| కవితలు | బసవరాజు అప్పారావు గీతాలు | 127. ముసిడిపండు |
| 127. ముసిడిపండు |
| మరకత మాణిక్య మనుచు మనసుపడితి గాదె మనమ? కైవశమయినంతనె యది గాజుపూస యయ్యె నొక్కొ? |
| బంగరుగని యంచు నెంతొ బ్రమసి బ్రమసి మురిసితీవు చితమెల్ల సురిగిపొవ నిత్తడిగా మారె నొక్కొ? |
| అమృతఫలమ్మంచు నెంతొ యాసపడితి గాదె మనమ! నోట నిడినయంత కాల కూటవిష మ్మయ్యె నొక్కొ? |
| పూలహారమనుచు నెంతొ పొంగి మెడను దాల్చినావు కంఠసీమ జేరినంత కాలసర్ప మయ్యె నొక్కొ? |
| ప్రణయరత్న మనుచు మేను పరవసమై గంతులిడితి కౌగిలింప రక్త మాను గబ్బిలముగ మారె నొక్కొ? |
| మరకత మాణిక్య మనుచు మనసు పడితిగాదె మనమ! |