పురాణేతిహాసములు శ్రీమహాభారతము ద్రోణపర్వము - తృతీయాశ్వాసము
వృషసేనుండు లోనగు నెనమండ్రు రథికు లొక్కపెట్ట యర్జునుపైఁ గవియుట (సం. 7-79-1)
క. వారలఁ బొదువ నడరు బలు | తేరుల మొత్తముల మిగిలి దీప్తపటు రథో
దారు లగుచు నెనమండ్రురు | వీరులు దఱిమిరి నితాంతవేగోజ్జ్వలు లై.
216
వ. వా రెవ్వ రెవ్వ రంటేని. 217
క. దండిమగ లైన వృషసే | నుండు శలుండు సైంధవుఁడునుం గృపుఁడును గ
ర్ణుండును గురునందనుఁడు శ | ల్యుండును భూరిశ్రవుండు నుర్వీనాథా!
218
వ. అందఱు నొక్క మొగంబై. 219
క. తనదైన ప్రతిన నెఱపుట | కును ముఖ్యోపాయ మది యగుట నట్లు సుయో
ధనుఁ బరిమార్పఁ గడఁగు ఫ | ల్గునుఁ దలపడి రాత్మశంఖ ఘోషంబులతోన్‌.
220
క. అట్టియెడ దేవదత్తము | బిట్టొత్తె నరుండు పెక్కు పిడుగుల మ్రోఁతన్‌
బెట్టు వఱచు తన్నినదము | పుట్టించెను దిగులు నీదు పుత్రకు మేనన్‌.
221
తే. చెవులు బీఁటలు వాఱంగఁ జెలఁగు నమ్మ | హారవమ్మున కులుకక యతనిమీఁద
విభుఁడుఁ గర్ణాదులును శరవృష్టి గురిసి | రడరి సైంధవు దిక్కున కడ్డపడుచు.
222
వ. ఆ సమయంబున నశ్వత్థామ యుబ్బి దెబ్బదిమూఁడు మార్గణంబుల మురవైరిని భల్లత్రయంబునఁ బార్థునినైదు శరంబులఁ దురంగమంబులం గేతువు నేసిన నవ్వాసవి యతని నూటయాఱింటను గర్ణునిఁ బదింటను వృషసేనుని మూఁటను నొప్పించి యొక్క కత్తివాతియమ్మున శల్యు చాపంబు ముష్టికిం ద్రుంచిన. 223
సీ. వేగంబ వేఱొక్క విలు గొని మద్రేశుఁ | డతనిపైఁ దొమ్మిది యమ్ము లేయ
ముప్పది రెంటను మూఁట నేనింటను | బదియింట నఱువది బాణములను
గర్ణ భూరిశ్రవః కర్ణనందన కృప | గురుపుత్రు లేసి రన్నరుని మఱియు
నాతనిమీఁద దివ్యాస్త్రంబు లైదు గో | విందు మై సప్తతి విశిఖములును
 
తే. ద్రౌణి నిగిడించె నట్టిసందడి జయద్ర | థుండు వారల మఱువున నుండి పఱపె
సరభసముగఁ ద్రిసప్తతి సాయకంబు | లమ్మహాబాహు దెసఁ గౌరవాధినాథ!
224
వ. ఇట్లు పెక్కం డ్రొక్కపెట్ట పె ల్లేసినం గినుక నూనిన నవ్వు రౌద్రరసంబు నలంకరింప. 225
క. వడి రాధేయుని నాతని | కొడుకునుఁ బండ్రెంట మూఁటఁ గుదియించుచుఁ గ
వ్వడి యొక బలుతూపున నె | క్కుడు రయమునఁ దునిమె శల్యు కోదండంబున్‌.
226
ఆ. తునిమి తోన యతనిఁ దొమ్మిది యమ్ముల | స్రుక్కఁ జేసి మూఁట సోమదత్త
తనయు నెనిమిదింట ద్రౌణిని నిరువదే | నింటఁ గృపుని నొంచి నిలువరించె.
