పురాణేతిహాసములు శ్రీమహాభారతము ద్రోణపర్వము - తృతీయాశ్వాసము
దుర్యోధనుఁ డర్జునుం దలపడి యధిక్షేపించుట (సం. 7-77-35)
చ. ‘వినుము కిరీటి! దివ్యశరవేదివి! నాఁ జను; దేను లేనిచో
టను మును సెల్లె నీకు; నిచటం జన నిత్తునె? యిప్డు నీ బలం
బును హరినేర్పుఁ జూచుటకుఁ బోరికి వచ్చితి; నీవు పాండురా
జునకు జనించితేనిఁ దెగి చూపుము శౌర్యము నస్త్రవీర్యమున్‌’.
195
వ. అనుచుఁ గ్రూరంబులగు మూఁడు నారాచంబుల నన్నరు నేసి, శర చతుష్టయంబున హయంబులు నొప్పించి, పది బాణంబులు పద్మనాభునురంబునం గ్రుచ్చి, మునిగోల యొక్కకోలం దునిమినం గినిసి క్రీడి యాతనిపైఁ జతుర్దశ నిశిత ప్రదరంబులు వరగించిన, నవి యమ్మహీపతి మైమఱువు దాఁకి మిట్టి పడుటయుం జూచి తొమ్మిది తూపులతోడం బంచాశుగంబులు నిగిడించిన, నవియు నిష్ఫలంబు లగుటయు, నిరువదెనిమిది బాణంబు లడరించె; నవ్వాలమ్ములు నమ్మెయిన వమ్మైన విషాదంబున వాసుదేవుండు వాసవి కి ట్లనియె. 196
క. ‘మున్నెన్నఁడు నివ్విధ మేఁ | గన్నది గా; దమ్ము లెడలె గాండీవములా
వు న్నీ భుజముల శక్తియు | మిన్నక పోఁ జిత్ర మిది యమిత్రధ్వంసీ!
197
ఆ. నీకుఁ జూడ ముష్టి నెలవు నాకర్షణ | గాఢతయును బాణగతియుఁ దొంటి
యట్లొ? యొండుభంగియై తోఁచెనో? నాకు | నున్నరూపు సెప్పవన్న పార్థ!
198
చ. పిడుగుల యట్లు తాఁకి రిపుబృందములం దెగటార్చు నాజి నె
ప్పుడు భవదీయ దివ్యశరపుంజము లొక్కట నిప్డు పొల్లు వో
యెడు నిది; నీవు నిమ్మతివిహీనపు జంతువు నేమి సేట్లకుం
జెడుటకు నొక్కొ విస్మయము సెందెడు డెంద మలంతఁ బొందెడున్‌’
199
వ. అని యిట్లు దన్ను నిందించుకొనుచు గోవిందుం డడిగినఁ బురందర నందనుం డతని కిట్లనియె ‘నిది యొక్క కవచ ధారణంబు; మున్ను ద్రోణుఁ డొక్కరుండ యెఱుంగు; బదంపడి నాకు నెఱింగించె; నిప్పుడు సుయోధనుండును నెఱుంగు తెఱంగు గావించెం గావలయు; నిమ్మెయి మైమఱువు త్రిలోకంబుల కభేద్యం బగుటయు, నీవు నెఱుంగుదు; వెఱింగియు న న్నడుగ నేల? భువనత్రయంబునందును వస్తుప్రకారంబులు నీయెఱుంగనియవియుం గలవే? యది యట్లుండె; నితండు దీని నగ్గురుకరుణం బడసినవాఁడై. 200
క. విను మాఁటది వోలెం దన | తనువున కడ్డంబు గాఁగఁ దగిలిచికొన్నాఁ
డనఘ! యిటు లైన నెట్లగు | నని యెఱుఁగఁడు; దీనివిధము లన్నియుఁ దెలియన్‌.
201
క. నా వింటి బలువుఁ జేతుల | లావును జూడు మిదె నీ తలం కుడుగఁగ నే
నీ విభునిఁ గవచరక్షితుఁ | డై విలసిల్లంగనీ క యలఁచెదఁ గృష్ణా!
