పురాణేతిహాసములు శ్రీమహాభారతము ద్రోణపర్వము - చతుర్థాశ్వాసము
ధర్మరాజు భీముని నర్జునునకుఁ దోడ్పడఁ బుచ్చుట (సం.7-102-4)
ఉ. అర్జునుఁ డొంటి వోయె నని యక్కడఁ బుచ్చితి బాహుసారవి
స్ఫూర్జితు సాత్యకిం బెలుచఁ బోవుటయుం గనుఁగొంటి నిద్దఱున్‌
దుర్జయ శత్రుసైన్యముల దొండడి నేమయి రొక్కొ! విక్రమా
వర్జిత వైరిభీముఁడును వారికిఁ దోడుగ నేఁగు టెట్లొకో?
129
క. తమ్మునిఁ దలంచి కృష్ణుని | తమ్ముఁ బనిచె; నాతనిం బదంపడి తన చి
త్తమ్మునఁ దలఁపఁడ ధర్మజుఁ | డెమ్మెయి వాఁ డొక్కొ నారె? యీ యున్నజనుల్‌.
130
తే. పెక్కుచోటుల నెఱిఁగిన యుక్కులావుఁ | గలుగు నీతనిఁ బనుచుట కలుక నేల?
యితఁడు గలయ నయ్యిరువుర కెలమి వచ్చుఁ | బనుతు నే నటు శోకంబు వాయవలయు.
131
వ. అని బహువిధంబుల విచారించి నిశ్చయించి. 132
ఆ. భీముఁ జేర నరిగి ‘బీభత్సు నీ తమ్ము’ | నని యెలుంగు గళమునందుఁ దగుల
నశ్రు లొలుక మాట యట సెప్పలేఁ డతఁ | డార్తి సూచి యిట్టు లనియె నతఁడు.
133
క. ‘ఏము గలంగిన యప్పుడు | నీ మహిమయ మమ్ముఁ దేర్చు నీకును గలఁగన్‌
భూమీశ! తగునె యివ్విధ | మేమిటఁ బాటిల్లెఁ, బనుపు మేపని కైనన్‌’.
134
చ. అనవుడు నాతఁ డిట్లనియె ‘ నక్కడ నప్పుడు బాంచజన్య ని
స్వనము వినంగ నైన నట సాత్యకిఁ బుచ్చితి; నేమి పుట్టెనో!
యను వెత నిప్పు డద్దెస భయంబు దిగంబడ నీవు వోయి పా
ర్థునిఁ గని సింహనాదమున రోదసి నింపుము మాకు నింపుగన్‌.
135
క. నీతమ్ముఁగుఱ్ఱ రూపసి, | నీతి విదుఁడు, సకల సుగుణ నిధి, మద్భక్తుం
డాతని కెడరగునో యను | చేతోగతి పల్లటిల్లఁ జేయదె తాల్మిన్‌?
136
ఆ. అనిన భీముఁ డిట్టు లనియెఁ ‘దద్రథము ర | థ్యముల సారథిని శరాసనంబు
నెఱుఁగు దతని కొలఁది యెఱిఁగిన యదియ నీ | కేల వగవ? నిపుడ యేను బోదు.
137
వ. దేవరయాజ్ఞఁ దల నిడికొని చని యా కృష్ణుల కృష్ణానుజునిం గలసి యిక్కడ కెఱుక సేయుదు’ నని పలికి పాంచాల నందనుం గనుంగొని ‘కుంభసంభవు బలిమియు నతని ప్రతిజ్ఞ తెఱంగును నెఱుంగుదు; వేమఱకుండుము; నాకుం బోక కర్జంబు గాదు; గాకున్న నేలినవాని యానతి నడపవలయు’ ననవుడు నతండు. 138
క. ‘వినుము భవత్సేనాపతి | తనువునఁ బ్రాణములు గలుగ ధర్మజు దెసకుం
జనుదెంచువాఁడె ద్రోణుం? | డనుమానము దక్కి యరుగు మర్జును కడకున్‌.’
139
వ. అనిన ధృష్టద్యుమ్ను పలుకుల కూఱడిల్లి యనిలతనయుం డన్నచరణంబులకుం బ్రణతుండై యాలింగనంబును నాశీర్వాదంబునుం బడసి యున్న యప్పుడు శౌరి శంఖ విరావంబు వీతెంచిన న వ్విభుం డవ్వీరున కి ట్లనియె. 140
క. ‘విను పాంచజన్య పటు ని | స్వన మదె యిది మఱఁది యెడరు సైరింపక కృ
ష్ణుని రణము సేయు రభసం | బని తలఁచెద నెయ్దు మెయ్దు మధిక రయమునన్‌.’
