పురాణేతిహాసములు శ్రీమహాభారతము ద్రోణపర్వము - తృతీయాశ్వాసము
ద్రోణుని నాల్గవనాటి యుద్ధము (సం.7-63-28)
క. ‘మొనలోన నిలువ నొల్లక | తన చతురంగములతో నుదగ్రుం డై య
ర్జును నాఁగుదు నేనొకఁ డన’ | యని దుర్మర్షణుఁడు సనియె నార్పులు నిగుడన్‌.
32
వ. చని యయ్యొడ్డనంబునకు వేయునే నూరువిండ్లపెట్టు దవ్వున ముందటం బన్నె; దుశ్శాసన వికర్ణులు సింధురాజ రక్షణ కార్యార్థులై నిజబలంబులతో నమ్మెయి నచ్చేరువకుం బోయి సన్నద్ధులైరి; ద్రోణాచార్యుం డభేద్యంబగు నా శకటవ్యూహంబు ముఖంబున నిలిచి ధవళ వస్త్రంబులు సితోష్ణీషంబును శ్వేతవర్మంబును నరుణాశ్వంబులును వేదికాధ్వజంబును వెలయ నుద్దండ కోదండుండై దండధరుకైవడిం బొలిచె; నట్లు కుంభ సంభవ సంరక్షితంబైన యా సైన్యంబు సాగర గిరి గహన సహితంబుగా మహి యెల్ల మ్రింగ నప్పళించున ట్లున్నం గనుంగొని కౌరవులును గురుపతియును బ్రముదిత హృదయులై; రా సమయంబున. 33
క. చూపులు మిఱుమిట్లు గొనఁగ | నేపారిన వానరేంద్రు నెసకంబున ను
ద్దీపిత మగుపడఁగ భయద | రూపంబునఁ గ్రాలఁగా నరుఁడు దోతెంచెన్‌.
34
సీ. అమ్మహా వీరున కనతిదూరంబున | బిరుదు మూఁకల నడపించి ద్రుపద
సూతియు నకులుని సుతుఁడు శతానీకుఁ | డును మొగ్గరం బమర్చిన మృదంగ
శంఖ భేరీ ధ్వాన సంగమ మేదుర | సింహనాదంబులు సెలఁగ నొప్పె
నప్పార్థుఁ డొ డ్డరయం బెట్టు కొలఁది న | బ్బలముముందటఁ దేరు నిలిపి యొత్తు
 
తే. దేవదత్తంబు రవముతోఁ దీవ్ర పాంచ | జన్య నినదంబు భూరినిస్వనయుతముగ
నిగుడు వానర రావంబు నింగి ముట్టె | నపుడు మన సేన బెగ్గల మగ్గలించె.
35
ఆ. మొరపవాన పెల్లు గురిసె; నుల్కాతతి | డొల్లెఁ బడియె; పిడుగు లెల్లకడల
నస్మదీయ బలమునందుఁ బదంపడి | యధిప! తూర్యనినద మతిశయిల్లె.
36
వ. అయ్యవసరంబున నీ యోధు లొండొరులం బిలిచికొని పురికొలిపికొనుచు సింహనాదంబులతోడం జెలంగి; రంత. 37
క. ‘చెలియలికట్ట సముద్రము | నిలిపిన క్రియ నేన పార్థు నిలిపెద’ ననుచుం
దలమిగిలి వెడలె మొనకును | బలువిడి దుర్మర్షణుండు పార్థివముఖ్యా!
38
క. కని విజయుఁ డలరి హరి కి | ట్లను ‘నేనికగములతోడ నడరెడుఁ గడఁకన్‌
మును దుర్మర్షణుఁ డిదె యిం | దు నడపు; మరదంబు వీఁడు తొలుముద్ద యగున్‌.’
39
ఆ. అనిన నట్ల చేసె నతఁ డా ధనంజయుఁ | డగ్గజేంద్రరాజి నస్త్రసమితిఁ
బొదివెఁ గారుమొగులు భూధరనికరంబు | బహులవృష్టిఁ గప్పుభంగిఁ దోఁప.
40
క. ఒక్కఁ డని కడఁగి రథికులు | పెక్కండ్రు నిశాత విశిఖ భీమాకృతిఁ బే
రుక్కునఁ బొదివిరి నరు నతఁ | డెక్కుడు మద మొలయఁ జేతి యేడ్తెఱ సూపెన్‌.
41
వ. అప్పుడు. 42
క. పలు తలలు ముఖవికాసము | వొలియక పడియున్న సమర భూభాగము పె
ల్లలరిన తామర కొలనిం | దలపించెన్‌ గగన చర వితతి పులకింపన్‌.
43
తే. తొడవు లొప్పార నెత్తుట దోఁగి పెక్కు | గజము లొక్క యెడన పడి కరము వొలిచె
జంట మెఱుఁగులతో నెఱసంజకెంపు | గదురఁ జెలువొందు మొగిళుల గమియుఁ బోలె.
