| పురాణేతిహాసములు | శ్రీమహాభారతము | ద్రోణపర్వము - తృతీయాశ్వాసము |
| క. |
విందానువిందు లేక | స్యందనగతు లై కడంగి సైన్యంబులు దా రుం దెప్పదెరల నా సం | క్రందననందనుని మీఁదఁ గవిసిరి గడిమిన్. |
143 |
| వ. | ఇ ట్లవంతీశ్వరు లురవడించి. | 144 |
| చ. |
హరులపయిన్ మురారిపయి నాతని మేనను బాణ వర్షముల్ గురిసి; రతండు వారి నతిఘోరశరంబుల నొంప ధీరతం దెరలక వారుఁ దద్రథముఁ దేల్చిరి తూపుల వెల్లి; నల్గి య య్యిరువుర విండులుం దునిమి యేపున మూఁకల పె ల్లడంచుచున్. |
145 |
| క. |
తోడన కడువేగంబునఁ | గ్రీడి తురంగముల సూతుఁ గేతనమును దు న్మాడుచు విందుని దల యిల | పై డొల్లగ నేసెఁ దీవ్రభల్లప్రహతిన్. |
146 |
| వ. | ఇట్లు దలఁ దునుముటయు బలుగాలిం గూలు తరువు పోలికం బడిన యగ్రజు నాలోకించి యనువిందుం డలుకయు నుమ్మలికంబు నుల్లంబునం బెనంగొన గదఁ గొని సంరంభంబున. | 147 |
| చ. |
అరదము డిగ్గి తీవ్రగమనాతిశయంబునఁ గిట్టి బాహువి స్ఫురణ దలిర్ప దానవనిషూదను ఫాలము వ్రేసి యార్వ ను ద్ధుర రభసం బెలర్ప గదద్రుంచి పదంబులు బాహుశాఖలున్ శిరమును ద్రెంచి వాని బలిసేసె ధనంజయుఁ డాజిభూమికిన్. |
148 |
| ఆ. |
దొరలు వడిన సేన దూలక యవ్వీరుఁ | జుట్టుముట్టుటయును బెట్టు గవియు కాఱుచిచ్చు దఱచుఁ గానల నీఱుగఁ | జేయు పగిదిఁదోఁపఁ జేసె నతఁడు. |
149 |
| వ. | ఇ వ్విధంబున. | 150 |
| సీ. |
అచ్చోటు గదలి వివ్వచ్చుండు సనఁజన | నతని మైవాడును హయ చయంబు డప్పియు నతనికి నప్పుడు సైంధవుఁ | డున్నెడ దూరమై యుండుటయును గని సంతసము నొంది కౌరవయోధులు | సింహనాదంబులు సేసి తఱుమ నా రథికోత్తముం డచ్యుతుఁ జూచి ర | థ్యమ్ముల మేనుల నలుఁగు లుండ |
|
| తే. |
నురవడింపవు వీరల సరకు గొనక | వీని నిప్పుడ యఱ్ఱులు విడిచి తడవు మనుడు నతఁ డిది పోలున యనుడుఁ దేరు | డిగ్గి సారించెఁ గ్రీడి గాండివ గుణంబు. |
151 |
| చ. |
ఎడఁగని యబ్బలంబు గడు నేడ్తెఱఁ గిట్టి మహాస్త్రశస్త్రము ల్గడువడిఁ గుప్పఁగూరఁగఁ జలంబున బైఁదొరఁగింప నేచి క వ్వడి వివిధోజ్జ్వలాస్త్రముల వాని వెసన్ మగిడించి తాఁకు పె ల్లడరఁగఁ జేసె మింటికల యంతయుఁ జిట్టలు గట్టుమంటలన్. |
152 |
| వ. | ఇ త్తెఱంగున. | 153 |
| క. |
లావును వెరవును మెఱయఁగ | నీవీరులు పాండుపుత్రునిం బొదివినచో నావీరుని యక్కజ మగు | లావు వెరవుఁ గరతలామలకమై తోఁచెన్. |
154 |
| వ. | అట్టి యెడఁ జతురంగంబులు. | 155 |
| క. |
నొచ్చినఁ జచ్చినఁ దెరలిన | విచ్చిన నయ్యెడరు సూచి విసువక పైపైఁ జొచ్చినఁ గడుఁ గ్రిక్కిఱిసిన | నచ్చట మన సేనలోన నార్పులు వెడలెన్. |
156 |
| వ. | ఆ ఫల్గునుండు పాదచారియై యునికిం దేఁకువ సెడియును గెలుపున కాస పడియును నిట్లు గ్రమ్మిన కౌరవ సైన్యంబు పొంగిన సముద్రంబు పోలిక యగుటకుం దగిన తరంగంబుల చందంబున నిగుడు శర పరంపరల వలనను, ఘోషంబు చాడ్పునం జెలంగు తూర్య నాదంబుల వలనను వివిధ సత్త్వంబుల విధంబున నుల్లసిల్లు మాతంగ తురంగ సుభట స్యందన సందోహంబుల వలనను జలియింపక చెలియలికట్టయుం బోలె నవి నిలువరించి యవ్విక్రమ కుతూహలి విజృంభించిన. | 157 |
| సీ. |
పటుభల్ల నికరంబు వరఁగినఁ బఱియలై | యఱవఱ లయ్యెడు నరదములును నానార్ధచంద్ర బాణ వ్రాత మడరినఁ | దునియ లై మేదినిఁ దొరఁగు కరులు శాతనారాచ పుంజంబులు నిగిడినఁ | గుదురులై కూలెడు ఘోటకములు వివిధాస్త్ర తతులు పర్వినఁ గండలై వండఁ | దఱిగినట్లుండు పదాతి చయము |
|
| తే. |
నగుచు బీభత్స రౌద్ర మహాద్భుతములు | మూర్తిమంతంబులుగ మన మొనలు రక్త మాంస మేదోస్థి మస్తిష్కమయతఁ జూడ | ఘోర రూపంబులై పరిక్షోభ మొందె. |
158 |
| వ. | ఇవ్విధంబునఁ గురుసేనం గనుపుకొట్టి నవ్వుచున్న కవ్వడిం గనుంగొని కమలనాభుండు. | 159 |
| క. |
పెఱికితి నలుఁగులు మేనులు | నెఱిఁ బడ నెల్లెడలఁ గలయ నివిరితి హరు లి త్తఱి నీళులు ద్రావక తె | ప్పిఱ వెట్లొకొ? శత్రు సైన్య భీకర మూర్తీ! |
160 |
| క. |
వెన్నుమునుఁగఁ దివియఁగలే | కున్నను ద్రావఁదగు నీళు లొదవిన హయముల్ నిన్ను గెలిపించు’ ననవుడుఁ | గన్నుల నగి యర్జునుండు గల వివె యనుచున్. |
161 |