| కవితలు | బసవరాజు అప్పారావు గీతాలు | 123. చందమామ |
| 123. చందమామ |
| తెల్లమబ్బు గుఱ్ఱము నెక్కి తేజరిల్లి స్వారిజేయుచు బోవు నో చందమామ! యేల నీ కంతగర్వము? ఎల్లకాల మొక్కతీరుగ సంపద లుండునోయి? |
| పండువెన్నెల జగమెల్ల బర్వజేసి అందరిమనంబుల\న్ గొని హాయి ముంచి, ఎల్లలోకాలకును రాజు నేనె యంచు కుల్కుచుందువుగా వెఱ్ఱిగొల్లవోలె |
| కష్టసుఖ మెఱుగని పసికందుబిడ్డ చందమున గంతులేసెదు చందమామ! కాలపరిపాకమున నీకు గల్గబోవు గతి దలంపుము నిశ్చలమతిని సుంత! |
| అంధకార మలీమసం బౌచు జగతి ప్రళయకాలమహాబ్ధి నిర్మగ్న యట్ల చూడ దుర్బేధ్య మౌనప్పు డేడ బోవు నీదు రాచఱికంబు వెన్నెలయు, చంద్ర! |
| కష్టభాగ్యుడనౌ నన్ను గాంచి మంద హాసమున పరిహసించెద వౌర, చెలియ చెంత లేదనియేన? నీవింత యొడలు మరచి నన్నిట్లు మతిమాలి పరిహసింతు? |
| పలవ! పోపొమ్ము నీతోడ వాదులేల? చలువ తిన్నియపై ముద్దు చెలియమోము మోహపారవశ్యంబున ముద్దు గొంచు బుద్ధి జెప్పింతు పొమ్ము నీ పొగరడంగ. |