| పురాణేతిహాసములు | శ్రీమహాభారతము | ద్రోణపర్వము - తృతీయాశ్వాసము |
| క. |
‘మనకు నిమిత్తము లెంతయు | ననుకూలము లయ్యె; గెలుతు; మాహవమున కేఁ జనియెదఁ బ్రతిజ్ఞ తీర్పఁగ; | ననఘా! ధర్మసుతు రక్ష కరుగుము నీవున్. |
20 |
| క. |
‘విను! సింధురాజవధయును | మనుజాధిపరక్షణంబు మనకు సరియ కా వున నే నొకపని నీ వొక | పని మేకొని చేయు టరయఁ బాడియ కాదే! |
21 |
| ఆ. |
ఏను నిలిచినట్ల కా నూఱడిల్లు నీ | వున్న న న్నరేశ్వరోత్తముండు; నిర్భరుండ వగుము నీవు నాదెస; నాకు | హరి గలండు; గలఁడె యచట నితఁడు? |
22 |
| వ. | ఎల్లభంగుల రాజరక్షణార్థంబుగా నీకుఁ బోవలయును; బరాక్రమధుర్యుండగు నాచార్యుప్రతిన యెఱుంగవే!’ యనుటయు, ‘నట్ల కాక’ యని యతండు ధర్మనందనుపాలికిం జనియె; నజ్జననాథుండు సమరోత్సాహ సముజ్జ్వలుం డయి వచ్చి నిజ సైన్యంబు నలంకరించి చిహ్నంబులు మెఱయ నెఱయం బొలిచి నిలిచె’ ననిన విని సంజయునకు ధృతరాష్ట్రుం డి ట్లనియె. | 23 |
| సీ. |
పుత్రశోకానలంబును గ్రోధవహ్నియు | మనమున ముప్పిరి గొనఁగ మృత్యు భంగి నేతెంచు బీభత్సునిఁ గౌరవుల్ | సెనకఁజాలర యేమి చేటు; మూఁడె నో? పురిలో నొక్కయుమ్మడి నింటింట | నార్తనాదములు పెక్కయ్యె; నెల్ల రవముల మిగిలి సైంధవునింటి దిక్కున | నాక్రందనధ్వను లతిశయిల్లె; |
|
| తే. |
నేను ద్రోణుండు భీష్ముండుఁ బూని చెప్ప | శౌరి మాటలు మీ రాజు సరకుగొనఁడ సంధి గానీక కర్ణుండు సౌబలుండు | దుస్ససేనుండు నందఱఁ ద్రుంచికొనిరి. |
24 |
| ఉ. |
ఎక్కటి పోరె; రుద్రునకు నేమిటఁ దక్కువ ఫల్గునుండు? వాఁ డొక్కఁడ యయ్యెనే? జగము లొక్కట మ్రింగఁగఁజాలు; కేశవుం డెక్కినవాఁడు వాని నొగ; లేల చలం? బని యెంత సెప్పినం దక్కఁడు రాజ్యలోభము మదంబున నా కొడు; కేమి సేయుదున్? |
25 |
| వ. | అది యట్లుండె. | 26 |
| తే. |
క్రీడి యమ్మెయి వచ్చినఁ గూడఁ బాఱి | యెడలు గలఁగంగఁ గౌరవు లేమి సేసి? రది యెఱుంగఁగఁ జెప్పవే యనఘ! నీతి | యయ్యె నేమి దా దుర్ణయ మయ్యె నేమి?’ |
27 |
| వ. | అనుటయు నా సూతనందనుం డంబికానందనున కి ట్లనియె. | 28 |
| సీ. |
‘అధిప! చెప్పెద నీకు నంతయు నివ్విలా | పము గతజల సేతు బంధనంబు; మాయ జూదము మున్ను మాన్పవ, పదపడి | సంధి గావింపవ, సకల జనులు నిను లుబ్ధుఁడు నధర్మనిరతుండు నని దూఱు | దురు; దూఱ కే లుండుదురు నరేంద్ర! పాండుఁ డవ్విధమునఁ బాలించె రాజ్యంబు | పాండవు లెక్కుడు ప్రబ్బి యశము |
|
| తే. |
లాభమును భరతాన్వయోల్లాస మెసఁగఁ | దగ నొనర్చిరి వారలఁ దగునె వారి తండ్రిపాలైన సిరి వాపఁ దనయు మీఁదఁ | బెట్టె దేల? నీ దుర్నీతి ముట్టవచ్చె. |
29 |
| ఉ. |
కౌరవు లేమి సేయుదురు? గాండివ ఘోషముఁ బాంచజన్య తీ వ్రారవమున్ సహింప దివిజావలికిన్ వశమే? వియచ్చరుల్ పేరుకొనంగ నాదృఢకపిధ్వజమైన రథంబు తోడనుం బోరిరి పోరు భంగి విను భూవర! శోకము దక్కి ధీరతన్.’ |
30 |
| వ. | అని పలికి యిట్లనియె: ‘రేపకడ గురుండు సంగరోత్సాహదీప్తుం డయి వెడలి శంఖంబు పూరించి సైన్యంబులోనం గలయ మెలంగు నప్పుడు మనయోధు లాయుధంబు లంకించుచు నొండొరులతోడ బిరుదులు వలుకుచు నది యేమి యర్జునుండు దడసె, గోవిందుండు దఱిమికొన రాఁడు, భీమసేనుండు గడంగి పొడసూపం డనుచు సింహనాద శంఖరవ జ్యాఘోషంబులు సెలంగం బొంగుచున్న సమయంబున నా కుంభసంభవుండు సైంధవుం గనుంగొని ‘నీవును భూరిశ్రవుండును గర్ణుండును శల్యుండును నశ్వత్థామయు వృషసేనుండును గృపాచార్యుండును గూడుకొనియుండుండు; మన బలంబులలో మేలేఱి పదునాలుగువే లేనుంగులను నఱువది వేలు రథంబులను, లక్ష గుఱ్ఱంబులును, బది లక్షలు పదాతులను గైకొనుండు; నా తీర్చు మోహరంబునకు యోజనత్రయ మాత్ర ప్రదేశంబునం బిఱిందిదెస బలసి నిలువుం డట్లైన నిన్ను దేవతలకుం దేఱి చూడరాదు పాండవు లెంతటి వా?’ రనిన విని యతండు పెద్దయు నూఱడిల్లి యా రథికవరులు పరివేష్టింప నరిగె; భారద్వాజుండును ద్వాదశగవ్యూతి దీర్ఘంబును బంచగవ్యూతి విస్తృతంబును గా శకట వ్యూహంబు సమకట్టి దానికిఁ బశ్చిమార్ధంబున గర్భవ్యూహంబుగాఁ బద్మవ్యూహంబు వన్నించి తన్మధ్యంబు మొదలుకొని యోలిన సేనాముఖంబు దెసకుం జాలి నిగుడునట్లుగా సూచీవ్యూహంబుఁ గావించి, సూచీముఖంబునం గృతవర్మయు నటపిఱుందఁ గాంభోజరాజును మఱియు బిఱుసన నాప్తులైన శతసహస్ర యోధుల మున్నిడికొని కురురాజును మూలస్థానంబునఁ బూర్వోక్తప్రకారంబున నా జయద్రథుండును నిలుచునట్లుగా నొనర్చిన నమ్మహా వ్యూహంబు వేడుకం జూచి ఖేచరులు మెచ్చి; రట్టియెడ. | 31 |