141
వ. అనవుడు సవిశేష కల్పితంబగు రథంబు రవంబును దూర్య నినదంబును దనసింహనాదంబునుం జెలంగ విశోకుని సారథ్య సామర్థ్యంబున రథ్యంబులు నెఱయ మెఱయం గదలి గొనయంబు సారించి కురుబలంబు నవలోకించుచు నడరు నవ్వడముడిం దలపడి నీ కొడుకులు దుశ్శల చిత్రసేనకుండభేది వివింశతి దుర్ముఖ దుస్సహులును వికర్ణ శలవిందానువింద సుముఖ దీర్ఘబాహు సుదర్శన బృందారకులును సుహస్త సుషేణ దీర్ఘలోచనాభయ రౌద్రకర్మ సువర్మ దుర్విమోచనులును వివిధ విశిఖంబులు వరఁగించుటయు, లేళ్ళగమిం జూచి పొంగు సింగంబు చందంబునం జెలంగి యా శరంబులు వారించుచు వారిం గదిసి బృందారకుం దెగఁ జూచి యభయ రౌద్రకర్మ దుర్విమోచనులను మువ్వుర మూఁడు వెడండ దూపులం దునిమిన. 142
క. చలమునఁ బోవక పెనఁగిన | నల వేర్పడ నతఁడు విందు ననువింద సుశ
ర్ముల జంపి, సుదర్శను బె | ట్టిలపైఁబడి యపుడు సావ నేసె నరేంద్రా!
143
క. పెఱవారు వెఱచి నలుగడఁ | బఱచిన వాయుసుతుఁ డార్చి పఱపె రథం బా
తెఱపిన యరుగుట గని గురుఁ | డుఱక యతనిఁ దాఁకఁ గప్పె నుగ్రాస్త్రములన్‌.
144
వ. ఇట్లు నిలువరించి, నిటలంబున నారాచంబు నాటించి, యక్కుంభసంభవుండు దనమనంబున ‘వీఁడు వివ్వచ్చునట్లు నన్ననుసరింపఁ గలవాఁ’డని తలంచి యప్పవనతనయు నుద్దేశించి. 145
క. ‘నను గెలిచి కాక నీ కి | మ్మొన సొరఁగా నెట్లు వచ్చు? మును నీ తమ్ముం
డనుమతుఁడై కాదే చొరఁ | గనియె’ ననుడు నతఁడు గన్నుఁగవ గెంపారన్‌.
146
క. ‘నరుఁ డొక రథికుని యనుమతిఁ | జొరఁ దలఁచునె? మనుజ సేన సురబల మైనం
దెరలిచికొని విచ్చలవిడి | నరుగుం దనవలయు నెడకు; నది యట్లుండెన్‌.
147
చ. ప్రియములు వల్కి ని న్ననుసరింపఁగఁ బార్థుఁడు గాఁడు సుమ్ము! దు
ర్జయ భుజశక్తి నిర్మథిత శత్రుఁడు భీముఁడు గాని; నీవు దం
డ్రియు గురుడుం బ్రియుండు నని ప్రీతి యొనర్చెదఁ బూని వైరికిన్‌
జయ మొనరింతు గాక! యని సైఁతునె దర్పము సూపకుందునే?’
148
వ. అని పలికి. 149
మ. గద సారించి చెలంగి వైచిన భుజాగర్వంబు సాలించి య
మ్ముదుకం డుర్వికి దాఁటి పోయె; నది రశ్ముల్‌ మింటఁ బర్వంగ బె
ట్టిదమై మ్రోయుచు వచ్చి బల్పిడుగు మాడ్కిం దాఁకుడున్‌ గుఱ్ఱముల్‌
సదిసెన్‌, సారథి మ్రగ్గె, దేరు వొలిసిన్‌ సైన్యంబు భీతిల్లఁగన్‌.
150
వ. అప్పు డమ్మేటిమగండు. 151
క. మన మూఁక దఱిసి యుద్ధతిఁ | జనఁ జన నీనందనులు వెసం దాఁకియు ను
బ్బిన యతని వీఁక కోర్వక | కనుకని సిగ్గు సెడి పాఱఁగా గురుఁ డంతన్‌.
152
క. ఒండొక తే రెక్కి సము | ద్దండతఁ జని భీమసేనుఁ దాఁకి శరము లొం
డొండ నిగిడించి నొంచిన | గం డడఁగక యతఁడు గనలు గదిరిన మదితోన్‌.
153
చ. అరదము డిగ్గి యప్పటు శరావళి కోర్చి మొగంబు వాంచి స
త్వరుఁ డయి వాన పైఁ గురియ వంచిన మస్తక మొప్పఁ బోవు సుం
దర వృషభంబు లీలఁ జని దర్ప మెలర్పఁగ నొక్కచే నొగల్‌
వెరవునఁ బట్టి తేరు ప్రజ విస్మయ మందఁగ వీచి వైచినన్‌.
154
AndhraBharati AMdhra bhArati - AndhramahAbhAratamu - #00# parvamu - kavitraya bhAratamu - kavitrayamu - nannaya - tikkana - eRRana - nannyya tikkanna eRRana - andhramahabharatamu aandhramahaabhaaratamu ( telugu literature andhra literature )