| కవితలు | బసవరాజు అప్పారావు గీతాలు | 124. కోయిల |
| 124. కోయిల |
| కూ యనుచు దీనముగ గూయు కోకిలమ్మ! చింత నీకేలనే? యెంతో సంతసమున సరసపల్లవ భాగ్యవసంతమందు గున్నమావులపై నెక్కి కోర్కిదీర |
| లేజివుళ్ళను మెక్కుచు, లేతమనసు గల పులుగ వౌట రాగంబు నిలుపలేక హాయిచే సోల లోకంబు కూ యటంచు కూయుదువు గాదె నెమ్మది కోర్కులూర! |
| పరమసంతోషయుత గానపారవశ్య కలననొడ లెఱుంగకను జగంబు మరచి విస్ఫుటంబుగ బాడు నీ విమలగీతి నేడిటుల నింత దీనమౌనేమి చెపుమ? |
| వెఱ్ఱిలోకంపు గోలను వెక్కిరింప మావి కడగొమ్మ గూర్చుని మధురఫణితి మనసు కరుగంగ 'నేల నో మనుజులార పోరు?' లని ప్రేమతత్వంబు బోధసేతె? |
| వెన్నెలల చంద్రుడెల్లెడ విరియజల్లి వలపుకలిమిని మోమెల్ల చెలువుగుల్క మోహమున మొగిలుకన్నియ మోము ముద్దు గొనెడు చందము గాంచుమా కోకిలమ్మ! |
| అందరును సంతసమ్మున నలరువేళ తాలవృక్షంపుటాకుల దాగి యేల కో యనుచు విలపించెదు కోకిలంబ? చెలియ నెడబాసినావె వెన్నెలవేళల? |
| ఇల గల వియోగులందున నేనె కష్ట భాగ్యుడ నటంచు లోలోన వగచుచుండ, జత కుదిరినావె నావలె వెతల గుంద దుర్దశల వింతస్నేహితుల్ దొరుకుదురుగ! |
| చెలియ నెడబాసి నెమ్మది చింత గుందు నేను పాల్గొనగల జుమీ నీదువెతల కష్టముల చవిజూచినగాని పరుల వెతలగాంచి కన్నీళ్ళను విడువగలమె? |
| మధురఫణితి కూ కూ యని మనసు కరుగ సొదల జెప్పుచు చింతల సోలజేయ గలవు నీ దీనమృదుగానకలన నదియె నేరకుండిన వగతుమే నీదుగతికి? |
| అకట! నీ గానమహిమ నాకబ్బెనేని మాటలం జెప్పగారాక మదిని పొంగి పొరలెడు వియోగదుఃఖంపుతరగ లేచి జగతి చింతల ముంపగా జాలదొక్కొ? |