| ఇతిహాసములు | మొల్ల రామాయణము | యుద్ధ కాండము - తృతీయాశ్వాసము |
| వందిచేసిన రావణుని స్తుతి - చూర్ణిక | ||
| చూర్ణిక. |
జయజయ కైకసీగర్భసముద్ర సంపూర్ణ సుధాకరా! జయజయ మయతనూజామనోహరా! జయజయ రాక్షస కులసార్వభౌమా! జయజయ సాగరావరణలంకేశ్వరా! జయజయ పాకశాసనభద్రశ్రీహరణచతురా! జయజయ కుటిలవైశ్వానరపుటభేదనిర్ధూమధామా! జయజయ సమవర్తి సంపద్విచ్ఛేదకా! జయజయ దనుజవల్లభహల కల్లోలా! జయజయ యబ్ధీశ్వరతోయశోషణబడబానలా! జయజయ పవమానసంహారా! జయజయ యక్షనాయక దుర్వారగర్వాపహారకా! జయజయ యీశానైశ్వర్యహరణోద్యమా! జయజయ నవగ్రహానుగ్రహనిగ్రహా! జయజయ దశగ్రీవాలంకారా! జయజయ కైలాస నగేంద్రోత్పాటనకందుక క్రీడావినోదా! జయజయ భవానీశ్వర శ్రీపాదకమలశిరఃకంజాతపూజాసమర్థా! జయజయ పుష్పకారూఢ సకలదిగంతవిక్రాంతా! జయజయ బ్రహ్మవంశప్రదీపకా! జయజయ త్రిలోకవిజయా! రావణేశ్వరా! జయీభవ దిగ్విజయీభవ. |
29 |
| వ. |
అని వందిబృందంబు లుభయపార్శ్వంబుల జయజయ ధ్వనులతో బిరుదుగద్యపద్యంబులు వక్కాణింప ముక్తాతపత్రంబుల నడుమ మహిళామండలార్పితచామరపవనకంపిత కుంతలుండగుచు వీరరసంబు పురుషాకారంబు దాల్చినలీల నేతేర ముజ్జగంబులు గడగడ వడంకెఁ గులాచలంబు లొడ్డగిల్లెఁ జంద్రార్క మండలంబులు తడఁబడె నక్షత్రంబులు డుల్లెనట్టి సమయంబునఁ గరిబృంహితంబులు నశ్వహేషారవంబులును దనుజభటాట్టహాసంబులును సురత్రాసజనకంబులుగాఁ బటహనిస్సాణ భేరీశంఖకాహళ భాంకార రవంబులును బ్రతిధ్వనుల నీన నంత రావణుపై మేఘంబులు రక్తధారలు వర్షించె బిరుదధ్వజంబులు విఱిగిపడియెఁ దురంగంబుల వాలంబులనుండి నిప్పు లురలె దిక్కుల ధూమంబు నిబిడంబై పర్వెనట రామునిచే రావణుండు తెగుట యవశ్యంబని నభంబును మ్రోసె నట్టి సమయంబున. |
30 |
| క. |
భూనాయకుఁ డతివేగమ దానవసేనలకు నెదురు దార్కొని పోరన్ వానరసేనలఁ బంపెను భానుజముఖ్యాధిపతులఁ బౌరుష మడరన్. |
31 |
| మ. |
తరుశైలంబులతోడనార్చుచు భుజాదర్పంబు లుప్పొంగ వా నరవర్గంబు లెదిర్చి వచ్చునెడ నానాకారు లాదక్షిణో త్తరవార్ధుల్ ప్రకటించి డాయుగతి నుద్యత్ప్రౌఢిఁదార్కొంచు సం గరముంజేయఁగఁజొచ్చిరంతసురలాకాశంబునం జూడఁగన్. |
32 |
| సీ. |
కరుల నెక్కించి భీకరలీలఁ ద్రొక్కించి-వాజులఁ దోలి తీవ్రముగ నేయ రథములఁ బఱపి శిరంబులఁ జక్కాడి-చెలఁగి పదాతులఁ జేరి పొడువఁ బంతంబు చేకూఱఁ బ్లవగోత్తములఁ గేరి-తరువులుఁ బాషాణతతులుఁ బఱపి శైలంబు లడరించి సంహారములు సేయఁ-గలఁగక దైత్యులుఁ గపులు గలసి |
|
| తే. |
పోరునప్పుడు వానరవీరు లసుర-వరులమీఁదను భాషాణవర్ష మధిక లీలఁ గురియింపదనుజు లావేళ విఱిగి-తలలు వీడంగఁ బఱచిరి తత్తరమున. |
33 |
| సీ. |
మెండైన రథముల మీఁదికిఁ గుప్పించి-విక్రమ ప్రౌఢిమై విఱుగఁ ద్రొక్కి కరులకొమ్ములు పట్టి బిరబిర వడిఁ ద్రిప్పి-జగతీస్థలంబున జదియఁ గొట్టి తొడరి సైంధవకోటి తడకాళ్లు విదళించి-పట్టి పెన్ జెక్కలు వాఱఁగొట్టి కాల్బలంబులపైకిఁ గదిసి శస్త్రంబుల-తోడఁ గూడనె చుట్టి తునియఁ గొట్టి |
|
| తే. |
ఛత్రములు గూల్చి చామరసమితి విఱిచి-కెరలి యార్చుచు బిరుదుటెక్కెములు చించి వాద్యసంఘంబు లవలీల వసుధఁ గూల్చి-కపులు దోలిరి దానవగణము నెల్ల. |
34 |