| కవితలు | బసవరాజు అప్పారావు గీతాలు | 024. గోపికా గీతములు 3 |
| 24. గోపికా గీతములు-3 |
| తలుపు తీయునంతలోనె తత్తర మదియేల నోయి? తలుపుదీతు వీలు జూచి తాళుము కృష్ణా! కొంతసేపు తాళుము కృష్ణా! |
| పతి నిద్దుర వోవలేదు మతి సందియ మొందె నేమొ పతికి కునుకు పట్టగ లో పలకు వత్తుగాని తాళు తాళుము కృష్ణా! కాస్తసేపు తాళుము కృష్ణా! |
| నుదుట బొట్టు దిద్దలేదు చెదరియున్న ముంగురులను కుదురుజేయలేదు యేల పదెపదె పిలచెదవురా తాళుము కృష్ణా! కాస్తసేపు తాళుము కృష్ణా! |
| ఏల నంత తత్తరమ్ము ఏల నంత భయము, సామి నిన్నుగాక వేరొక్కని నెట్లు వలవగలను కృష్ణ! తాళుము కృష్ణా! కాస్తసేపు తాళుము కృష్ణా! |