పురాణేతిహాసములు శ్రీమహాభారతము శాంతిపర్వము - పంచమాశ్వాసము
ఆత్మ పరమపదంబుఁ బ్రాపించెడు ప్రకారము (సం. 12-290-80, 81)
వ. ఇది సాంఖ్యప్రకారంబు బహిస్స్పర్శంబులు తపోదండంబునం దొలంగం జడిసి యానపాత్రరూపంబుగా దీని నవలంబించిన యార్యుండు ప్రజ్ఞాకర్ణధార సామర్థ్యంబున దుఃఖోదకంబును వ్యాధిమృత్యు మహాగ్రాహంబును భయోరగంబును హింసావేగంబును రాగపంకంబును దృష్ణావర్తంబును నానాప్రీతిరత్నంబును సత్యతీరంబును నగు సంసారసాగరంబు నుత్తరించు నా సుకృతి నట సూర్యుండు తన రశ్ముల వహించి నడపు పద్మతంతు సన్నిభంబైన మార్గంబు ప్రవేశించి చనంజన సూక్ష్ముండును శీతలుండును సుగంధియు సుఖస్పర్శుండును సప్తమారుత శ్రేష్ఠుండును నగు పవనుం డెదుర్కొని నభఃపరమగతిం జేర్చు; నభంబు రజః పరమగతిని రజస్సు సత్త్వపరమగతిని, సత్త్వంబు నారాయణుని, నారాయణుండు పరమంబునం జేర్ప నందుం గలిసి తన్మయుండై యమృతత్వ నిత్యుండగు’నని చెప్పిన విని పాండవాగ్రజుం‘డ ట్లమృత స్వరూపశాశ్వతుండగు నమ్మహాత్ముండు దన పూర్వవృత్తంబు దలంచునో తలంపకుండునో దాని నిశ్చయం బతిగహనంబు; మోక్షంబు దలంచి పరమజ్ఞానమగ్నుం డగుటం బురుషున కెద్ది దశయో యను వితర్కంబున నది ప్రవృత్తి ధర్మంబున కంటె మే లనరాకున్నది; యీ రెండు దెఱంగులుం దెలుప నీవకాక యీలోకంబున నొరులు గలరే?’ యనుటయు నజ్జనపతికి జాహ్నవీనందనుం డిట్లనియె. 613
క. అడిగితి లెస్సగఁ బ్రశ్నము | గడుసంకట; మెట్టి యెఱుక గలవారలు నె
ప్పుడు సంశయించు చో టిది; | దడయక యుత్తరము సెప్పెదం దేటపడన్‌.
614
వ. కపిల దర్శన విదులగు మునీంద్రుల పరమమతం బిది; యవహితుండవై యాకర్ణింపుము. 615
సీ. పురుషుని నింద్రియంబు లెఱుఁగ; వవి మనస్‌ | స్థములు గావున మనస్సంగమమునఁ
గనువాని నతఁడు ముక్తత్వంబు లేని య | ప్పుడుఁ గల్గినను నది పురుషునందు
సమమ నిర్విషభుజంగములట్ల నిశ్చేష్ట | నున్న యింద్రియములఁ గన్నఁ గాన
కున్నను నేమి యయ్యుదిత విజ్ఞానామృ | తస్వరూపునకు నాతండు దొఱఁగఁ
 
తే. గాష్ఠకుడ్యకుసూలాదికముల చంద | మొందునట్టు గాకయు నింద్రియోత్కరంబు
శరధిఫేననిభం బయి విరియు నవ్వి | భూతి యీశ్వరుతెఱఁ గాత్మఁ బొందకున్నె?
616
క. విను! మింద్రియసహితముగా | మనుజాధిప! బోధపూరమగ్నత్వము గ
ల్గిననుం దత్సూక్ష్మగతులఁ | గనుఁ బురుషుఁడు గనియు నిర్వికారత నుండున్‌.
