పురాణేతిహాసములు శ్రీమహాభారతము ద్రోణపర్వము - తృతీయాశ్వాసము
ధృష్టద్యుమ్న ద్రోణాచార్యుల యుద్ధము (సం. 7-72-22)
వ. అట్టి సంకుల సమరంబున సుస్థిరోత్సాహుండై నిజవ్యూహం బభేద్యంబగునట్లుగా శుంభదవష్టంభంబునం బేర్చి కుంభసంభవుండు ధృష్టద్యుమ్ను మిగిలి పాండవసైన్యంబు దైన్యంబు నొందించుచున్న నప్పాంచాల కులప్రదీపకుండు కోపోద్దీపితుం డయి పారావతవర్ణంబులగు తన రథ్యంబుల నగ్గురు నరుణాశ్వంబులం బెరయ నరదంబు వఱపించి పలకయు వాలునుంగొని సాహసికత్వంబున నతని తేరికడ నొగఁద్రొక్కి యెక్కి కాఁడిపయిం జిత్రగతులు మెఱసి తఱ చై తొరఁగు తదీయ శరంబులు నిజ శరీరంబుఁ జోఁకనీకుండెడు నాలోఁ జేయార్పు రాకుండియుఁ దమకంబునం గృపాణంబు విసరినం దద్రథ తురంగంబుల యంగంబులు వెడవెడ దాఁకు కొలఁది నయ్యాచార్యుండు రయంబున. 124
తే. అలుఁగు చెక్కలుగాఁ జేసి హరుల సూతుఁ | దునిమి సిడమును బలకయు ద్రుంచి వైచి
మేను లక్షించి కులిశంబుఁ బోని దొడ్డ | నారసం బేయ సాత్యకి నడుమ నఱకె.
125
వ. ఇట్లు శినిపుంగవుండు సింగంబు వొదివిన కురంగంబుఁ గాచు చందంబున ధృష్టద్యుమ్ను రక్షించి తొలంగంగొనిపోయె’ ననిన విని యాంబికేయుండు సంజయున కి ట్లనియె. 126
క. ‘పులివాతి కండ గొనుగతి - నలవున బాంచాల తనయు నయ్యెడరునకుం
దొలఁగించిన సాత్యకిపై | నలుక వొడమకుండు నెట్టు లాచార్యునకున్‌?’
127
వ. అనుటయు నమ్మానవపతికి సూతసూనుం డిట్లను ‘నట్లు సేసినం గినిసి గురుండు ఱెక్కలు గల పెనుబాము కైవడి సాత్యకిపైఁ గవియుటయు, నతండు నిజసారథి నాలోకించి ‘యివ్విప్రుండు ధర్మతనయ భయంకరుం డితని మార్కొనవలయు’నని పలికి తేరు సమ్ముఖంబు సేయించె; నిత్తెఱంగున. 128
క. తలపడి చాపరుచులు మెఱుఁ | గుల గములుగ గుణనితాంత ఘోషంబులు గ
ర్జలుగా నారథికోత్తమ | జలదయుగము మెఱసి సాంద్ర శర వర్షములన్‌.
129
వ. అంతకంతకుం గదిసి భల్లంబుల నేట్లాడం దొడంగిన. 130
చ. గొడుగులు గేతనంబులును గూలెఁ దనూద్గత రక్తధార లొ
ల్కెడు గజదానతోయముల లీల వహించె బలద్వయంబు న
ప్పుడు వెఱఁగందె నచ్చెరువుఁ బొందె వియచ్చరకోటి యిట్లు పో
రెడు నెడ ద్రోణువిల్లు వెస రెండుగ సాత్యకి ద్రుంచెఁ ద్రుంచినన్‌.
131
క. గురుఁ డొండొకవిల్లెత్తిన | సరభసముగ నదియుఁ దునిమె సాత్యకి; మఱియుం
ద్వరితముగ నెక్కువెట్టఁగ | శరాసనము లెన్నియేనిఁ జక్కడిచె వడిన్‌.
132
వ. అట్టి యెడ నాచార్యుం డాత్మగతంబున. 133
తే. ‘రామునందును గార్తవీర్యక్షితీశు | నందు నరునందు భీష్మునియందుఁ దక్కఁ
గలుగునే యెందు నీ యస్త్రబలము? వీని | యాశు విక్రమ మద్భుతంబయ్యెఁ జూడ’.
134
వ. అని యగ్గించెఁ; జారణసిద్ధ సాధ్యులు సంకీర్తనంబులు సేసిరి; వెండియు నొండు కోదండంబు గొని యగ్గురుండు దొరంగించిన శరంబులు శైనేయుండు దుత్తుమురు సేసిన. 135
క. ‘ఏ వీరునకైనను నిది | భావారూఢంబు గానిపనియే?’ యనుచున్‌
మీ వారెల్లను బెలుచం | గైవారము సేసి రతనిఁ గౌరవనాథా!
136
వ. అప్పలుకులు సహింపక. 137
శా. ఆగ్నేయాస్త్రము ద్రోణుఁ డేసిన సముద్యజ్జ్వాలికామాలికో
ద్విగ్నం బయ్యె నభంబు, వారుణ శరావిర్భావముం జేసెఁ గ్రో
ధాగ్ని స్ఫూర్తి వెలుంగ నాశినివరుం డబ్బాణముల్‌ ద్రాస ని
ర్మగ్నవ్యోమ చరంబు లై తొడరి పోరంజొచ్చె నొండొంటితోన్‌.
138
క. ఘోరంబు గాఁగ హాహా | కారము లెసఁగంగ బలయుగంబును డయ్యం
బోరి పెడఁబాసి శాంతము | లై రెండును నిలిచె నమ్మహాస్త్రము లధిపా!
139
వ. ఆ సమయంబున ధర్మజ భీమ నకుల సహదేవులు శైనేయునకు బాసటయై తఱిమిన ధృష్టద్యుమ్న ప్రముఖ రథిక వరులుం దలకడచి భారద్వాజుం దాఁకుటయు, దుశ్శాసను మున్నిడికొని మన దిక్కు రాజకుమార వర్గంబు వారలతోఁ దలపడిన నుభయ బలంబులుం బురికొని యోహరిసాహరిం బెనఁగుచుండె; నప్పు డక్కడ. 140
క. నరుఁడు దనతేరు వోయెడు | తెరువున కైనంతసేనఁ దీవ్రాస్త్రములన్‌
ధరఁగూల్పఁగ నయ్యెడ న | య్యరదముఁ గృష్ణుండు నడపు టద్భుత మయ్యెన్‌.
141
వ. ఇ వ్విధంబున రౌద్రరసంబు దళుకొత్త దర్పంబున సైంధవుం డున్న దిక్కునకుం బోవం బోవ. 142
AndhraBharati AMdhra bhArati - AndhramahAbhAratamu - #00# parvamu - kavitraya bhAratamu - kavitrayamu - nannaya - tikkana - eRRana - nannyya tikkanna eRRana - andhramahabharatamu aandhramahaabhaaratamu ( telugu literature andhra literature )