పురాణేతిహాసములు శ్రీమహాభారతము శాంతిపర్వము - షష్ఠాశ్వాసము
వ్యాసుఁడు వెనుకొన శుకుఁడు యోగమార్గంబున నదృశ్యుండగుట (సం. 12-320-2,3)
వ. అని మఱియు ననేకభంగులం బ్రస్తుతించుచుండి రట్టియెడ శుకుండు మృగపక్షి శైల సరిత్సరసీతరుగుల్మలతలం గలయం గనుంగొని ‘మా తండ్రి నా వెనుకం జనుదెంచి నాదగు పేరం బిలిచెనేని మీరెల్ల నో యనవలయుంజుండీ!’ యనిన నవి యట్ల చేసెదమనియె. నా బ్రహ్మర్షివరుండు దమోరజస్సత్త్వంబులం గ్రమంబున డిగ్గఁ ద్రావియు నుత్తరాభిముఖుండై పోవ నొక్క మహాపర్వతంబు శృంగంబులు రెం డత్యంతపీతశ్వేతంబులై మేరు హిమవంతంబులం దెగడుచుం గదిసి యనేక యోజనాయామ విస్తారంబులు గలిగి మార్గంబున కడ్డపడియుండె నతం డప్రతిహతగమనంబునం జన నవి దుత్తుమురై రాలె నద్భుతభంగియగు నా సిద్ధపుంగవుపైఁ బుష్పవర్షంబు గురియుచు నమరగణంబు బహువిధంబులం బ్రణుతించె నప్పారాశర్యపుత్రుం డయ్యెడం బ్రవహించు మందాకిని మీఁదం జదలఁ జేరువం జనియె నట్లు సను సమయంబున. 330
తే. నగ్నలై యప్సరస్త్రీజనములు సలిల | కేళి సలుపుచునుండి శంకింప కమ్మ
హాత్ముఁ గనుఁగొను చెప్పటియట్ల నిర్వి | కారవృత్తి వర్తించిరి కౌరవేంద్ర!
331
వ. అయ్యవసరంబున సత్యవతీసుతుండు నిజసుతు వెనుక మహాయోగ గమనంబు గైకొని తగిలె నంతకు నయ్యారణేయుండు వాయుపథం బతిక్రమించి సర్వభూతాత్మకుం డయ్యె నప్పుడు. 332
తే. వెనుక నరుగుచునున్న యవ్వేదమూర్తి | తోడ సిద్ధచారణులు దత్సుతుఁడు శైల
శృంగ విధ్వంసియై పోక సెప్ప నెలుఁగు | పెంపు మిగుల ‘శుకా!’ యని పిలిచె నతఁడు.
333
వ. పిలిచిన నా సర్వగతుండు నిజప్రకారం బంతర్హితం బగుట దేటపడ బయల నో యను నాదంబు నిగుడునట్లు సేసెం దదనంతరంబ. 334
తే. సకలజంగమ స్థావర సమితు లెల్ల | నో యనిన నద్భుతం బెడ్డ నుద్భవింప
సత్యవతి కొడ్కు - కొడుకు విశాలమహిమఁ | దెలిసి యప్పర్వతముమీఁద నిలువఁబడియె.
335
వ. ఇట్లు నిలిచిన యవ్వేదవ్యాస మునీశ్వరుం గాంచి జలవిహారంబు సలుపు నయ్యప్సరోజనంబులు సిగ్గు నగ్గలిక గ్రందుకొన నందఱు నంబరంబులు ధరియించి రద్దివ్యబోధమహనీయుండు నిజతనయు చనునప్పుడు వారు శంకలేక యునికిఁ గని యతని ముక్తతయుఁ దన సక్తతయు నిరూపించి ప్రియంబును లజ్జయు నొక్కటఁ బొడమ నున్నంత. 336
క. సుర ముని సిద్ధగణంబులు | పరివేష్టింపంగ నతని పాలికి గంగా
ధరుఁ డేఁగుదెంచి నెవ్వగఁ | బొరయు నతనితోడఁ గరుణ వొంపిరివోవన్‌.
