పురాణేతిహాసములు శ్రీమహాభారతము ద్రోణపర్వము - తృతీయాశ్వాసము
ధర్మరాజు సాత్యకి నర్జునునకుఁ దోడ్పడఁ బొమ్మని ప్రార్థించుట (సం.7-85-41)
ఉ. ‘ఒక్కఁడ చన్నవాఁడు విజయుండు మహీరజ మెక్కు డయ్యె న
ద్దిక్కునఁ బాంచజన్యమ యుదీర్ణత మ్రోయఁ దొడంగె నక్కటా!
చిక్కెనొ కౌరవాధములచే నతఁ డయ్యెడ నీవ యొక్కఁడుం
దక్క నొరుండు దీర్పఁగ నుదగ్రుఁడు బంధుఁడు లేమి వేఁడెదన్‌.
279
క. త్వరితముగఁ జనుము సఖుఁడు | న్గురుఁడుఁ గదా! నీకు నర్జునుం; డుపకృతి త
త్పరులై నెగడెడు నుత్తమ | పురుషులు వేచు తఱి వచ్చె భుజవీర్యనిధీ!
280
చ. దురమున బంధుమిత్రులకుఁ దోడ్పడు తెంపును ధాత్రి యెల్ల భూ
సురులకు నర్థి నిచ్చుటయు సూరిజనుల్‌ సుకృతంబు లెన్నుచో
సరియుఁగఁ జేసి చెప్పుదురు శాశ్వతకీర్తియు నిన్ను నొందు నా
హరి నను నా సుహృజ్జనుల నందఱఁ గాంచుటఁ గ్రీడిఁ గావవే!
281
క. గురుపుత్ర కర్ణ మద్రే | శ్వర కృప భూరిశ్రవసులు శత్రుజన భయం
కరులు జయద్రథునకు నై | నరుఁ బొదివిన నతఁడు నొచ్చె నాకుం జూడన్‌.
282
క. ఆ మోము నా భుజంబులు | నా మేనుం గలదె? కేశవానుజ! యెచ్చో
నే మగలకు నమ్మూర్తికి | నేమి దలంచు నొకొ! దైవ మెయ్యది దుదియో!
283
ఉ. ద్వైతవనంబునందు గుణధన్యుఁడు గాండివి నాకుజెప్పె ‘ని
ర్ధూత విరోధి సత్యకసుతుండు సహాయుఁడుగా జయింతుఁ బ్ర
ఖ్యాతిగ ధార్తరాష్ట్రబలమంతయు నే’ నని దానికిం దగం
బ్రీతి యొనర్పవే నరవరేణ్య! రయంబునఁ బోయి వానికిన్‌.
284
క. హరి యొకఁడు నీ వొకండవు | పరమాప్తులు కలిమి నరుఁడు భారపుఁ బనికిం
జొర నలుకఁడు నీ కూరిమి | పొరపొచ్చెము గాక యుండఁ బోవఁగవలదే !
285
ఆ. పరమకరుణ నైన బంధుభావంబున | నైన భుజబలంబు నతిశయమున
నైన నెల్లభంగి నర్జును రక్షింపఁ | బోవఁ దగు మహానుభావ! నీకు.
286
క. అతఁ డొకటి యైన నే నే | గతిఁ బోదుం జెపుమ! యెల్లకార్యంబులలో
నతనికిఁ దోడ్పడఁ బోవుట | యతి ముఖ్యము దానిఁ జేయు మనఘ విచారా!
287
క. అలఘుబలుఁడు శైనేయుఁడు | గలుగఁగఁ బాండవుల గెలువఁగా వచ్చునె? వా
రల కతఁడు గోట యంద్రు; రి | పులు దానికిఁ దగఁగ నెఱపు భుజగర్వంబున్‌.
288
క. హరి గురుఁడు నీకుఁ గ్రీడియు | గురుఁ డిరువుర యెడరు దీర్పఁ గోరి గురులకున్‌
గురుఁడ నగు నేనె చేసెదఁ | బరమ ప్రార్థనము; దీనిఁ బాటింపు తగన్‌.
289
క. కురుబలము సొచ్చి, నీదగు | శరముల దర్పంబు సూపి, చయ్యనఁ జని య
న్నరుఁ గైకొని నా యుల్లము | పరితాపముఁ దీర్పవే! నృపాలురు మెచ్చన్‌.
