పురాణేతిహాసములు శ్రీమహాభారతము ద్రోణపర్వము - తృతీయాశ్వాసము
సాత్యకి ధర్మరాజు వేఁడిన చొప్పున నర్జును కడకుఁ బోవ సమ్మతించుట (సం. 7-86-1)
క. భవదీయ రక్ష యిమ్మెయి | సువిహిత మగునేని మేలు; సొచ్చెద భేరీ
రవ బృంహిత హేషాభై | రవ కౌరవ సేన గలఁగి క్రందుకొనంగన్‌.
301
శా. వైరం బాత్మల నిండి యుండ భుజగర్వంబుల్‌ దలిర్పంగ దు
ర్వారోత్సాహులు వీరె కొందఱు నృపుల్‌ రారాజు కార్యంబు వి
స్తారోదగ్రము సేయఁ బూని విలసత్సంరంభు లై పన్నియు
న్నా రీదట్టపుమూఁక లెట్టు లగునో నాకోల్తలం జూడుమీ!
302
క. ఈ సేనల భేదించి భు | జా సంపద వెలయఁ బార్థసాహాయ్యం బేఁ
జేసెద నీపం పనియెడు | భాసుర దీపమున కన్యబలతమ మెదురే?
303
క. దవ్వని చూడకు; మార్తుర | క్రొ వ్వడఁచెద; సింధువిభునిఁ గూల్పఁగడఁగు నా
వివ్వచ్చు మెచ్చు తెఱఁగున | నవ్వుచుఁ గవిసెద మరుద్గణంబులు వొగడన్‌.
304
వ. రథ్యంబుల దగ యుడుపను సారథి దప్పియుం దీర్పను రథంబు సవిశేష సన్నాహంబు సేయను వలయు’ ననినం బ్రీతి నొంది యప్పాండవాగ్రజుండు పనుపం దద్‌ఙ్ఞులైన పరిచారకు లత్తురంగంబుల నీరికిం దిగిచి ఖాణం బెత్తి తడవి దారుకానుజుం డగు నా సూతు నుపయుక్తాహారుం జేయుటయు, వాఁడును విశిష్టాయుధ సమేతంబుగా నయ్యరదంబు సుకల్పితంబు సేసి సింహధ్వజంబు గ్రాలం దెచ్చె; నంతకు మున్ను సాత్యకియుఁ గృతస్నానుండై యాప్యాయన మధుపానంబున నెలమిం బొంది యమ్మహీపతి పాదంబులకుం బ్రణతుం డైనం గౌఁగిలించుకొని యతండు దీవించినం బెండ్లికి పోవులీలం దేరెక్కి యెక్కిడిన విల్లును మెచ్చువచ్చునమ్ములును దొడలపైఁ బెట్టికొని కదలి చను సమయంబున భీమసేనుండును నగ్రజునకుం బ్రణామంబు సేసి తన తోడన రాఁ గదలినం గని యా శినిపుంగవుం డతని కి ట్లనియె. 305
క. ‘అక్కట! రావలవదు నా | కెక్కటి యీ సేన దఱిసి యేఁగుట భరమే?
యిక్కడన నిలువు; ద్రోణుని | యుక్కునఁ బతి కెడరు వుట్టకుండఁగ వలయున్‌.’
306
వ. అనవుడు నతం ‘డట్ల కాక యేను రాజ రక్షణంబునకు నిలిచెద; నీ వప్రమత్తుండవయి యరుగు’ మనిన వదనంబు వికసింప’ నీ యట్టి పెనుబ్రాపు గలుగ నా కెదు రెవ్వరు? సవ్యసాచి సైంధవుం దెగటార్చినం బేర్చిన కౌతుకంబున వచ్చి నిన్నును నీయన్ననుం గౌఁగిలించుకొనియెద’ నని పలికి యవ్వీరుని నిలిపి లేళ్ళ గమిం గనుంగొను బెబ్బులియుంబోలె నీ సేనం జూచుచు నడచె నని యిట్లు సంజయుండు సాత్యకి సంరంభంబు ధృతరా ష్టునకుం జెప్పె నని చెప్పిన వేడ్క యుల్లంబున నివ్వటిల్లఁ ‘బదంపడి చెల్లిన భండనంబు వినిపింపు’ మనుటయు. 307
AndhraBharati AMdhra bhArati - AndhramahAbhAratamu - #00# parvamu - kavitraya bhAratamu - kavitrayamu - nannaya - tikkana - eRRana - nannyya tikkanna eRRana - andhramahabharatamu aandhramahaabhaaratamu ( telugu literature andhra literature )