పురాణేతిహాసములు శ్రీమహాభారతము ద్రోణపర్వము - తృతీయాశ్వాసము
అలంబుసుండు ఘటోత్కచునితో యుద్ధము సేసి చచ్చుట (సం. 7-84-1)
తే. భూరి చక్రంబు వెస నలంబుసుఁడు వైవఁ | బెలుచ గద వైచి పొడి సేసె భీమసుతుఁడు
కడుఁదురులు గవిసి కఱచు కరణి యయ్యె | మూఁక నత్తునియలు వెసఁ దాఁకు నపుడు.
263
క. ఆ చక్రం బ ట్లయిన ని | శాచరపతి వివిధ శక్తిజాలము వఱపం
జూచి ఘటోత్కచుఁ డది వ | మ్మై చెడ నర్ధేందుశరచయం బడరించెన్‌.
264
వ. ఇట్లు దొడంగి యయ్యిరువురు దానవేశ్వరులును. 265
మ. బహుహేతి ప్రకరంబులన్‌ బహువిధోపాయంబులన్‌ విస్ఫుర
ద్బహు మాయాకృత రూపజాలముల శుంభద్వీర సంరూఢిమై
మహి యల్లాడఁగఁ బోరఁ బాండుతనయుల్‌ మాత్సర్యధుర్యాత్ము లై
సహితోద్యోగత నయ్యలంబుసు శరచ్ఛన్నాంగునిం జేసినన్‌.
266
సీ. అతఁడు మాయాబలోద్ధతి నా శరావలి | మొఱఁగి దావానల ముక్త మైన
కరి విధంబున మ్రోఁగి యిరువదేనమ్ముల | ననిలజు, ధర్మనందను మూఁట,
సహదేవు ద్రౌపదీ సంభవులను హిడిం | బాసుతు నైదైదు బాణములను,
నకులు డెబ్బది మూఁటఁ, బ్రకట విక్రమ మొప్ప | నేసి యార్చిన, నల్గి యింతవట్టు
 
తే. రథికవరులును గిట్టి మార్గణ చయంబు | లొక్కమొగిఁ దొరఁగింప వాఁ డుఱక యేటు
లాడఁ గదిసి ఘటోత్కచుఁ డతని సూతుఁ | ద్రుంచి యరదంబు రూ పడఁగించె నధిప!
267
వ. ఇట్లు విరథుం డయి యలంబుసుం డిలకు లంఘించి మాయ గైకొని సాయకాసారంబు ఘోరంబుగాఁ గురిసిన నమ్మారుతి సుతుండును దేరు డిగ్గి యగ్గలం బగు మాయాకృతమార్గణ జాలంబున నది దూలించి గదవైచిన, నక్కిమ్మీరానుజుండు పీడితుండై ఖడ్గంబు గొని గగనతలంబున కెగయుటయు, హిడింబ కొడుకును గృపాణపాణి యై తోడన యెగసె; నయ్యిరువురును సుడిగాడ్పునం దొడరి తిరుగుడు మొగిళ్ళ చాడ్పున నొప్పి యెరకుఁ బెనంగు డేగల చందంబునఁ జిత్రగతులం బోరి పోరి భూతలగతులై యుబ్బునం దలపడిన బెబ్బులుల కరణి నొండొరుల మేనులు నెత్తుట జొత్తిల్లం జేసి పాసి యొకళ్ళొకళ్ళ కంఠంబులు లక్ష్య ంబుగాఁ గరవాలంబులు వైవ, నవి యొండొకటం దాఁకి మండుచు మహిం బడిన, మల్లయుద్ధ సన్నద్ధు లై కిట్టుచుంబట్టుచు, బాయుచు వ్రేయుచు నొడుచుచుం బొడుచుచు మఱియు ననేక ప్రకారంబుల వీరత్వంబును విశారదత్వంబును సేనలకు వెఱఁగు పుట్టింపం బోరాడి; రట్టియెడ బకావరజుండు డస్సినం బవమాన పౌత్రుండు పడవైచి, తాను మీఁదై జానుకూర్పర ముష్టి ఘాతంబులు నిర్ఘాత పాతంబులుం బోలెఁ బ్రయోగించి నొప్పించి యతని తొడలు నెమ్ములు నొక్కుమ్మడిం బొడి పొడి సేసి నుఱిపిడికిం జొచ్చిన ప్రబల హాలికుని లీల నేలం బెట్టి కాలం జమరి చంపి పొంపిరివోవు మగంటిమిం బేర్చి యార్చినం బాండవ బలంబుల సింహనాదంబులుఁ దూర్యనినదంబులున్‌ జెలంగె నప్పు డా ఘటోత్కచుండు ధర్మనందనున కభివందనంబు సేసిన, నతండు సంతుష్టాంతరంగుండై యాలింగనంబును మూర్ధాఘ్రాణంబును జేసి యగ్గించె’ ననిన విని యాంబికేయుండుసంజయున కిట్లనియె. 268
ఉ. ‘అంతకు మున్‌ ఘటోత్కచున కడ్డము సాత్యకి సొచ్చె నంటి వాఁ
డంతకసన్నిభుండు గురుఁ డద్భుత విక్రముఁ డద్దెసన్‌ సము
ద్దాంతతఁ బేర్చి వార లటు దార్కొని మిన్నక పోవ నేర్తురే?
