| కవితలు | బసవరాజు అప్పారావు గీతాలు | 019. రాధికా గీతము |
| 19. రాధికా గీతము |
| నా మోహపున్ తున్క నా నోముల ఫలమ్ము నా నాథుడేల రాడే? అయ్యయో నను వీడిపోయినాడే! |
| నా జీవితేశుండు నాదు వలపుల ఱేడు నా కృష్ణుడేల రాడే? అయ్యయో నను మరచిపోయినాడే! |
| చిన్నతనముననుండి తన్నె ప్రేమించినా కన్నెప్రేమము మరచెనే అయ్యయో నన్ను మరచిపోయెనే! |
| చిరినవ్వు మోముతో చెలువొందు నా సామి శ్రీకృష్ణుడేల రాడే అయ్యయో చింతలను ముంచినాడే |
| నిండుచందురు బోలు నెమ్మోము గలవాడు నాసామి తావచ్చునే? చెలియరో! నాకోర్కె లీడేర్చునే? |
| నెమలి పింఛములతో కొమ రొప్పు మౌళి గల సుందరాంగుడు వచ్చునే? చెలియరో! అందమును జూపించునే? |
| పాలు దీయుచునుండ పైనబడి బలిమిమై పాలనన్నియు ద్రావునే ఈకున్న పసిబాలువలె పోరునే! |
| పని జేసిచేసిట్టె కునికినంతనె చేరి కనులు రెండును మూయునే యెవ రంచు నను పరవశం జేయునే! |
| వనములో తా నుంట తన రాధకుం దెల్ప వేణుగానము సేయునే హాయిగా ప్రాణ ముప్పొంగించునే! |
| నను జేరి పొదరిండ్ల తనువు పులకలు జెంద రాధ కౌగిట దేల్చునె నా సామి రాధ చింతల జీల్చునే! |
| సోగ కన్నుల ప్రేమ రాగ మొలుకంగ నీ లోకమును మరపించునే! నామనో లోలత్వముం బాపునే! |
| ఆనందమయమైన యీ ప్రేమరాజ్యమ్ము రాధ రాణిగ నేలునే చెలియరో రాధపున్నెము పండునే! |