| పురాణేతిహాసములు | శ్రీమహాభారతము | ద్రోణపర్వము - తృతీయాశ్వాసము |
| ఉ. |
‘మేలుదలంపు శోభనము మేకొని చేయుము నాకుఁ బాండుభూ పాలుని ధర్మనందనుని పంకజనాభుని యట్ల కావె! మ త్పాలన వృత్తి కీవు నినుఁ బ్రార్థన సేసి భవత్ప్రసాద లీ లాలసితుండ నై మొన దలంకఁగఁ జొచ్చెద భూసురోత్తమా!’ |
54 |
| క. |
‘నను నశ్వత్థామను నీ | వనఘా! సరికూర్మిఁ బెనిచి తట్లగుటను ద్రో హిని సైంధవుఁ జంపఁగఁ బూ | నిన నా యుచిత ప్రతిజ్ఞ నెఱపుము కరుణన్.’ |
55 |
| తే. |
‘అనుడుఁ బిన్నన వ్వొలయఁగ నస్త్రగురుఁడు | నరునిపైఁ జూడ్కి నాటించి ‘నన్ను గెలువ కెట్లు సైంధవుఁ జేరె’దం చేసె రథ్య | ములును హరియును నతఁడు నమ్ముల మునుంగ. |
56 |
| వ. | ఇ త్తెఱుంగున నేయుటయు నని సేయుటకై య మ్మహాత్మునకు విజ్ఞాపనంబు సేసి. | 57 |
| క. |
అనుమతుఁడై విజయుం డా | తనిమీఁద నిశాత విశిఖ తతి వఱపి రయం బున నవ నారాచము లే | సిన నడుమన నఱకె నతఁడు శీఘ్రత మెఱయన్. |
58 |
| తే. |
నఱికి తోడన హరిమేను నరుని యొడలు | నేయ గురువిల్లు విఱుగంగ నేయఁ దలఁచె న క్కిరీటి యాలోనన యతని మౌర్వి | వికలముగఁ జేసె నాధనుర్వేదవిదుఁడు. |
59 |
| క. |
రహితగుణచాపుఁ డగు న | య్యహితాంతకుఁ బొదివె కేశవాశ్వ పతాకా సహితంబుగ రుచిర స్మిత | మహితుఁ డగుచు న గ్గురుండు మార్గణ వితతిన్. |
60 |
| వ. | ఇవ్విధంబునం గుంభసంభవుండు విజృంభించిన వివ్వచ్చుం డలిగి సజ్యశరాసనుండై యాధనురాచార్యుం బటు బాణ విసరవేగంబున నతిక్రమించి కెలంకుల బలంబుల నాక్రమించిన. | 61 |
| సీ. |
కులిశంబు తాఁకున కూలిన కులపర్వ | తంబుల కరణి మత్త ద్విపములు బలుగాలిఁ దూలిన జలధరపంక్తుల | చాడ్పున నుద్భట స్యందనములు గీలుకాఁ డెడలింపఁ గెడసిన బొమ్మల | కైవడిఁ బడు తురంగవ్రజంబు బెడిదంపు వఱ్ఱోడిఁ బడిన పేరడవి చం | దంబున బహుల పదాతి చయము |
|
| తే. |
‘వికటముగఁ ద్రెళ్ళె నలుగడ విచ్చె నొక్క | పెట్ట వెస డొల్లె నిలఁ జాపకట్టు పడియెఁ జండ గాండీవ నిర్ముక్త శాత వివిధ | కాండ దారుణ ప్రహతులఁ గౌరవేంద్ర!. |
62 |
| ఆ. |
అడ్డుపడి గురుండు దొడ్డనారసము వ | క్షంబు దూఱ నేయ సవ్యసాచి యొల్లఁ బోయి తెలిసి పెల్లేసె న క్కుంభ | జన్ముమీఁద నిశితసాయకములు. |
63 |
| వ. | అతండును. | 64 |
| క. |
హరి నైదువిశిఖముల న | న్నరు డెబ్బదిమూఁట గేతనము మూఁటను స త్వరుఁ డై యేయుచు శితశర | పరంపరలు తద్రథంబుపైఁ బరఁగించెన్. |
65 |
| క. |
కరములు నిగుడఁగ నొప్పెడు | తరణిఁ బొదువు వర్షదంబుదముక్రియ నట్లా స్ఫురితాస్త్రుఁ బార్థు నత్యు | ద్ధుర బాణ సమగ్రుఁడైన ద్రోణుఁడు వొదివెన్. |
66 |
| వ. | పొదివిన యగ్గురు ప్రాపున భవదీయ సైనికులు గొందఱాకృష్ణులం జేరి పరాక్రమించుట గుండ్లు దేలి బెండ్లు మునింగిన ట్లయ్యె; నిబ్భంగి నక్కిరీటి కుమారుండయ్యును వృద్ధుండగు గలశ భవునిం గడవంజాలక చిక్కువడి యున్నం జూచి విచారించి యచ్యుతుం డతని కి ట్లనియె. | 67 |
| క. |
‘రిత్త దడవు గాకుండఁగ | నిత్తఱి నాచార్యుతోడి యీ సుడిగి వెసం జొత్తము శకటవ్యూహము | చిత్తంబున నొండు దలఁపు సేర్పకు మింకన్.’ |
68 |