పురాణేతిహాసములు శ్రీమహాభారతము ద్రోణపర్వము - తృతీయాశ్వాసము
కవచధారణంబున దుర్యోధనుం డర్జునుతోఁ దలపడుట (సం. 7-76-37)
వ. కడంగి రంతఁ గురుపతి గూడవచ్చి కుంభసంభవకృతంబగు కవచంబు కతంబున భయంబు దక్కి బలంబునకుం దలకడచి తన రథంబు జయద్రథుం డున్న దిక్కున కడ్డంబుగాఁ జొచ్చిన నతని సూరెల నున్న వీర లోకంబు ముదంబున సింహనాదంబులు సేయ శంఖ భేరీస్వనంబులు సెలంగం దమ తేరికిం గట్టెదురై నిలిచినం గని కృష్ణుండు గ్రీడి కి ట్లనియె. 179
క. ‘ఆపద ముట్టిన యెడ ని | ట్లేపారఁగ వలదె! రథికుఁ డీతఁడు శశ్వ
త్కోపోద్దీప్తుఁడు మాదెసఁ | జాప కళావేది దర్పసంపన్నుండున్‌.
180
క. గోమునఁ బెరిఁగిన వాఁడు మ | హా మానోదగ్రచిత్తుఁ డ ట్లగుటను సం
గ్రామంబున కలుకం డు | ద్దామ భుజావీర్య దుర్మద స్ఫురితుండున్‌.
181
క. మనకును నితనికి సైంధవుఁ | డను నొడ్డున నయ్యె జూద మధికౌద్ధత్యం
బున గెలువుము చిరకాలము | మనమున రారాజు నలుక మ్రందింపు తగన్‌.
182
ఉ. ఈతఁడు మీకు నాపదల కెల్లను మూలము; ధర్మపుత్రు దు
ర్ద్యూతమునం బరాభవము నొందఁగ జేసిన పాపనిశ్చయుం
డా తరుణీలలామమున కమ్మెయి భంగ మొనర్చె వీఁడు నీ
చేతులలా వెఱుంగఁడు విశిష్టశుభం బిది నీకు ఫల్గునా!
183
క. ఎఱిఁగినఁ జేరఁడు; చేరుట | యెఱుకువమై మనకు దైవ మిచ్చిన సిరి యి
ట్లఱిమిన యాలో గ్రక్కున | నఱకు; మితఁడు దెగిన మన మనఃపీడ దెగున్‌.
184
మ. వెరవే! సంపదఁ గోరి గాండివ గుణావిర్భూత బాణాలి కి
ట్లెరయై వచ్చుట యి మ్మహీపతి కితం డేలొక్కొ యత్యంత ని
ష్ఠుర శౌర్యోన్నతి నిన్నుఁ దాఁకఁ దలఁపం జోద్యంబుఁ వీఁ డగ్గ మై
దొరకో లర్జున! నీకుఁ దొంటి సుకృతస్తోమంబు కల్మిం జుమీ!
185
క. ఇతఁడు వడినఁ బ్రజ విచ్చును; | ధృతి సైంధవుఁ డఱిమెనేనిఁ దెగు నాతం డు
ద్ధతి విడిచి పాఱిపోయినఁ | బ్రతిన కదియ చాలుఁ; గడఁగు పటుశౌర్య నిధీ!’
186
వ. అని పెక్కుభంగులం జెప్పిన విని వివ్వచ్చుం డచ్యుతు నాలోకించి. 187
ఉ. ‘ద్రౌపది వడ్డ బన్నము లుదగ్రత మేదినిఁ బెద్దకాల మి
చ్ఛా పరతంత్రుఁడై తన వశంబుగఁ జేసిన వీని గర్వముం
గోపము వెంపదే? మనము గుందఁగఁ జేయదె? యింత సెప్ప నే
లా? పొరిగొందు నీతనిఁ జలంబు బలంబును నీవు మెచ్చఁగన్‌.
188
ఆ. ఒరుల దిక్కు సనక యరదంబు నీతని | యున్న యెడకు నడపు’ మన్న నతఁడు
నట్ల చేయఁ, దనకు నభిముఖులై వచ్చు | వారిఁ జూచి మనుజవల్లభుండు.
189
క. మనమునఁ గొంకక యెదురుగఁ | జనియె నిజోద్ధతికి మెచ్చి జనపాలకు లె
ల్లనుఁ బిచ్చలింప సేనా | నినదం బెసఁగంగ ఘోర నిష్ఠుర వృత్తిన్‌.
190
క. తముఁ బిలుచుచు నివ్విధమున | సమదాటోపగతి నడరు జనపతిఁ గని చి
త్తము లలర నార్చి నిజ శం | ఖము లొత్తిరి శార్‌ఙ్గధరుఁడు గాండివధరుఁడున్‌.
191
చ. ఎలమిఁ జెలంగు కృష్ణుల యహీనసముద్ధతిఁ జూచి శోక వి
హ్వలు లయి మానవేంద్రు దెస నాసలు మాని మృగంబు భ్రాంతి ను
జ్జ్వలదనలంబులో నుఱుకు చందముగాఁ గొని నీదు యోధ వీ
రు లకట! చచ్చెఁజచ్చె నని మ్రోయఁగ నాతఁడు వారి కి ట్లనున్‌.
192
క. ‘భయ మేటికి వినుఁడు ధనం | జయునిం గేశవుని నాదు శరకీలాసం
చయమున నేర్చెదఁ బేర్చెద | నయనానందంబు మీ కొనర్చెదఁ గడిమిన్‌’.
193
వ. అని పలికి పార్థుం గనుంగొని యవష్టంభంబున. 194
AndhraBharati AMdhra bhArati - AndhramahAbhAratamu - #00# parvamu - kavitraya bhAratamu - kavitrayamu - nannaya - tikkana - eRRana - nannyya tikkanna eRRana - andhramahabharatamu aandhramahaabhaaratamu ( telugu literature andhra literature )