| పురాణేతిహాసములు | శ్రీమహాభారతము | ద్రోణపర్వము - చతుర్థాశ్వాసము |
| ఆ. |
నుగ్గునూచ మైన నగ్గురుఁ డొండొక | యరద మెక్కి యల్ల నరిగె సేన మొగమునకు రయంబు మిగుల విశోకుఁడు | దేర భీముఁ డెక్కెఁ దేరు ప్రీతి. |
155 |
| వ. | ఇవ్విధంబున ధనురాచార్యు బెట్టు వఱచి బిట్టు సను నా జెట్టిబిరుదున కెదుర్పం జాలక భోజబలంబును గాంభోజానీకంబును యవనాది మ్లేచ్ఛ సైన్యంబులునుం బసులు పులికిం బాఱు తెఱంగునం గలంగి పఱచె;న న ట్లప్రతిహతగతిం బోయి సాత్యకి సమరోల్లాసంబు గనుంగొనుచు నట కడచి యవ్వడముడి దివ్యరథంబు మెఱయఁ గౌరవ్యయోధులతోడం బెనంగు సవ్యసాచిం జూచి సింహనాదంబు సేసిన, నతనిం గనుంగొని ప్రియంబున నయ్యర్జునుండును హరియును గర్జారవంబుల గగనంబు నినిచి; రమ్మహారవంబు లాకర్ణించి యుధిష్ఠిరుండు భీము సంజ్ఞాపనంబునకు సంతుష్టాంతరంగుండై తన లోనన యతని నగ్గించి యన్నర నారాయణుల యెలుంగులు వినం గనుటకుం బొంగుచు, నప్పార్థుండు దన ప్రతిజ్ఞ నెఱపి వచ్చి తన్నుం గౌఁగిలించికొనుటం గోరుచుం, గౌరవపతి యిమ్మెయిం దమ్ములు బంధులుం దెగంబొలియుట దెలిసి యయినను దీరునకుం జొచ్చి యున్నవారినైనం గాచి కొనునొకో! యని యూహించుచుఁ గయ్యంబు సేయుచుండె’ ననిన విని ధృతరాష్ట్రుండు సంజయున కి ట్లనియె. | 156 |
| ఆ. |
ఇట్లు సింహనాద మిచ్చిన భీముని | మార్కొనంగ మగఁడు మన బలమునఁ గలిగెనే మదాత్మజులఁ గాల్పఁ బుట్టిన | చిచ్చు వాఁడు; వానిఁ జెనయు టరిది. |
157 |
| చ. |
అనవుడు నాతఁ డిట్టు లను నమ్మనుజేంద్రు ‘కప్డు కర్ణుఁ డ య్యనిలతనూజు మార్కొని రయంబున వింశతి సాయకంబు లే సిన, నతఁడేడు తొమ్మిదులు చెచ్చెర నేసి సిడం బొకంట నే పునఁ గుదియించె నా రథికపుంగవు లట్లు దొడంగి యుద్ధతిన్. |
158 |
| వ. | పెనంగు నెడ భీమసేనుండు. | 159 |
| క. |
సూతసుతు విల్లు ద్రుంచిన | నాతఁడు బలు వింట నొంచె నతని వెస మరు త్సూతి యదియుఁ ద్రుంచుచు ద | త్సూతునిఁ దురగములఁ ద్రుంచె దుర్దమలీలన్. |
160 |
| ఆ. |
విరథుఁడై యతండు వృషసేను రథ మెక్కఁ | బాఱుటయును, గలఁగఁ బాఱె సేన; లట్టియెడ నృపాలుఁ డాచార్యు పాలికిఁ | జనియె తేరు దోలికొని రయమున. |
161 |