| పురాణేతిహాసములు | శ్రీమహాభారతము | ద్రోణపర్వము - తృతీయాశ్వాసము |
| చ. |
‘నిను నవలీల దాఁటి ప్రజ నేలకుఁ గోలకుఁ దెచ్చుచున్న య ర్జునుఁ దలయెత్తి యైన నటు సూడవు పాండవపక్షపాతి నీ మన మటు గాన నెప్పుడును మాదెసఁ గప్ప యెలుంగుఁ బామ వై యునికి యెఱుంగ వచ్చె; నటు లూఱట గా వర మిచ్చినాఁడవో? |
107 |
| క. |
నిను నమ్మి యొండువలనికిఁ | జనక జయద్రథుఁడు నిలిచె సైన్యములో నా తనిఁ జంపెడు తేనియపూ | సినకత్తివి గాక మానిసివె? యూహింపన్’. |
108 |
| వ. | అని పలికి కార్యదాహంబునం జేసి తన రాజసం బడంచుకొని యతండు. | 109 |
| తే. |
సైంధవున కడ్డమున్న రాజవ్రజంబు | పార్థు రాకకు వెలువెలఁ బాఱఁ జొచ్చె! నార్తిఁ బలుకు నా మాటల కలుగ కకట! | చావకుండంగ నాతనిఁ గావవయ్య! |
110 |
| వ. | అనిన విని యాచార్యుం డతని కి ట్లనియె. | 111 |
| క. |
‘నీ మాటకు మా యశ్వ | త్థామ వచనములకు నేఁ బదరుదునె? విను మా దామోదరు మతి ముంగలి | గా మారుతవేగ ఘోటకస్ఫురణ మెయిన్. |
112 |
| క. |
చనునప్పు డతని యమ్ములు | వెనుకఁ బ్రజం దాఁకుచుండు వివ్వచ్చుని నేఁ జననీక యాఁగువాఁడనె? | కనికని యిటు లేల పలుకఁ గౌరవనాథా! |
113 |
| వ. | అది యట్లుండె; నొకహితంబు సెప్పెద నాకర్ణింపుము; సేనాముఖంబు విడిచి యే నర్జును వెనుకం బోయినం బాండవ బలంబు లురులం దోఁ తెంచు మనయొడ్డు గలంగిన సైంధవుం గాచు టరిది; యట్లుంగాక రాజమధ్యంబున ధర్మరాజుం బట్టెద’ నని యాడిన ‘నాకు నప్పని యేమఱందగునే యతనిన వేచి నిలిచెద; విశేషించి వృద్ధ నగుటంజేసి శీఘ్రయానం బశక్యంబయి యుండు; గాండీవియు నీవును దుల్యవయో వర్తనులరు; శంక లేక వానితో విరోధంబు గొన్నవాఁడవు తగు సహాయులం గూర్చికొని యడ్డపడుము; చయ్యనం జను’ మని పలికిన నతండు. | 114 |
| చ. |
‘నినుఁ గృతవర్మ గెల్చి యవనీపవర ప్రకరంబు నోర్చి పే ర్చిన నరు నేన కాదు సురసేనయు నింద్రుఁడు నైనఁ దాఁక నే ర్చునె? యది కార్యతంత్రముగఁ జూచిత యేని భవన్నియోగమున్ గొనకొని చేసెదన్ యశము గోల్పడకుండఁగఁ జూడు మెమ్మెయిన్’. |
115 |
| వ. | అనుటయు నగ్గురుం డక్కురుపతిఁ గనుంగొని ‘నీవు నిక్కంబ పలికితి; కిరీటి యట్టివాఁడ; నేఁడొక్క యద్భుతంబు సూపెద; నిక్కవచధారణంబుచేత రక్షితుండవై యతనిం దలపడుము; కృష్ణుండును సమస్తజనంబులు వెఱఁగుపడం దదీయ శరంబులు నీ తనువుఁ దాఁకకుండ గల యవి’ యని చెప్పి యొక్క పసిండికత్తళంబునం దా శక్తి యావహించి యిచ్చినం బుచ్చుకొని, ప్రీతుం డగుచు నియతాత్ముండై దానిం దొడుగునప్పు డాచార్యుం ‘డిది దొల్లి దేవ సంరక్షణార్థంబుగా నజుండు దేవేంద్రున కిచ్చె; నది యతం డంగిరసునకు, నంగిరసుండు బృహస్పతికి, బృహస్పతి యగ్నివైశ్యునకు, నగ్నివైశ్యుండు నాకును దీని నొసంగి’ రని యెఱింగించి, సమంత్రకంబుగాఁ దొడిగి నానావిధ వాక్యంబుల దీవన లిచ్చి పొమ్మని యనుజ్ఞ సేసిన నమ్మహీపతి యుబ్బి యరదంబు సత్వరంబు సేసి యనేక రథకరితురగ నరనికరంబులు దన్నుం బరివేష్టింప వివిధ తూర్యనాదంబులు నింగిముట్ట వివ్వచ్చు వెనుకొనియె; నట్టియెడ నిక్కడ. | 116 |
| చ. |
సరభసవృత్తిఁ బాండుసుతసైన్యము లొక్కట నేచినం గడుం దిర మయి నీ బలంబులు నుదీర్ణత సూపిన జాహ్నవీ సము ద్ధుర యమునాభిఘట్టనముతో నెనవచ్చె నరేంద్ర! యప్డు సం గర మతిఘోరమయ్యె; నొకకాలము నట్టివి సూడ మెయ్యెడన్. |
117 |
| వ. | అ య్యవసరంబున. | 118 |
| ఆ. |
నడుమ భానుఁ దాల్చు నభముఁ గనుంగొని | దాని మిగులు బుద్ధి ధరణి భాను యుగము దాల్చె ననఁగ నొప్పిరి తీవ్రతే | జమున గురుఁడు ద్రుపదసంభవుండు. |
119 |
| వ. | ఇట్లు ద్రోణ ధృష్టద్యుమ్నులు మెఱసి పోరి; రప్పు డప్పాంచాలవరుండు గురుని శరవర్షంబులు వారించుచు మిగిలి మన వాహినిపై నడరి నేల నెత్తుటం దోఁచిన, నతని కోల్తలకుం గాక యొదిఁగి యచ్చటి ప్రజ మూఁడు గుంపు లయ్యె; నప్పుడు ద్రోణుండు గినిసినం బాంచాల కేకయ ప్రముఖ బలంబులు గలంగం బడిన మగుడనస్మత్సైన్యంబులు పురికొనుటయు ధర్మసూనుండు సోదరాదియోధ వీర సహితంబుగా నురవడించినం, గని, వికర్ణ వివింశతి చిత్రసేనులు భీమసేనుని, బాహ్లికుండు ద్రౌపదేయులను, దుశ్శాసనుండు సాత్యకిని, శకుని నకుల సహదేవులను, సోమదత్తుండు శిఖండిని, నలంబుసుండు ఘటోత్కచునిం, దలపడిరి; శల్యుండు సింధురాజుకడ నుండియు నగ్గలిక నమ్మొగ్గరంబు మొగంబునకుం జనుచు మరలుచునికింజేసి తత్కాల సన్నిహితుం డయిన యుధిష్ఠిరుం దాఁకె; నివ్విధంబునం దార్కొనిన యద్దొరలు నానా ప్రకార దారుణ విచిత్ర సంగరంబులు సేసి పల్లవితాశోకపుష్పిత కింశుక వనంబులం బోలి పొలిచి; రా సమయంబున దుస్ససేనుండు శైనేయుని మూర్ఛితుం జేసిన నాలోనన తెలిసి యతండు ప్రచండ భంగిం బెనంగెఁ; గవల యమ్ముల కోహటించి గాంధారరాజు ద్రోణు దెసకుం బాఱె; నట్టియెడ. | 120 |
| క. |
మనమూఁక యొదిఁగి గుంపులు | గొని యెప్పటి యట్ల యగుడు గురుఁ డతిరభసం బున ధృష్టద్యుమ్నుని భీ | ముని ధర్మజుఁ బొదివి యుగ్రముగ నేసె నృపా! |
121 |
| వ. | అయ్యవసరంబున. | 122 |
| క. |
ఉభయ బలంబులుఁ బురికొని | యిభ తురగ స్యందనంబు లిలఁ బ్రోవులుగా సభయాశ్చర్యాత్మకులై | నభశ్చరులు వొగడ నీసునం బోరాడెన్. |
123 |