227
వ. మఱియు నిరువది మెఱుంగు వాలమ్ము లశ్వత్థామ యంగంబునం గ్రుచ్చె; నిట్లందఱతోడను గ్రందు కయ్యంబు సేయు సమయంబున నొక్కొక్కమఱి వారి పిఱుంద నోర వాఱం దోఁచు జయద్రథు నేయం దీఱకున్నం దమకంబున నెడనెడ నఱిముఱిం దద్రథంబు దెసకు నతఁడు వాఱ విడిచిన విశిఖంబులు నూఱు గల వప్పుడు భూరిశ్రవుండు వాసుదేవుని చేతిమునికోల నొకకోలం దునిమి కదిసి క్రీడి మేనం ద్రిసప్తతి శరంబులు వరఁగించెం దక్కటివారును నొక్క మొగిం గ్రూరనారాచంబులు గుప్పించి నొప్పించిన. 228
శా. కోపాటోపమహోగ్రమూర్తి యగుచుం గోదండ టంకార లీ
లా పూర్ణంబుగ భూనభోంతర మతం డయ్యోధులన్‌ బాణ జా
లా పాతంబునఁ దూలనేసి చటుల వ్యాపార ఘోరానిలా
క్షేపక్షోభిత వారివాహచయభంగిం జూపె నేపారఁగన్‌.
229
వ. అట్లు విచ్చియుం గూడికొని మూఁకలం గూర్చికొని యొండొరులం బురికొల్పికొని. 230
క. ఆ రథికు లొక్క మొగి న | వ్వీరునిపైఁ గవియుటయును విస్ఫురితశరా
సార మతఁడు నిగిడించిన | వారి బలము లెల్ల రక్తవారిం దేలెన్‌.
231
వ. ఇత్తెఱంగునం దెరలుచుం బొదువుచు భవదీయ సైనికలోకంబు వోక పెనంగె’ ననిన విని ‘యప్పు డేమేమి యడియాలంబులతో నెవ్వ రెవ్వరి సిడంబులు మెఱసి యుండె?’ నని యాంబికేయుం డడిగిన సంజయుం డి ట్లనియె. 232
సీ. ప్రస్ఫురద్వానరపతియును సింహలాం | గూలంబు నుజ్జ్వల గోవృషంబు
వారణ కక్ష్యయు భూరి మయూరంబు | సీతయుఁ గాంచన సింధురంబు
రత్నయూపంబును రజతవరాహంబు | నుద్దీప్యమాన మహోరగంబుఁ
గేతనంబుల నొప్పుఁ గ్రీడికి నాచార్య | సుతునకుఁ గృపునకు సూతజునకు
 
తే. నతని నందనునకును మద్రావనీశ్వ | రునకు శలునకు భూరిశ్రవునకు సైంధ
వునకు రారాజునకు నిట్లు దనరి మెఱయుఁ | బది సిడంబులు నభమునఁ బ్రభలు నిగుడ.
233
క. మన తొమ్మిది సిడముల కం | టెను నుజ్జ్వల మగుచు నొక్కటియ పెక్కై యెం
దును దాన తోచు నయ్య | ర్జును సిడము మహోగ్రతం గురుక్షితినాథా!’
234
తే. అనుడు నమ్మేదినీశుఁ డి ట్లనియె ‘నట్లు | క్రీడి విస్మయావహ రణక్రీడ సలుప
గురుని దర్పంబుచే నాఁక గొనిన ధర్మ | సూను సైన్యంబు లెట్లయ్యె? సూతతనయ!’
235
వ. అనుటయు సంజయుం డతని కి ట్లనియె. 236
క. అయ్యెడ ఖేచరులకు వెఱ | గయ్యెడు చందమున నట్టియవసరమున బ
ల్కయ్యము గురుని బలముతో | నయ్యె యుధిష్ఠిర బలోచ్చయంబున కధిపా!
237
వ. ఆ సంకుల సమరంబున బృహత్‌క్ష త్త్రుని క్షేమధూర్తియు ధృష్టకేతుని వీరధన్వుండును నకులుని వికర్ణుండును సహదేవుని దుర్ముఖుండును సాత్యకిని వ్యాఘ్రదత్తుండును దలపడిరి; శల్యుఁడు సేనాముఖంబునకు వచ్చుచుం బోవుచున్న వాఁడగుట నుచితంబు మెయి నచ్చటి యనికిఁ జొచ్చి ద్రౌపదేయులం దాఁకె; భీమసేనుని యలంబుసుండును ధర్మనందను నాచార్యుండును మార్కొని; రప్పు డయ్యుధిష్ఠిరుండు. 238
AndhraBharati AMdhra bhArati - AndhramahAbhAratamu - #00# parvamu - kavitraya bhAratamu - kavitrayamu - nannaya - tikkana - eRRana - nannyya tikkanna eRRana - andhramahabharatamu aandhramahaabhaaratamu ( telugu literature andhra literature )