202
వ. అంగిరసుం డమరపతికి నొక్క మహాస్త్రం బిచ్చె; దాని నతండు నా కొసంగె నది నిఖిల కవచ నిర్భేదన శీలంబై యుండు; దాన నిమ్మెయిమఱు వఱువుళ్ళు సేసెద.’ 203
క. అని వెస నాదివ్యశరం | బనూన మంత్ర ప్రకాశ మగునట్టులుగా
గొనయమునఁ జేర్చి తిగిచినఁ | గని యశ్వత్థామ బాహుగర్వం బలరన్‌.
204
తే. అధిప! సర్వాస్త్రఘాతి యై యతిశయిల్లు | నస్త్రమునఁ జిత్రముగఁ దెగయంద తునిమె
నమ్మహాస్త్రంబు న ట్లది వమ్ముగాఁగ | నెఱిఁగి వెఱఁగంది హరి కతఁ డిట్టు లనియె.
205
వ. ‘ఆచార్య పుత్రు నస్త్ర ప్రభావంబున నవ్విశిఖంబు వినిహతంబయ్యెఁ బునఃప్రయోగంబు సేసిన నది యొప్పమి సేయు నని వింటి; నా వింటి బలిమిన సాధించెదం జూడు’ మను నవసరంబున నయ్యిరువురను దుర్యోధనుండు. 206
క. తొమ్మిది తొమ్మిది వాలిక | యమ్ముల మున్నేసి పటుశరాసారము పైఁ
గ్రమ్మించిన మనదెసఁ దూ | ర్యమ్ములునుం గీర్తనములు నార్పులుఁ జెలఁగెన్‌.
207
ఆ. అలిగి యవుడు గఱచి యన్నరుఁ డా నృపు | తురగములను సూతుఁ దునిమి వైచి
రథము నఱికి యధిక రయమునఁ దఱచుగ | నాటెఁ గరతలముల నారసములు.
208
వ. ఇట్లు విరథుండును వికల హస్తుండును నై విషణ్ణుం డగు నన్నరనాథుండు వెడం గగుటం గటకటంబడి యాకంకటంబు నిష్ఫలం బను బుద్ధిం బుచ్చి వైచి యొండొక కవచంబు దొడిగె; నయ్యెడరు గనుంగొని శీఘ్రంబునం దత్సైనికోత్తములు చతురంగ బహు బలంబులతోఁ గవిసి, కవ్వడిం జుట్టి ముట్టి యలుఁగుల సోనలు గురిసిన నతండు సంరంభ విజృంభితుం డగుటయు. 209
చ. అఱిముఱిఁ ద్రెళ్ళెఁ దేరులు, గజావళి గూలెఁ, దురంగమాంగము
ల్గిఱికొనియెన్‌ మహిన్‌ భటులు లెక్కకు మిక్కిలి సేన పాడుగా
నఱు మయి రప్డు కృష్ణుఁడు నినాదము భూగగనాంతరంబునం
దఱచుగ నొత్తె నిర్మథిత దానవ సైన్యముఁ బాంచజన్యమున్‌.
210
తే. అట్లు భీషణమగు నర్జునాక్రమంబు | ఘోరమైన మురారి శంఖారవంబు
నధిక భయసంభ్రమంబుల నావహింప | నధిప! నలుగడఁ బఱచె సైన్యంబు గలఁగి.
211
వ. ఇ త్తెఱంగున. 212
క. మును సంకటపడి మూఁకలు | గనుకని విచ్చుటయుఁ బిదప గాండివి మెఱసెం
బొనుఁగుపడి యుండి తగుగా | డ్పున మండు మహానలంబు పోల్కి మహీశా!
213
వ. అయ్యవసరంబున సింధురాజ రక్షకంబైన బలంబు సంక్షోభ సహితంబగు నుత్సాహంబునం బొదలి శంఖభేరీ పణవాది క్వణన మేదుర సింహనాదభరిత రోదసీ కుహరంబయ్యె; నచ్చిడిముడి పడుట యవలోకించి. 214
క. మందస్మిత సుందర వద | నేందు లగుచు హరియు నరుఁడు నేడ్తెఱఁ బ్రియముల్‌
డెందములం బొంద భవ | న్నందనుపై నురవడించినం గని కడఁకన్‌.
215
AndhraBharati AMdhra bhArati - AndhramahAbhAratamu - #00# parvamu - kavitraya bhAratamu - kavitrayamu - nannaya - tikkana - eRRana - nannyya tikkanna eRRana - andhramahabharatamu aandhramahaabhaaratamu ( telugu literature andhra literature )