| పురాణేతిహాసములు | శ్రీమహాభారతము | ద్రోణపర్వము - తృతీయాశ్వాసము |
| వ. | అట్లు చొచ్చు వివ్వచ్చుం జూచి శ్రుతాయుధుం డను రాజు రభసంబున నెదిర్చి మార్గణ త్రయంబున నేసి వాసుదేవునిపై సప్తతి ప్రదరంబులు నిగిడించి. | 84 |
| తే. |
వెడఁదతూపునఁ గేతువు వ్రేయఁ గ్రీడి | నవతి విశిఖంబు లేయ నన్నరవరుండు డెబ్బదేనమ్ము లడరింప నుబ్బి విల్లు | ద్రుంచి యుర మేడుశరముల నొంచె నరుఁడు. |
85 |
| క. |
కోపించి యాతఁడొండొక | చాపము గొని నవనిశాతసాయకములు బా హోపరితలముల నురమున | నేపున నాటుటయుఁ బార్థు డెలన వ్వొలయన్. |
86 |
| ఉ. |
సారథిఁ గూల్చి యశ్వములఁ జంపి తదంగములందు సప్తతి క్రూరశిలీముఖంబు లతిఘోరముగాఁ దొరఁగింపఁ బ్రస్ఫుర ద్భూరి గదాభిరాముఁ డయి దుర్దమ లీల రథంబు డిగ్గి యా ధీర గుణోత్తరుం డతని తేరిదెసం గవిసెం రయంబునన్. |
87 |
| వ. | ఆ రాజు వరుణ తనయుం డనియు, నగ్గద వరుణు వరంబున వచ్చిన దనియు, దాని నిచ్చునప్పుడు ‘దీని ధరించినవాడు రిపుల కజేయుండగుఁ బోటెక్కించుకొనని వానిమీఁదం బ్రయోగించిన వానిన మరలి వధియించు’ ననియు చెప్పె ననియును బెద్దలవలన విందుము. | 88 |
| ఉ. |
కాలము ప్రాప్తమైన మదిఁ గానఁడ! యన్నియమంబు మేదినీ పాలకుఁ డప్పు డట్లగుటఁ బంకజనాభుని వైచె నాతఁ డా భీల గదం దదంసమునఁ బెట్టిన నూతన బుష్పమాలయుం బోలి వెలింగెఁ గాని యది భూవర! నొంపద యించుకేనియున్. |
89 |
| వ. | ఇట్లు గోవిందునకుఁ గుసుమాభరణంబై పొలిచి యా క్షణంబ. | 90 |
| ఆ. |
అశని కరణి వచ్చి యా శ్రుతాయుధునిపై | నమ్మహోజ్జ్వలాయుధమ్ము వడినఁ బార్థు చేత మున్ను బాహులు దెగిపడ్డ | యతఁడు కొండ గూలినట్లు కూలె. |
91 |
| వ. | ఇట్లు వరుణతనయుఁడు పడిన గనుంగొని. | 92 |
| క. |
అచ్చటి బలములు బ్రభువులు | నచ్చెరువును భయము మనములం దడరంగా విచ్చిన నట చనియెడు వి | వ్వచ్చుని గాంభోజవిభుఁడు వడి మార్కొనియెన్. |
93 |
| వ. | ఇట్లు మార్కొనుటయు. | 94 |
| సీ. |
అర్జునుం డతని నేడమ్ముల నేసినఁ | బదియేను శరములఁ బార్థుఁ గృష్ణు విశిఖత్రయమున నవ్విభుఁ డేయ నాతని | విజయుఁ డస్త్రద్వయ విహతుఁ జేయ, బాణముల్ మూఁటను బటుశక్తిఁ గ్రీడి నొ | ప్పించి కాంభోజుండు పేర్చి యార్చె; నరుఁ డల్గి వెసఁ బదునాలుగు దూపుల | సూతాశ్వకోదండ కేతనములఁ |
|
| తే. |
గూల్చి దొడ్డ నారసమున గుండెకాయ | వగుల బెట్టేయుటయు, నతిప్రబల పవన భూరి రయమునఁ గూలు మహీరుహంబు | తెఱఁగు దోఁప సుదక్షిణుఁ డొఱలి కెడసె. |
95 |