290
వ. అనిన విని సాత్యకి ధర్మనందనున కిట్లను ‘నీ వచనంబు లుచితంబు; లేను నప్పార్థునకును రణంబునం బ్రాణంబులు దాఁప; విశేషించి నీ వింత ప్రార్థించి పనుప నూరకుండుదునే? యతండు సైంధవ వధార్థంబుగా నట సనుచుండి కృష్ణుఁడు వినుచుండ నాతోఁ జెప్పిన తెఱంగు విన్నవించెద నవధరింపుము. 291
క. ‘మనకు నిమిత్తము లెంతయు | ననుకూలము లయ్యె; గెలుతు మాహవమున నేఁ
జనియెదఁ బ్రతిజ్ఞఁ దీర్పఁగ; | ననఘా! ధర్మసుతు రక్ష కరుగుము నీవున్‌.
292
క. విను! సింధురాజు వధ మును | మనుజాధిప రక్షణంబు మనకు సరియ కా
వున నే నొక పని నీ వొక | పని మేకొని చేయు టరయఁ బాడియ గాదే?
293
ఆ. ఏను నిలిచినట్ల కా నూఱడిల్లు నీ | వున్న నన్నరేశ్వరోత్తముండు;
నిర్భరుండ వగుము నీవు నా దెస; నాకు | హరి గలండు; గలఁడె యచట నితఁడు.
294
వ. ఎల్లభంగుల రాజ రక్షణార్థంబుగా నీకుం బోవవలయుఁ బరాక్రమ ధుర్యుండగు నాచార్యు ప్రతిన యెఱుంగవె?’ యని చెప్పిన నట్ల కాక యని ని న్నతనిచే నిక్షేపంబుగా గైకొని యేను నీకడకుం జనుదెంచితి; గురుండు ప్రతిన నెఱపునేని విజయుండు జయద్రథుం జంపుట యప్రయోజనంబు కాదే? యది యట్లుండ నిమ్ము; నీ చిత్తమ్మున వలవని వెఱపు గట్టుకొని యెదవు; కృష్ణసారథికం బగు జిష్ణురథం బప్రతిహత మనోరథం బగుట యెఱుంగవలవదే?’ యనుటయు నమ్మహీపతి యతని కి ట్లనియె. 295
క. ‘అది యగు నైనను ననుఁ బెం | పొదవఁగఁ గాచికొని యిచట నుండుట కంటెన్‌
మది నధికం బై తోఁచిన | యది నీ వర్జునుని పాలి కరుగుట నాకున్‌.
296
తే. కడువడి నీ వరుగఁగ వడ | ముడియును నీ వెనుక శీఘ్రముగ నెయిదుం గ
వ్వడి కుశలి యైన విజయం | బొడఁగూడును మనకు; దీని కొడఁబడు మనఘా!
297
చ. ద్రుపద విరాట కేకయులు దోర్బలధుర్యులు, ద్రౌపదేయు లు
గ్రపు బిరుదుల్‌, ఘటోత్కచుఁ డరాతి విదారిఁ శిఖండి ధైర్యసా
ర పరుషమూర్తి, సంగర ధురంధరు లిద్దెసఁ దక్కుఁ గల్గు వా
రపరిమితుల్‌; గొనండు ద్రుపదాత్మజుఁ డగ్గురుఁ బోరఁ జీరికిన్‌.
298
క. విను మా ధృష్టద్యుమ్నుం | డనలంబునఁ గుంభభవ వధార్థముగాఁ బు
ట్టినవాఁడు గాఁడె? నా దెస | ననుమానం బేల? యోర్చు నాతం డతనిన్‌.’
299
వ. అనవుడు శినిపుంగవుం డొక్కింత చింతించి, పార్థుపజ్జం బోవుట బంటుతనంబున కూనంబుగా; దితండునుం బెద్దయుం దఱిమి పలికెడుఁ; బోదున కాక! యని మనంబున నిశ్చయించి, యధిపతి యాననం బాలోకించి. 300
AndhraBharati AMdhra bhArati - AndhramahAbhAratamu - #00# parvamu - kavitraya bhAratamu - kavitrayamu - nannaya - tikkana - eRRana - nannyya tikkanna eRRana - andhramahabharatamu aandhramahaabhaaratamu ( telugu literature andhra literature )