337
వ. అనునయ పూర్వకంబుగా నిట్లనియె. 338
క. ‘జలపవనాంబర వసుధా | నల సమవీర్యుఁడగు పుత్రు నాకొసఁగంగా
వలయు’నని యడిగి తిచ్చితి | నలఘు తపోవిభవ! యేను నట్టికుమారున్‌.
339
వ. వాఁడును మత్ప్రభావంబునను భవత్తపోవిశేషంబునను బ్రహ్మతేజోమయుండై దేవతలకుం బొందరానిపరమగతిం బ్రాపించె దీనంజేసి మోదంబు నందవలదె? విషాదంబునకుం బనియేమి?’ యని పలికి వెండియు. 340
తే. ‘ఇలయు గిరులును శరధులు నెంతదాఁకఁ | గలుగు నంతకాలంబును వెలయుచుండు
శుకుని కీర్తియు నీదు యశోవిభూతి | యును జనంబుల వీనుల కుత్సవముగ.’
341
వ. అని నిర్దేశించి ‘వలయునేనిఁ బుత్రసదృశయైన ఛాయ నిన్నెప్పుడు ననుగమింప దర్శించువాఁడవు గా’కనియె నిట్లనుగ్రహించి యా బ్రహ్మర్షి ప్రవరుని సంప్రీతునింజేసి వీడుకొల్పి విశ్వేశ్వరుండు నిజేచ్ఛం జనియె నింతవట్టు నారదుండు నాకుం జెప్పె. 342
క. ఇది యితిహాసవరము దనుఁ | జదివిన వారలకు వినిన జనముల కాయుః
ప్రదమగు లక్ష్మీ కీర్త్య | భ్యుదయంబుల నిచ్చు సుగతియును గావించున్‌.
343
వ. అనియె నద్దేవమునిచేత నా వినినచొప్పున నీకుం జెప్పితి నీవింక నేమి వినవల తనుటయ ధర్మతనయుండు శంతనుతనయుతో బ్రహ్మచర్యాదులగు నాలుగాశ్రమంబుల వారును దమకు నుత్తమపదసిద్ధిం గోరి యారాధించు దైవం బెయ్యది దయ పల్లవింప నా కెఱింగింపుము. 344
క. అనియె నని చెప్పి గురుభ | క్తి నిరూఢుఁడు లోకమాన్య తేజుఁడు విద్యా
ఘనుఁడగు నా వైశంపా | యనమునివరుఁ డిట్టు లనియె నాతనితోడన్‌.
345
తే. వ్యాసమునినాథు షడ్గుణైశ్వర్యధుర్యు | నాగమవ్యాసకర్మఠు నమితతేజుఁ
గొలిచి తత్ప్రసాదంబున వలనుఁ బెంపుఁ | గలిగి యేను నారాయణు కథ ఘటింతు.
346
వ. అని భక్తిపూర్వకంబుగాఁ బలికి జనమేజయున కిట్లనియె న ట్లజాతశత్రుం డడిగిన నయ్యాపగాపుత్రుం డతనితో నారాయణనారద సంవాదం బను నితిహాసంబు మా తండ్రి నాకుం జెప్పె దాన నీయడిగిన యర్థంబు దేటపడం జెప్పెద. 347
క. అని పలికి యాదరంబున | మనంబు మేదురము గాఁగ మనుజేశ్వర! య
జ్జనపతి వీను లమృతరస | మున నించినయట్టి చందముగ నిట్లనియెన్‌.
348
AndhraBharati AMdhra bhArati - AndhramahAbhAratamu - #00# parvamu - kavitraya bhAratamu - kavitrayamu - nannaya - tikkana - eRRana - nannyya tikkanna eRRana - andhramahabharatamu aandhramahaabhaaratamu ( telugu literature andhra literature )