| పురాణేతిహాసములు | శ్రీమహాభారతము | ద్రోణపర్వము - చతుర్థాశ్వాసము |
| క. |
ధనువు దునిమి నవ్విన, నీ | తనయుఁడు పటు శక్తి వైచెఁ దలఁకక యది ప ల్తునియలుగఁ జేసె సాత్యకి; | విను మాతం డతని నొండు విలు గొని నొంచెన్. |
108 |
| ఆ. |
అలిగి కృష్ణుతమ్ముఁ డతని చాపంబును | సూతుఁ దురగములను గేతనంబుఁ దునిమి సొగయ నేసియును భీమసేను ప్ర | తిజ్ఞ దలఁచి చంపఁ దెగక చనియె. |
109 |
| వ. | అట ధర్మజ భీమ నకుల సహదేవులు సాత్యకి సేనఁ దఱియం జొచ్చుట యెఱింగి సైన్యంబులం బురికొల్పికొని ధృష్టద్యుమ్నాది యోధుల ము న్నిడికొని తఱిమిన మనవారును మార్కొని పెనంగి రా శైనేయుండును నీ సేన బడలువడం జేయుచు మున్నీటం బెనుఁ జోఱ దఱిసి పోవు తెఱంగునం బోవుచుండె; నంత నక్కడఁ గవ్వడియును యుగాంత కాలరుద్రుని కైవడి రౌద్రరసమయమూర్తియై తన మునుము మొనల బారి సమరుచుండె; మోహరంబు మొగంబున గురుండును గౌంతేయ బలంబులం బొరిగొనుచుండె; నివ్విధంబున నమ్మువ్వురచేతను బ్రజాక్షయం బగుచుండం గురుపతి భరద్వాజు నాజి యరసిపోవవచ్చి యచ్చటం బాండవ సైనికుల సంరంభంబుఁ జూచి యేచి యొక్కరుండును దలకడచి యమ్మొన వనజ వనంబు సొచ్చు వారణంబును బోలెఁ దఱియం జొచ్చి భీమసేనుం బదిబాణంబులను, నకుల సహదేవ ద్రుపద విరాట ద్రౌపదేయుల సాయక త్రయంబులను, గేకయు లేవురను శరద్వయంబులను ధృష్టద్యుమ్నుని నిరువదింటను శిఖండిని మూఁటను ధర్మనందనుని నైదు దూపులను నేసి మఱియు ననేక తురగ ద్విరద రథనికరంబులం బటు ప్రదర శతంబుల నొప్పించె; నప్పుడు. | 110 |
| తే. |
అతని చాపంబుఁ గుంతీసుతాగ్రజుండు | నఱకఁ బెఱవారు వొదివిన నుఱక వారి నెల్ల గుంభజుఁ డమ్ములవెల్లిఁ దేల్చి | యురవడించి యా సైన్యంబు ను బ్బడంచె. |
111 |
| వ. | కౌరవపతియు మగిడి యా సైంధవు కడకుం జనియె; దదనంతరంబ కేకయ మహీనాథుండు మార్కొని. | 112 |
| క. |
గురుఁ డెన్ని శరము లేసిన | వెరవున నన్నింటి నన్నివిశిఖంబులఁ దా మరలిచి బ్రహ్మాస్త్ర పరి | స్ఫురణము సూపిన దదస్త్రమునన యడంచెన్. |
113 |
| క. |
మఱియు నతని మెయి బాణము | లఱువది గిఱిగొలుప నా బృహత్ క్షత్రుం డే డ్తెఱ సూతు నొంప నాతం | డఱిముఱి నారాచతతుల నవ్విభుఁ బొదివెన్. |
114 |
| తే. |
చిక్కువడఁ జేసి చనుమఱ యొక్క దొడ్డ | నారసమ్మున బిట్టేయ నరవరుండు ద్రెళ్ళె; శిశుపాల తనయుండు ధృష్టకేతుఁ | డమ్మహావీరుపై వీఁక నడరి యపుడు. |
115 |
| క. |
