| కవితలు | బసవరాజు అప్పారావు గీతాలు | 126. తెలియనివలపు |
| 126. తెలియనివలపు |
| ఎంతటి చపలుండ నైతి నెంతటి మందమతినైతి సుంత జ్ఞానమున్న కలనె ఇంతి నీదుప్రేమ మఱువ? |
| గీ. చేతులను నెత్తి ముద్దాడి చెలియ! నిన్ను చంక నెత్తుకు నాడించి సంబరపడి మూపు నుప్పుప్పుగోనెలు మోసి మురిసి కడ కిటుల గంగ గల్పితి జ్ఞానమెల్ల! |
| గీ. 'బాల! నీపతి యెవ' రన్న 'బావ' యనుచు ముద్దులొల్కెడి మోముపై ముసిముసి నగ వల్ల నల్లన మెఱయంగ నాత్మ వెలుగు ప్రణయముం దెల్పుదువుగాదె ప్రాణసఖియ! |
| గీ. వెఱ్ఱిలోబడి, మతివోయి వెంగలినయి దైవికములగు ప్రేమబంధముల ద్రెంచు పాపకర్మము దలపెట్ట పడతి! నీవు మంచిపని గాదనుచు బుద్ధి మరువలేదె? |
| గీ. ఎప్పుడింటికి వచ్చునా ఎపుడు కనుల కరువు దీరంగ గాంతునా కాంతు నంచు కలలసైతము నాకయి కలువరించు చెలియ నీవుండ నా సిరి చెప్పనౌనె? |
| కన్నె! చపలత వోయె నింక ప్ర సన్నవై నన్నాదరింపవె! విన్నపముగొని మరువగదె నా చిన్నతనపు బనుల్. |
| సత్య మరయంగల్గి తిప్పుడు సఖియరో నా భాగ్యవశమున కుదుటపడె నెమ్మనము, నావగు కోర్కు లీడేరున్. |
| కష్టసుఖముల నొక్క తీరై కలుగుదానిం దృప్తి గడుచుచు చింత లేమియి లేక ముదమున జెలగుదము చిరము. |
| బ్రతికియున్నన్నాళ్ళు నొండొరు బాయకుండగ ప్రేమసంద్రము నీదుదము చల్లనౌ చూపుల నీశ్వరుడు చూడన్. |