| వ. | ఇట్లు కాంభోజపతి వడుటయు శూరసేన శిబి వసాతి ప్రముఖానేకదేశంబుల బలంబు లబ్బలమర్దననందనుం జుట్టుముట్టిన, నతండు దఱచు వాలంపగముల నాఱువేల రథంబుల రూపుమాపినం, గనుకనిం దెరలినం గని శ్రుతాయువు నయుతాయువును గాండీవి రెండు గెలంకుల సాయక సహస్రంబులు నిగిడించుచుం గవిసి; రప్పుడు శ్రుతాయువు చేతి తోమరంబున నొచ్చిన వ్వివ్వచ్చుం బిడుగు వడిన వానిం గొఱవిఁ జూడిన తెఱంగున నయుతాయువు నాలోనన శూలంబు వైచి సోలంజేసిన విషాదంబున గరుడధ్వజుండు సొగయ నా కపిధ్వజుండు నిజధ్వజదండం బొక్కింత యూఁతగొనిన నక్కురు సైన్యంబుల సింహనాదంబులుం దూర్య నినదంబులుం జెలంగె; నంత శౌరి ప్రబోధింపం దేఱి ధనంజయుం డైంద్రాస్త్రంబు ప్రయోగించుటయు, నది వివిధాయుధాకారంబులం గవిసి నయ్యిరువుర హస్తమస్తక శకలంబులు ధరం దొరంగించి తదనుచరులం బంచశతరథిక వీరయోధుల వధియించి చూపఱకు విస్మయం బాపాదింప నిలింపపతిసుతుండు దఱిమికొని పోవు తఱి నయ్యిద్దఱ కొడుకులు నియుతాయువు దీర్ఘాయువును శోకవేగంబున నరవాయి గొనక పయింబడిన నుద్దవిడి గవ్వడి వారలం దండ్రులం గూడ ననిచి మహార్ణవంబు గలంచు మందరంబు చందంబున నీ బలంబులం దిరుగుడువడం జేయుచు నురవడించు సమయంబున. | 96 |
| ఆ. |
కురునరేశ్వరుండు పురికొల్పఁ బ్రాచ్యక | ళింగ దాక్షిణాత్యు లంగబలము మ్లేచ్ఛతతియు బెరయ మెయికొని తాఁకిరి | గజఘటాసమృద్ధిఁ గారుకొనుచు. |
97 |
| వ. | అట్టియెడ గాండీవ ముక్త మార్గణవర్గంబు వేగంబున. | 98 |
| క. |
చేతులుఁ దొండములు శిరో | వ్రాతముఁ గుంభస్థలములు వడిఁ దొరఁగె ధరి త్రీతలమున నంకుశ బహు | హేతి శకల సహితముగ మహీవరముఖ్యా! |
99 |
| తే. |
ఇవ్విధంబున నుఱుమాడ నీడఁ బోక | యవనపారద శక బర్బరాదు లైన మ్లేచ్ఛబలములు ధైర్యంబు మిక్కుటముగఁ | బొదివి పోరెను గ్రీడి యద్భుతము నొంద. |
100 |
| క. |
తుంగమడువుఁ జొచ్చిన మా | తంగమునకు మిగిలి యడవి దరికొను కార్చి చ్చుం గడచి యబ్బలంబుల | భంగించె నతండు ఘోర బహు విధ గతులన్. |
101 |
| వ. | ఇట్లు నారాయణ మారుత ప్రేరితంబగు నరజ్వలనంబు శరజ్వాలాజాలంబున భవత్సేనాకాననంబు రూపుమాపె; నప్పుడు. | 102 |
| తే. |
అర్జునుం డను పర్జన్యు నస్త్ర వృష్టిఁ | బల్లమును మిఱ్ఱునని యేఱుపఱుపరాక యుండ నెత్తురు వెల్లు లొండొండ పెరిఁగె | నుబ్బి భూతబేతాళంబు లోలలాడ. |
103 |
| వ. | ఇమ్మెయి నద్భుత విక్రమంబున నతిక్రమించి కడంగు కవ్వడి నంబష్ఠపతి యగు శ్రుతాయువు మార్కొని నొగ నొగం దాఁక నరదంబు వఱపుటయు. | 104 |
| చ. |
అతని శరాసనంబును హయంబులఁ ద్రుంచిన నాశ్రుతాయు వు ద్యతగద నొప్పఁ బట్టి దనుజాంతకు వ్రేసె నరుండు దద్గదా హతి యొనరించె నొండుగద నాతఁడు వెండియు విక్రమించినన్ శతమఖసూతి యాతని భుజంబులుఁ గంఠముఁ ద్రుంచె వ్రేల్మిడిన్. |
105 |
| వ. | ఇత్తెఱంగున ద్రోణాచార్యుం గడచి కృతవర్ముని బెట్టుపఱిచి, శ్రుతాయుధునిం గూల్చి, కాంభోజపతిం బడవైచి శ్రుతాయుః ప్రభృతుల నులిపి తఱిమి భవదీయ సైన్యంబు సొచ్చి బహువిధ యోధ ప్రాణంబుల బాణనాళంబులం బీల్చి కొనుచుం బెలుచ నడరు ఫల్గునుం గనుంగొని నీ కొడుకు దేరు దోలుకొని యొంటిమై నక్కుంభసంభవు కడకుం జని కటకటంబడుచు నతని కిట్లనియె. | 106 |