| కవితలు | బసవరాజు అప్పారావు గీతాలు | 018. దొంగ కృష్ణుడు |
| 18. దొంగ కృష్ణుడు (రాధికా గీతము) |
| నల్లవాడే గొల్ల పిల్లవాడే చెలియ కల్లగాదే వాని వల్లో జిక్కితినే! నల్ల... |
| వచ్చినాడే తోట జొచ్చినాడే సకియ చొచ్చి నాదౌ మనసు ముచ్చిలించాడే! నల్ల... |
| ఆగినాడే పొదల దాగినాడే మనసు రాగబంధమువేసి లాగుకొన్నాడే! నల్ల... |
| చూచినాడే మోము దాచినాడే నాదు దాచుకొన్నా వలపు దోచుకున్నాడే! నల్ల... |
| చేరినాడే చెంత చీరినాడే చేర కోరి చేరా బోవ పారిపోయాడే! నల్ల... |
| పాడినాడే చనుచు ఆడినాడే మదిని చేడె! అతనిపాట వీడకున్నాడే! నల్ల... |
| ఊదినాడే మురళి చేదినాడే వలపు నాదుమది తనరూపు పాదుకొలిపాడే! నల్ల... |
| చూడలేనే మమత వీడలేనే వాని జోడుకూడని ఉసురు వీడిపోనీవే! నల్ల... |