పెనుమంట నుఱుకు శలభం | బును బోలెం గవిసి, కోలుపులిఁ గోలన్ వ్రే సిన మాడ్కి నేసె నఱువది | సునిశిత బాణముల నశ్వసూత యుతముగన్. |
116 |
| తే. |
బాణఘట్టనఁ గటకటఁ బడి గురుండు | విల్లు ద్రుంచిన నొండొకవింట నొంచె; నాతఁ డక్కుంభసంభవుఁ డతని విరథుఁ | జేసి యా విలు దునిమినఁ జేవ సెడక. |
117 |
| క. |
గద వైచిన నది ద్రోణుని | ప్రదరంబుల నడఁగఁ దోమరము శక్తియు బె ట్టిదముగ నతఁ డడరించిన | మదమున నయ్యోధవరుఁడు మడియించె నెడన్. |
118 |
| వ. | ఇట్లు విగత సాధనుం జేసి. | 119 |
| క. |
. ఆలోనన మెఱుఁగారెడు | వాలిక నారసము చేదివరు హృదయమునం గీలించినఁ బొడ వెగయుచు | నేలం బడి తన్నికొని చనియె జము కడకున్. |
120 |
| క. |
కని యాతని కొడు కడలుం | గనలుం బిరికొనఁగఁ దన్నుఁ గవిసినఁ బొదివెన్ ధనురాచార్యుఁడు శీఘ్రం | బున బెబ్బులికొదమ లేడిఁ బొదివిన మాడ్కిన్. |
121 |
| తే. |
పొదివి యవలీల నాతని బొలియఁ జేయ | సమదగతి మాఱుకొని జరాసంధ తనయుఁ డస్త్రగురు నొంచుటయు నతం డల్గి యతని | గూల్చెఁ దత్సైనికులు గనుంగొనుచు నుండ. |
122 |
| వ. | అట్టియెడ వడముడి ధృష్టద్యుమ్నుండు విన నవ్విప్రవరుం డప్రతిహత దపస్సిద్ధుండు గా కేమి చూపులన దహించు నట్ల తూపులవేఁడిమిం బగఱ రూపడంచుచున్నవాఁ డనిన నా ద్రుపదనందనుం డతని మార్కొనం గడంగునెడ నాతనిం దలకడచి. | 123 |
| ఆ. |
క్షత్రవర్మ గురుని చాపంబు ద్రుంచిన | వేఱ యొక్క దొడ్డ విల్లు రయము మెఱయఁ గొని యతండు మెఱుఁగులు గిఱికొను | నారసమున వాని నామ మడఁచె. |
124 |
| ఉ. |
అప్పుడు చేకితానుఁడు శతాశుగముల్ గురుమేనఁ గ్రుచ్చి తే రొప్పఱ సూతు నొంచి తురగోద్ధతి మాన్ప నతండు గన్నులన్ నిప్పులు రాలఁ దద్భుజము నిష్ఠుర బాణహతంబు సేసి వే కప్పె శరాళి సూతుఁడు దెగన్ హరు లోటఱి గ్రేళ్ళు వాఱఁగన్. |
125 |
| వ. | ఇట్లు చేకితానుం డోటమి కోర్చి యమ్మెయిన తొలంగె; నిత్తెఱంగున. | 126 |
| క. |
పెక్కండ్రు దొరలు దన పే | రుక్కున రూపఱఁగ ద్రోణుఁ డుద్ధతిఁ దోడ్తో నెక్కఁగ నితఁడు కుమారుం | డొక్కొ! యనఁగ ముదుకఁడయ్యు నుగ్రత మెఱసెన్. |
127 |
| వ. | ఆ సమయంబునం బాంచాలపతి ‘యీ బ్రాహ్మణుండు వృషభంభులుం బోని భూపాలుర నెల్లరను సృగాలంబుల కాహారంబు సేయుచున్నవాఁడు; వారింపవలదే’ యని కడంగి మొనలం బురికొలిపికొనుచు నక్కజం బగు కయ్యంబు సేయుచుండం బాండవాగ్రజుం డాత్మగతంబున. | 128 |