్గ పరిచయమున
 
తే. విష్ణుమాయను దోఁచు నీ విష్టపములు | భిత్తి చిత్రంబు విధమున ఫేనభంగి
బుద్బుదాకృతిగాఁ గను బుధుఁడు; దీని | సరకు సేయక మోక్షంబు తెరువు వెదకు.
612
AndhraBharati AMdhra bhArati - AndhramahAbhAratamu - #00# parvamu - kavitraya bhAratamu - kavitrayamu - nannaya - tikkana - eRRana - nannyya tikkanna eRRana - andhramahabharatamu aandhramahaabhaaratamu ( telugu literature andhra literature )