పురాణేతిహాసములు శ్రీమహాభారతము ద్రోణపర్వము - తృతీయాశ్వాసము
అర్జునుఁడు ద్రోణాచార్యుల నతిక్రమించి కురుసైన్యంబు సొచ్చుట (సం. 7-66-30)
చ. అనవుడుఁ గ్రీడి ‘నీదు హృదయంబున నెయ్యది దోఁచెఁ గృష్ణ! దా
నిన తగఁ జేయువాఁడ’ నని నెమ్మిగఁ బల్కినఁ బ్రీతిఁ గుంభజ
న్మునకుఁ బ్రదక్షిణంబుగ సముద్ధతి నాతఁడు దేరు వోవ ని
చ్చిన శరజాలముల్‌ వరఁగఁ జేయుచుఁ బార్థుఁడు వోవుచుండఁగన్‌.
69
వ. కనుంగొని నవ్వుచు భారద్వాజుండు. 70
క. ‘కలవే యెందును నిట్టివి? | బలసూదనతనయ! పగఱఁ బరిమార్పక వి
చ్చలవిడిఁ బ్రతిష్ఠితుఁ డవుగఁ | దలఁచెదు పోలు నొకొ!’ యనుచుఁ దగిలెఁ బిఱుందన్‌.
71
వ. ధనంజయుండును. 72
క. గురుఁ డవు గాక పగతుఁడవె? | దురమునఁ గుపితుఁడగు ని న్నెదుర్కొన నా కొ
క్కరునకు శక్యమె? యా | పురహరున కగుం గాక!’ యనుచు నరుగుచు నుండెన్‌.
73
వ. ఇవ్విధంబున సైన్యంబు సొచ్చు నా సవ్యసాచి చక్రరక్షకులగు పాంచాల కుమారులు యుధామన్యుండును నుత్తమౌజుండును దోడన వచ్చి చొచ్చి; రప్పుడు కృతవర్మయుం గాంభోజుండును శ్రుతాయువుఁ దమతమ యున్న చోట్లన యుండి తలలెత్తి చూచి కపిధ్వజ వేదికా కేతనంబుల కతంబునఁ గవ్వడి వెనుకం గలశభవు రాకయుం గని యుత్సాహంబు మిగిలి తగులువడ నడ్డపడుటకు నప్పళించుచుండ నప్పు డప్పాండవ వీరునిం గేకయ ప్రభద్రక నారాయణ గోపాల ప్రభృతులు వొదివి రెవ్వ; రెట్లు వొదివినం బ్రతిజ్ఞాతత్పరుం డగు న న్నరుండు సామజంబు సరోవరంబు దఱియం జొచ్చు తెఱంగున నబ్బల ప్రకరంబు బడలువడం జేయుచుం బోవం బోవ. 74
క. కదిసి శరాసన గురుఁ డిరు | వది యేనుశరంబు లేయఁ బార్థుఁడు వానిం
గుదియించి విశాలాస్య | ప్రదరము లడరింపఁ గుంభభవుఁ డెడఁ ద్రుంచెన్‌.
75
క. విజయుం డను శైలము గల | శజ ధారాధరము గప్పె శరవృష్టి మహా
ద్విజు నతఁ డేయక కడున | క్కజముగ నయ్యంపసోన గ్రక్కున మాన్చెన్‌.
76
ఆ. మఱియు నిరువదేను మార్గణంబుల నరు | డెబ్బదింటఁ గృష్ణు నుబ్బి యేసి
గురుఁడు నారసములఁ గురియంగ నవి యాఁగ | నలవి గామి నతఁడు నతఁడు నొచ్చి.
77
వ. అమ్మేటివిలుకాని వంచించి కృతవర్ముని సైన్యంబు సొచ్చుటయు, నగ్గురుండు సేయునది లేక సేనాముఖ రక్షణంబునకుం జనియె; నప్పార్థుని మార్కొని కృతవర్మ పదియమ్ము లేసిన నక్కిరీటి యొక్క వాల మ్మురమ్మున నాటించి మఱియును నారాచత్రయంబున నొప్పించె; నా భోజపతి యన్నరనారాయణులం గనుంగొని నవ్వుచు నిరువదేసేసి తూపులం బరగించిన ధనంజయుం డతని ధనువుఁ దునిమి యేకవిశంతి విశిఖంబుల నొప్పించిన, నొండు కోదండంబు గొని హార్దిక్యుండు బాణ పంచక యుగంబు వివ్వచ్చు వక్షంబున గ్రుచ్చె; నప్పు డా సవ్యసాచిం జూచి యితండు దవులు వడియె నిది గా దని తలంచి దామోదరుండు. 78
క. ‘తడవయ్యె నితఁడు మన కె | క్కడి బంధుం? డేల కృప దెగంబాఱుము’ నా
వుడుఁ గీలెడసిన జంత్రము | వడువునఁ బడ నేసె నతని వాసవి యధిపా!
79
వ. ఇట్లు భోజపతిం గ్రూరనారాచంబుల మూర్ఛితుం జేసి. 80
తే. కడచి కాంభోజ సైన్యంబు గలఁగఁ బెలుచఁ | జొచ్చు వివ్వచ్చు వెనుకన చొరక యుండ
ముట్టి యాఁగె నా కృతవర్మ మూర్ఛదేఱి | వచ్చి రథ చక్ర రక్షకద్వయముఁ గడిమి.
81
వ. ఇవ్విధంబున నుత్తమౌజుని యుధామన్యుం బోనీక భోజపతి శరచతుష్టయంబును సాయకత్రయంబునుఁ దనువులం గీలించిన, నయ్యిరువురుం బదేసిబాణంబుల నతని నేసి, తత్కోదండంబు దుండంబులు సేసిన నతండు. 82
ఉ. వేఱొక విల్లు పుచ్చుకొని విండులు రెండును ద్రుంచి మేనులం
దూఱఁగ నేసె బెట్టిదపుఁ దూపుల వారును వాని యమ్ములన్‌
గీఱఁగ నొండు విండ్లు గొని కిన్క యెలర్పఁగ నేసి రెమ్మెయిం
దీఱద గండి గాంచి నరు తేరిపథంబునఁ బోవ వారికిన్‌.
83
AndhraBharati AMdhra bhArati - AndhramahAbhAratamu - #00# parvamu - kavitraya bhAratamu - kavitrayamu - nannaya - tikkana - eRRana - nannyya tikkanna eRRana - andhramahabharatamu aandhramahaabhaaratamu ( telugu literature andhra literature )