44
వ. ఇట్లు గనుపుకొట్టు కవ్వడికి నోహటింపక నీ సైనికులు పైపయిం గ్రమ్మి వివిధాస్త్రశస్త్రంబు లతనిపైఁ గురియ నతండు హస్తిహస్తంబుల నశ్వశరీరంబుల రథిక సారథి రథావయవంబులఁ బదాతి గాత్ర ఖండంబులం బ్రథన భూమిం గప్పె; నట్టియెడ మఱియును. 45
క. ‘పార్థుఁడు వేఁడీ? పొదువుడు; | బార్థుఁడ యెట వోయె దింక? బార్థుఁడ! రావే;
పార్థుఁడ! యిక్కడ నెయ్దుము | పార్థునిఁ బట్టుఁ డను నులివు బహుళం బయ్యెన్‌.
46
వ. ఇవ్విధంబున సంకులసమరంబుగాఁ బెక్కు లట్ట లాడ నమ్మోహరంబు వోక పెనంగిన. 47
సీ. అలిగిన గాండీవి యమ్ము లొక్కుమ్మడి | ముందటి దెసను బిఱిందివలన
వలపట దాపట సెలలు పె క్కవిసిన | తెఱఁగునఁ గవిసిన విఱుగు విల్లుఁ
దునియు ఖడ్గంబును దొరఁగు నెత్తురు మ్రొగ్గు | నేనుంగుఁ బడుకాలు మానిసియును
డొల్లుగుఱ్ఱంబును ద్రెళ్ళుతేఱును గూలు | రథికుండు నొఱగు సారథియు నైన
 
తే. మరలె దుర్మర్షణుఁడు దోన తెరలె సేన | యపుడు సమ్మెట కోలల నంకుశములఁ
జేఱుకోలల వ్రేటుల నీఱతాఱ | యదలుపుల వాహనంబులు సెదరి పఱచె.
48
క. అనుటయు ధృతరాష్ట్రుండి | ట్లను సూతతనూజుతోడ ‘నప్పుడు నరు మా
ర్కొన నెవ్వఁ డేనిఁ గలిగెనో? | చనిరో యందఱును ద్రోణు జంటకు భీతిన్‌?’
49
ఉ. నావుడు నాతఁడమ్మనుజనాథున కిట్లను ‘నట్టిచోట దం
తావళరాజి మున్నుగ నుదాత్త గుణ స్వన ఘంటికా మహా
రావము లుల్లసిల్ల సమరప్రియుఁ బాండవసింహుఁ దాఁకి య
స్త్రావళిఁ గప్పె దీప్తముఖుఁడై యువరాజు మహాద్భుతంబుగన్‌.
50
వ. ఇట్లు దుశ్శాసనుండు దలపడినం గ్రోధావేశంబునం బెలుచ నవ్వి కవ్వడి దేవదత్తం బొత్తి గాండీవ జ్యానినాదంబు రోదసీ కుహరంబున మేదురంబుగాఁ జిత్రంబులగు రథయాతాయాతంబులనుం బటుబాణ పాతంబులను నగ్గజంబులు వెగడుపడి పంక నిమగ్నంబులుం బోలె నిశ్చేష్టితంబులుగాఁ దదారోహకుల తలలు డొల్లుచప్పుళ్ళు మహావాత పతితంబు లగు తాళఫలంబుల రవంబు ననుకరింప మఱియును గరవాల గదాధనుస్సాయక సహితంబులగు బాహువులు బహువిధ మహానాగంబుల భంగి రణభూమి నభిరామ ఘోరంబుగా ననేక ప్రకార క్రూరశరంబులు దాఁకి తునియు రూపును రుధిరంబు దొరఁగు రూపును నొఱలు రూపును ద్రుళ్ళి కెడయురూపును దూఁగు రూపును బడి పొరలు రూపును నెత్తురు గ్రక్కు రూపును జిక్కురూపును రూపుసెడు రూపును నై కరి తురగ నర నికరంబులు వికలంబులుగా విజృంభించిన నతని సంరంభంబు సైరింపం జాలక సబలంబుగా నయ్యువరాజు వాఱిన వెనుకొని యప్పాండవ మధ్యముండు. 51
చ. ‘నిలు నిలు మెందుఁ బోఁ గలవు? నీ విటు వాఱినఁ జావు దప్పునే?
యలవుఁ జలంబుఁ బోవిడిచి యా సభ నించుక శంక లేక నీ
పలికిన యన్నియున్‌ మఱచి భంగపుఁ జచ్చుట దెచ్చికొంటి పె
ద్దలు వగఁబొంద, నన్నకును దమ్ములకున్‌ దలవంపుగా నిసీ!’
52
వ. అని పలుకుచు నీకొడుకు పెడతలయు వెన్నును బదితూపుల నేపారి యేసిన నతండు మరలియుం జూడక ద్రోణాచార్యుం జూచుచుం బాఱె; బీభత్సుండును సైంధవుని దెసకు మనసునిగుడ మనమొనపయి నడచి యగ్రభాగంబున నున్న యగ్గురుం గనుంగొని యనతి దూరంబున నిలిచి నమస్కరించి కృష్ణుం డనుమతి సేయ జేతులు మొగిచి యి ట్లనియె. 53
AndhraBharati AMdhra bhArati - AndhramahAbhAratamu - #00# parvamu - kavitraya bhAratamu - kavitrayamu - nannaya - tikkana - eRRana - nannyya tikkanna eRRana - andhramahabharatamu aandhramahaabhaaratamu ( telugu literature andhra literature )