617
తే. భూతములను గుణంబుల బుద్ధి మనసు | నడఁచికొని జీవుఁ డొందు నారాయణునిఁ ద
దీయమాహాత్మ్యమున మాననీయపరమ | పదము గనుఁగాన నిష్పుణ్యపాపుఁ డతఁడు.
618
క. పునరావర్తనరహితుం | డనఘా! పరమాత్ముఁ జెందినట్టి పురుషుఁ డ
వ్వినుతావస్థను మోక్షం | బని చెప్పుదు; రంతకంటె నధికము గలదే?’
619
వ. అని చెప్పి వెండియు. 620
క. ‘గురుని వచనంబు తెఱఁగునఁ | బరమార్థ నిరూపణంబు భంగి నియతిఁ ద
త్పరుఁడై నడపం జాలిన | పురుషునిఁ దడయక ప్రశాంతి వొందు నరేంద్రా!
621
చ. జనవర! సాంఖ్య మిట్టిది ప్రజాపతి పూజ్యము బ్రహ్మభావభా
జనత ఘటింప దీనిసరి సమ్యగుపాయము లెందులేవు; నె
మ్మనమున సంశయింపక సమాహితచిత్తత దీనినూఁదు ని
స్తనుఁడగు నమ్మహేశునకుఁ దాఁ దనువిం కిట వేయు నేటికిన్‌.
622
తే. వేదశాస్త్ర పురాణ సంవేదితంబు | లైన బహువిధసంపరిజ్ఞానములకు
నెల్ల నిది సేరుగడ సూవె యేఱులకు స | ముద్రమును బోలె నుపశాంతి భద్రచిత్త!
623
వ. యోగులును సాంఖ్యులును జూచువెరవు లాకర్ణించితి కాదె; యిది యిట్లగుటం జేసి దర్శనభేదంబు గల దంటి నదియును నల్పాంతరం; బదియునుంగాక. 624
ఆ. యోగి చూచుభంగి నుర్వీశ! సాంఖ్యుండుఁ | జూచు; సాంఖ్యుఁ డరయు చొప్పు యోగి
వరుఁడు నరయుఁ; గాన వారిద్దఱును నొక్క | తెరువువార యండ్రు పరమమునులు.
625
క. విను! సాంఖ్యమ్మును యోగము | నను పేళుల కాని దీనియం దదియును దా
న నిదియుఁ దోఁచుచునుండుం | గనుఁ దత్త్వవిచారి యొకఁడ కా నీ రెంటిన్‌.
626
క. ఈ తెరువునఁ జరియించుచు | నే తెఱఁగున నైనఁ దప్పెనేనియుఁ బురుషుం
డాతత నాక సుఖము గనుఁ; | దోఁతెంచును మగుడ సద్బుధుల వంశమునన్‌.
627
ఆ. మఱియు నిత్తెఱంగు మనసున నెలసిన | వినుతమోక్షలక్ష్మి విభుత గాంచు
నిట్టి తెరువు సూప నెవ్వరి కలవి నా | రాయణునక కాక యమలచరిత!
628
వ. నారాయణ ప్రణీతంబై యక్షర ప్రదర్శకం బైన యిత్తెఱంగుఁ జిత్తంబున నలవరింపు’ మని దేవవ్రతుండు ధర్మనందనునకుం జెప్పెనని యిట్లు వైశంపాయనుండు జనమేజయునకుం జెప్పిన, ‘నటమీఁద వర్తించిన విశిష్ట సల్లాపంబులు సెప్పవే’ యని యడుగుటయు. 629
AndhraBharati AMdhra bhArati - AndhramahAbhAratamu - #00# parvamu - kavitraya bhAratamu - kavitrayamu - nannaya - tikkana - eRRana - nannyya tikkanna eRRana - andhramahabharatamu aandhramahaabhaaratamu ( telugu literature andhra literature )