| కవితలు | బసవరాజు అప్పారావు గీతాలు | 125. నీటి బుగ్గలు |
| 125. నీటి బుగ్గలు |
| జీవమా! చెలి నీకై సృజింప బడెనె అట్టిదానివి నీవెట్టు లవల ద్రోతు? ధనము ఘన మొకొ? సౌఖ్యసాధనము ఘనమొ చిత్తమా! నీవె యోచించి చెప్పరాదె! |
| చెలియయున్ జక్కదనమున చిన్నవౌదు, తెలివి గలది సద్గుణశీల, దీపమౌను నాదు గృహమున కట్టి యా నాతి విడువ చిత్తమా! యెట్లు యోచన జేసితీవు? |
| చెట్టబట్టెదుగా వేరు చెలి నెవతెనొ అల్ల యా నాతి మంచి దౌనంచు నీకు నమ్మక మదేమి? బ్రతికినన్నాళ్ళు కష్ట కూపమున మున్గి చచ్చిపోగోరుకొనెదె? |
| చేతనున్నట్టి ధనమును జేతులార పారవేయునె యెంత నిర్భాగ్యుడైన? నీటిబుగ్గల నమ్ముకు నేటదుముక కొట్టుకొనిపోవె, యో వెర్రి కుట్టి మనమ? |
| వేగిరము వద్దు, చనవద్దు వెర్రినిబడి, ప్రేమ మది బూని యోచించు వెనుకముందు చేతి ధనమును వీడకు చేతులార, నీటిబుగ్గలపై వలదేట దుముక! |