కొంతయినన్‌ రణంబు గలుగుం; గలభంగి యెఱుంగఁ జెప్పుమా!’
269
వ. అనవుడు నా సూతనందనుం డతని కిట్లను ‘సాత్యకి దఱిమి మన మొన నుఱుము సేయం దొడంగిన ద్రోణుండు మార్కొని యిరువదేను కుప్పెకోలల నతని చేత నేటులు వడి మూఁడు నారసంబుల నతని నొప్పించె; నయ్యాదవ వీరుండు పంచాశద్బాణంబుల నొంచిన ధనుర్గురుండు దొమ్మిది యమ్ము లెమ్ములం గీలించి. 270
క. మఱియును శరశతకము మెయిఁ | గిఱికొలిపిన వృష్ణి వరుఁడు గినియఁగ లే కే
పఱి యున్నఁ జూచి యార్చుచు | మెఱసిరి నీ తనయు లుబ్బు మిగిలి నరేంద్రా!
271
వ. అప్పుడు వినియును గనియును ధర్మతనయుండు ధృష్టద్యుమ్నాది యోధవరుల నాలోకించి. 272
ఆ. ‘పులుఁగు ద్రాటఁ గట్టి యలయించి యాడెడు | బాలునట్ల పోలె బాణగురుఁడు
గడఁగి కృష్ణుననుజుఁ గారించుచున్న వాఁ | డతనిఁ బొదువుఁ; డితని కడ్డపడుఁడు.
273
వ. భీమసేన పురస్సరులై కవియుం’ డనుచుం దానును దఱుముటయు, నా సైనికోత్తములు సాత్యకిం గడచి యాచార్యుం గదిసిన. 274
క. విందులఁ గనిన ట్లాతఁడు | మందస్మితుఁడై యెదిర్చి మార్గణజాల
స్పందితులఁ జేసె వారల | నందఱ; కవ్విధము రోమహర్షణ మయ్యెన్‌.
275
వ. అట్టి యెడ. 276
క. ఇరువది యేవురు పాంచా | లురు, నూర్వురు కేకయులును లూనాంగకు లై
ధరఁ దొరఁగిరి పెఱమొత్తము | కరినికరము రొంపిఁ బడిన గతి నుండె నృపా!
277
వ. ఇట్లు ద్రోణుండు బరవసంబు సేసినం బాండవయోధులు పైఁ బెట్టంజాలక సొలసియున్న సమయంబునం బాంచజన్య ధ్వని విని యుధిష్ఠిరుం డక్కడ నాలించి గాండీవ ఘోషణంబు గర్ణగోచరంబు గామికి మనంబు గలంగ నెలుంగు గుత్తుకం దగుల సాత్యకితో ని ట్లనియె. 278
AndhraBharati AMdhra bhArati - AndhramahAbhAratamu - #00# parvamu - kavitraya bhAratamu - kavitrayamu - nannaya - tikkana - eRRana - nannyya tikkanna eRRana - andhramahabharatamu aandhramahaabhaaratamu ( telugu literature andhra literature )